: ప్రముఖ ఒడిస్సీ డాన్సర్ గూబ గుయ్యిమనిపించిన పూజారి
ఇటలీలో పుట్టి ఒడిశా వచ్చి ఒడిస్సీ నృత్యంలో ప్రావీణ్యం గడించి, 2006లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును గెలుచుకుంది ఇలియానా సిటారిస్టి. కానీ, ఆమెకు భారతగడ్డపై ఊహించని అవమానం ఎదురైంది. పూరీలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా స్వామికి నమస్కరించుకోవాలని రథంపైకి ఎక్కింది. కానీ, పైన ఉన్న పూజారి గూబమీద ఒక్కటిచ్చారని, ఆయన అడిగిన 1000 రూపాయలు ఇవ్వనందునే అలా ప్రవర్తించారని ఇలియానా ఆలయ ఈవోకు ఫిర్యాదు చేసింది. పక్కనే ఉన్న మరో ఇద్దరు అర్చకస్వాములు తనను విదేశీయురాలని దూషిస్తూ రథం నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. శ్రీ జగన్నాథస్వామి ఆలయం ఈవో అరబింద కుమార్ పాండే మాట్లాడుతూ.. జరిగిన దానిపై విచారం వ్యక్తం చేశారు. తదుపరి చర్యల కోసం ఇలియానా ఇచ్చిన ఫిర్యాదును స్థానిక పోలీస్ స్టేషన్ కు పంపించామని చెప్పారు.