: భూటాన్ తో బలపడనున్న భారత్ బంధం.. ప్రధానిగా షేరింగ్ తాబ్ గే
భూటాన్ లో జరిగిన రెండో జాతీయ ఎన్నికల్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రధానిగా షేరింగ్ తాబ్ గే ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ ప్రధానిగా ఉన్న జిగ్మే ధిన్లే విధానాల పట్ల భారత ప్రభుత్వం గుర్రుగా ఉంది. చైనాకు దగ్గరయ్యేలా వ్యవహరిస్తున్నందున.. ఎన్నికల ముందు భూటాన్ కు సబ్సిడీ గ్యాస్, డీజిల్ సరఫరాను నిలిపివేసింది. దీంతో జిగ్మే ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. అది పరోక్షంగా ప్రతిపక్షానికి సహకరించడానికి దారి తీసింది. జిగ్మే ఓటమి పాలవడంతో భారత ప్రభుత్వం మళ్లీ భూటాన్ కు సబ్సిడీ వంటగ్యాస్, డీజిల్ సరఫరాకు సమ్మతి వ్యక్తం చేసింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ భారత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల హామీగా ప్రకటించడం విశేషం.
భూటాన్ ప్రధానిగా ఎన్నికైన షేరింగ్ తాబ్ గేకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. భూటాన్ కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ప్రకటించారు.