: కత్తుల్లో 'స్మార్ట్‌ కత్తి' వేరయా


మీకు కత్తి గురించి తెలిసే వుంటుంది. ఎందుకంటే, మన రోజువారీ జీవితంలో దానితో ఏదో ఒక సమయంలో అవసరం రాకుండా పోదు. అయితే ఈ కొత్త కత్తి మాత్రం మహా స్మార్టు. ఎందుకంటే ఇది స్మార్టు కత్తి కాబట్టి. ఇది మనం మామూలుగా వాడేందుకు మాత్రం కాదులెండి. ఆపరేషన్లు వంటి సమయాల్లో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని, మనం ఆపరేషన్‌ సమయంలో ఏదైనా చిన్న పొరబాటు చేస్తే ఈ కత్తి వెంటనే మనకు తెలియజేస్తుందని ఈ కత్తిని తయారు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త జోల్టన్‌ తకత్స్‌ ఒక కొత్తరకం కత్తిని తయారు చేశారు. ఈ కత్తితో ఆపరేషన్లు ఎంచక్కా చేసేయవచ్చని చెబుతున్నారు. క్యాన్సర్‌ వ్యాధి వచ్చిన వారికి క్యాన్సర్‌ కణితిని కత్తితో కోసేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్‌ సమయంలో పొరబాటున క్యాన్సర్‌ కణజాలంతోబాటు మంచి కణజాలాన్ని కూడా వైద్యులు కోసేస్తే... ఇలాంటి భయం రోగుల్లో సహజంగానే ఉంటుంది. అయితే ఈ కొత్త కత్తితో అలాంటి భయాలు అక్కర్లేదని జోల్టన్‌ చెబుతున్నారు. ఎందుకంటే పొరబాటున మంచి కణజాలాన్ని కట్‌ చేస్తే వెంటనే సదరు కత్తి ఆ విషయాన్ని వైద్యులకు తెలియజేస్తుందట. ఈ స్మార్ట్‌ కత్తిపేరు 'ఐనైఫ్‌'. ఈ కత్తితో వైద్యులు తాము కట్‌ చేస్తోంది క్యాన్సర్‌ వ్యాధి సోకిన కణజాలాన్నా లేక మంచి కణజాలాన్నా? అనే విషయాన్ని ఇది అప్పటికప్పుడే వైద్యులకు తెలియజేస్తుందట. దీంతో వ్యాధి సోకిన కణాన్నిమాత్రమే తొలగించేందుకు వైద్యులకు చాలా సులువవుతుందని ఆయన చెబుతున్నారు.

ఇప్పటి వరకూ 91 మంది రోగుల్ని ఈ కత్తితో పరీక్షించగా ఇది వందశాతం కచ్చితత్వంతో పనిచేసిందని జోల్టన్‌ చెబుతున్నారు. అయితే ఇదివరకే సర్జరీలో ఎలక్ట్రానిక్‌ పరికరాల సాయంతో ఆపరేషన్‌ చేసేందుకు వీలుగా 'ఎలక్ట్రో సర్జరీ' టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రోసర్జికల్‌ కత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కత్తులు విద్యుత్తు సాయంతో కణజాలాన్ని వేగంగా వేడెక్కిస్తాయి. దీనివల్ల కణజాలంలోని నీరు ఆవిరై, కోసేటప్పుడు రక్తస్రావం అధికంగా జరగదు. రసాయనాలను విశ్లేషించే మాస్‌ స్పెక్ట్రోమీటర్‌ను అమర్చి ఈ ఐనైఫ్‌ను తయారు చేశారు. అందువల్ల ఆపరేషన్‌ చేసేటప్పుడు దీనినుండి సమాచారం ఎప్పటికప్పుడు ల్యాబ్‌కు చేరుతుంది. ఏ కణజాలాన్ని కోస్తున్నారన్నది ల్యాబ్‌లో కేవలం మూడు సెకన్లలో తెలిసిపోతుంది. దీంతో ల్యాబ్‌నుండి వచ్చే సమాచారం చూసుకుంటూ వైద్యులు తమ ఆపరేషన్‌ను పూర్తి చేస్తారు.

  • Loading...

More Telugu News