: వరద ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు ఈసీ పచ్చజెండా
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్నికల కోడ్ అడ్డు చెప్పదని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాక పాఠశాల భవనాలు, కార్యాలయాలను బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు సూచించామని తెలిపారు. వరద ప్రాంతాల్లో పరిస్థితిపై నివేదిక కోరామని అవసరమైతే ఆ ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేస్తామని చెప్పారు. అయితే, రాష్ట్రంలో 6,189 సమస్యాత్మక గ్రామాలు.. 5,810 అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు చెప్పారు.
హైదరాబాదులోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ ..ఇప్పటివరకూ రూ.12,56,92,260 డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 10,790 మద్యం గొలుసు దుకాణాలు తొలగించినట్లు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలకు లక్షా 8వేల 650 మందిని సూక్ష్మ పరిశీలకులుగా నియమించినట్లు వెల్లడించారు.