: బంగారం దిగుమతులను నిషేధించలేం : చిదంబరం
బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదని ఆర్ధిక మంత్రి చిదంబరం అన్నారు. దానిపై తమకు ఎలాంటి అజమాయిషీ లేదని చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అయితే, విదేశాలతో భారత్ జరిపే లావాదేవీలపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 కంటే ఎక్కువగానే ఉంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆహార భద్రత పథకంను దేశవ్యాప్తంగా 20 శాతం మంది ప్రజలకు అమలు చేస్తామని తెలిపారు.
దీని అమలుతో పౌష్ఠికాహారం, ఆకలి బాధలు తదితర సమస్యలను పారద్రోలవచ్చన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆహార భద్రత ఆర్డినెన్సుపైనే మొదట చర్చ చేపడతామన్నారు. బ్యాంకులు తీసుకునే అదనపు రుణాలపై వడ్డీ రేటును రిజర్వు బ్యాంకు పెంచిన ఫలితంగా.. బ్యాంకులూ వడ్డీరేట్లు పెంచుతాయని భావించడం లేదన్నారు.