: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5 నుంచి
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోగా తెలంగాణ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈలోపే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిపి ఏదోఒక నిర్ణయం వెలిబుచ్చాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇక ఇటీవలే ఆహార భద్రత బిల్లుపై ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన యూపీఏ సర్కారు రేపటి వర్షాకాల సమావేశాల్లో ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకునేందుకు శతధా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ఆర్డినెన్స్ జారీ అయిన నాటినుంచి ఆరువారాల్లోపు సభ ఆమోదం పొందకపోతే బిల్లు వీగిపోతుంది. ఇంకా ఈ సమావేశాల్లో ప్రత్యక్ష పన్నుల విధాన బిల్లు, రియల్ ఎస్టేట్ క్రమబద్ధీకరణ బిల్లు, సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నారు.