: వాళ్లు నన్ను మోసం చేశారు: ద్రవిడ్
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. శ్రీశాంత్, అంకిత్ చవాన్, చండీలా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులైన ఈ ముగ్గురూ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి అనంతరం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, వీరు ముగ్గురు తనను మోసం చేశారని భావిస్తున్నట్లుగా ద్రవిడ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో పోలీసులు ద్రవిడ్ సాక్ష్యాన్ని కీలకంగా పరిగణిస్తున్నారు. ద్రవిడ్ వాంగ్మూలాన్ని అతడి నివాసంలోనే రికార్డు చేశారు. ఆ ముగ్గురు ఆటగాళ్లను తాను నమ్మానని, అవసరాలకు అనుగుణంగానే వారిని జట్టులోకి తీసుకున్నానని, వారి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం తనకు తెలియదని ద్రవిడ్ లోగడే స్పష్టం చేశారు.
ఇదే జట్టుకు చెందిన మరికొందరు ఆటగాళ్ల స్టేట్ మెంట్లను కూడా పోలీసులు రికార్డు చేయనున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ కోచ్ ప్యాడీ ఆప్టన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉండగా.. భారత్ కు వచ్చిన తర్వాత ఆయన స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసి, అనంతరం, పోలీసులు కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేస్తారని తెలుస్తోంది.