: ఈమె కలియుగ సావిత్రి!


గుజరాత్ కు చెందిన హీనా పటేల్ ను సతీ సావిత్రితో పోల్చుతోంది జాతీయ మీడియా. తాజాగా సంభవించిన ఉత్తరాఖండ్ విలయం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందులో వేలాది మంది మృత్యువాత పడ్డారు. అయితే గుజరాత్ కు చెందిన హీనా పటేల్ భర్త అరవింద్ పటేల్ కాశీ, కేదార్ నాథ్ సందర్శనకు వెళ్లారు. వరదలు చుట్టుముట్టడంతో అతని నుంచి హీనా పటేల్ కు ఏ రకమైన సమాచారం అందలేదు. దీంతో చుట్టుప్రక్కలవారంతా అరవింద్ చనిపోయి ఉంటాడన్న అనుమానం వ్యక్తం చేశారు. వరదల్లో కొట్టుకుపోయి ఉంటాడన్నారు. అయినా సరే తను అధైర్యపడలేదు. అందర్లా అధికారులపై ఆధారపడలేదు.

తన భర్త చావలేదని గట్టిగా నమ్మింది. తనంత తానుగా తన భర్తను వెతుక్కునేందుకు బయల్దేరింది. ఉత్తరకాశీ వెళ్లి వెతికింది, అక్కడ ఆమె భర్త జాడలేదు. అక్కడ్నుంచి అతి కష్టమైన శాంతి కుంజ్ నడక మార్గాన బయల్దేరింది. అక్కడా వెతికింది, త్రోవలో ఎన్నో శవాలు, అన్నింటినీ పరిశీలిస్తూ అదరక బెదరక సాగింది. అక్కడా అతని జాడ లేదు. దీంతో కేదార్ నాథ్ లో అతను కచ్చితంగా ఉంటాడని నమ్మింది. దీంతో కేదార్ నాథ్ బయల్దేరింది. సైనికులు ఆమెను నిలువరించారు. అయినా చలించలేదు, తన భర్తను వెతికేందుకు వారి సాయం అక్కర్లేదంది. కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, లోయలు ఎక్కుతూ దిగుతూ తిండి తినీ తినక నడక సాగించింది.

అలుపెరగని నడక కారణంగా అనారోగ్యానికి గురై, సృహతప్పి పడిపోయింది. గాలింపు చర్యల్లో ఆమెను గుర్తించిన భద్రతా దళాలు ఆమెను శాంతి కుంజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాయి. కాగా ఆమె భర్త అంతకు ముందే కేదార్ నాథ్ అటవీ ప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో సైనికుల కంట బడడంతో అతన్ని ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతను ఈ నెల 7 వ తేదీన కోలుకుని తన భార్యకు పోన్ చేస్తే ఆమె కేదార్ నాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని వెల్లడించారు.

దీంతో అతను సరాసరి ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి రెండు రోజులు ఆమెకు సపర్యలు చేశాడు. ఆమె ఈ నెల 9 వ తేదీన కోలుకుని తన ప్రక్కనే ఉన్న భర్తను చూసి ఆనందాశ్చర్యాలకు లోనైంది. కష్టనష్టాలకోర్చి అలుపెరగకుండా తన భర్త కోసం వెతుకులాట సాగించిన హీనా పటేల్ ను కలియుగ సావిత్రి అంటున్నారు ఉత్తరాది ప్రజలు.

  • Loading...

More Telugu News