: ఇటు రక్షించినా అటు భక్షిస్తుంది!
మన శరీరంలోని ఒక రకమైన ఎంజైము మనల్ని హెచ్‌ఐవీ వంటి భయంకరమైన ప్రాణాంతకమైన రోగం బారినుండి మనల్ని కాపాడుతుంది. అయితే మనం దీనికి సంబంధించిన సంతోషాన్ని అనుభవించేలోగా అదే ఎంజైము మనల్ని కేన్సర్ మహమ్మారి బారిన పడేలా చేస్తుంది. దీంతో ఒకవైపు రక్షించడం, మరోవైపు భక్షించడం లెవలైపోతుంది... సదరు రోగి ప్రాణం ఏదో ఒక రోగంతో పోతుందని వైద్యులు చెబుతున్నారు.
మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 'ఏపీఓబీఈసీ3బీ' అనే ఎంజైము పలు రకాల కేన్సర్ కణాలకు కారణమవుతోందని గుర్తించారు. వీరు 19 రకాల కేన్సర్ కణితుల నమూనాలను విశ్లేషించారు. ఈ నమూనాల్లో 'ఏపీఓబీఈసీ3బీ' అనే ఎంజైము ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. మూత్రాశయం, గర్భాశయం, తల, మెడ, రొమ్ముతోబాటు రెండు రకాల ఊపిరితిత్తులకు సంబంధించిన కేన్సర్లలో ఈ ఎంజైము కీలక పాత్ర పోషిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి ఈ ఎంజైము ఆరోగ్యంగా ఉండే కణజాలాలలో తక్కువ మోతాదులో కనిపిస్తుంది. కానీ కేన్సర్ కణజాలంలో మాత్రం ఇది ఎక్కువ మోతాదులో కనిపిస్తుందని పరిశోధకులు గుర్తించారు.
రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ఈ ఎంజైము హెచ్‌ఐవీ వంటి ప్రమాదకరమైన వైరస్‌లనుండి ఆరోగ్యవంతమైన కణాలను కాపాడుతుందని ఈ విధంగా ఒకవైపు రక్షణ కల్పిస్తూనే, మరోవైపు కేన్సర్ వ్యాధికి ఇది కారణమవుతున్నట్టు తమ తాజా పరిశోధనల ద్వారా వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి ఈ ఎంజైము వల్ల లాభంతోబాటు నష్టం కూడా ఉందని, ఈ నష్టాన్ని నియంత్రించేలా చేస్తే ఇది ఎంతో ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.