: డీ-డే.. కథ పాతదే కానీ..


నలుగురు రా ఏజెంట్లు ఓ మాఫియా డాన్ ను పట్టుకునేందుకు చేసే వీరోచిత కథాంశంగా డి-డే చిత్రాన్ని పరిగణిస్తే మాత్రం పొరబడినట్టే. ఓ స్పై థ్రిల్లర్ లా కాకుండా, భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఈ చిత్రం కచ్చితంగా సమ్ థింగ్ డిఫరెంట్ అనవచ్చు. తెలిసిన కథను హృద్యంగా ఎలా చెప్పవచ్చో దర్శకుడు నిఖిల్ అద్వానీ ఈ సినిమా ద్వారా చాటాడు. కథ విషయానికొస్తే.. భారత్ నుంచి పరారై పాకిస్తాన్ లో ఆశ్రయం పొంది అక్కడి నుంచే అధోజగత్తును శాసిస్తుంటాడు మాఫియా డాన్ ఇక్బాల్. అతన్ని పట్టుకునేందుకు నలుగురు రా ఏజెంట్లు చేసే ప్రయత్నమే ఈ సినిమా.

మాఫియా రారాజుగా రిషి కపూర్.. రా ఏజెంట్లుగా అర్జున్ రాంపాల్, ఇర్ఫాన్ ఖాన్, హుమా ఖురేషి, ఆకాశ్ దహియా తమతమ పాత్రలకు జీవం పోశారన్నది వీక్షకుల మాట. ముఖ్యంగా రిషి కపూర్ ఆహార్యం అచ్చు దావూద్ ఇబ్రహీంను తలపించడం విశేషం. ఆయన కూడా దావూద్ తరహా మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు.

మరో విషయం ఏంటంటే.. లీడ్ రోల్ పోషించిన అర్జున్ రాంపాల్ సినిమాలో అనాథ కావడంతో అతడికి ఓ జోడీని అతికించాలి కాబట్టి.. పాకిస్తానీ వేశ్యగా శృతి హాసన్ ను నటింపజేశారు. పెద్దగా ప్రాధాన్యం లేకున్నా కాస్తంత కథకు ఉపయోగపడే పాత్ర శృతి హాసన్ ది. ఇక ఎత్తుకుపైఎత్తులు వేస్తూ డాన్ ఇక్బాల్ ను ట్రాప్ చేసే క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు రక్తి కట్టించాడు.

ముఖ్యంగా డాన్ ఇక్బాల్ కుమారుడి వివాహం సందర్భంగా వచ్చే 'దమ్ ఆ దమ్' పాట పిక్చరైజేషన్ పరంగానూ, అటు కెమెరా, ఎడిటింగ్ వర్క్ పరంగానూ ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ సినిమా అర్జున్ రాంపాల్ కెరీర్లో మరపురాని చిత్రమవుతుందనడంలో సందేహం అక్కర్లేదు.

వర్ధమాన నటి హుమా ఖురేషి.. జోయా రెహ్మాన్ పాత్రలో తన పరిధిలో చక్కగా మెప్పించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. సంగీత దర్శక త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ దే ఆ క్రెడిటంతా. మొత్తమ్మీద ప్రేక్షకుడిని రంజింపజేసే అన్ని మసాలాలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు.

  • Loading...

More Telugu News