: చెట్లకూ ఉందో క్రమం


మనుషులకు ఒక క్రమబద్ధమైన జీవన విధానం అలవడి ఉంటుంది. ఒక సమయానికి నిద్ర లేవడం, ఒక సమయానికి భోజనం చేయడం, ఒక సమయానికి నిద్ర పోవడం వంటి పనులకు సంబంధించి ఒక క్రమబద్ధమైన చర్య జరుగుతూ ఉంటుంది. మొత్తంగా మనుషులు పగలు చాలామంది చురుగ్గా ఉంటారు. రాత్రి పూట కాస్త బద్దకంగా ఉంటారు. ఇదే జీవగడియారం. అయితే మనుషులకు ఇలా జీవగడియారం ఉన్నట్టే చెట్లకు కూడా జీవ గడియారం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అవి కూడా మనుషుల్లాగే ఒక నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం, ఒక నిర్ణీత వేళకు వెలుగుని స్వీకరించడం వంటి పనులను నిర్వహిస్తున్నాయని శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో తేలింది.

ఆష్ట్రేలియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు మనుషులకు, జంతువులకు జీవ గడియారం ఉన్నట్టు చెట్లకు కూడా ఉంటుందా? అనే దిశగా పరిశోధన సాగించారు. మనుషులు పగలైతే చురుగ్గా ఉండడం, ఆకలి వేసినపుడు ఆహారం తీసుకోవడం, రాత్రి పూట నిద్రపోవడం వంటి చర్యలన్నీ జీవగడియారం ప్రకారమే సాగుతుంటాయి. ఈ వ్యవస్థనే జీవలయం (సర్కాడియన్‌ రిథమ్‌) అంటారు. అయితే ఇలాంటి జీవ గడియారం అనేది ఇప్పటి వరకూ మనుషులకు, జంతువులకు మాత్రమే ఉండేది, చెట్లకు సంబంధించి వాటి ఆకులకు మాత్రమే ఉండేదని భావించేవారు. అలా కాకుండా చెట్టు మొత్తానికి జీవగడియారం ఉంటుందని శాస్త్రవేత్తలు తాము నిర్వహించిన పరిశోధనలో తేల్చారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆష్ట్రేలియాలోని హోల్‌ ట్రీ ఛాంబర్స్‌లో ఒక ప్రత్యేకమైన పరిశోధన చేశారు. ఈ పరిశోధన కోసం తాస్మానియన్‌ నీలి జిగురు చెట్టును ఎంచుకున్నారు. ఈ చెట్లు నీటి ఆవిరిని సూర్యాస్తమయం తర్వాత తక్కువగాను, సూర్యోదయానికి ముందు ఎక్కువగాను తీసుకుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా ఈ చెట్టుకు మామూలు కంటే భిన్నంగా రాత్రిపూట వెలుగు, నీటి ఆవిరి, తేమను రకరకాల స్థాయిల్లో అందించారు. అయితే ఈ తేడా ఎంతగా ఉన్నా కూడా ఆ చెట్టు నిర్దిష్ట వేళల్లో నీటి ఆవిరిని తీసుకునే పద్ధతిలో మార్పురాలేదని, చెట్టుకు కూడా జీవగడియారం ఉండడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News