: అతిగా వింటే చెముడొస్తుంది!


బస్సుల్లో వెళ్లే సమయంలోను, నడిచేటప్పుడు, ఖాళీ సమయాల్లోను టైంపాస్‌ కోసం పాటలు వినేందుకు మనం ఆసక్తి చూపుతాం. ఇలా వినేందుకు ఇప్పుడు హెడ్‌ఫోన్స్‌ వాడకం ఎక్కువైపోతోంది. అయితే హెడ్‌ఫోన్స్‌ వాడడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

న్యూయార్క్‌ ఆరోగ్య విభాగం జరిపిన సర్వేలో హెడ్‌ఫోన్స్‌ని అధికంగా ఉపయోగించడం వల్ల చెవులకు ప్రమాదం ఉంటుందని తేలింది. ఇప్పుడు మనం చూసే జనాల్లో ఎక్కువమంది చెవుల్లో హెడ్‌ఫోన్స్‌తో కనిపిస్తుంటారు. ఇలా ఎక్కువగా హెడ్‌ఫోన్స్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నట్టు పరిశోధకులు తమ పరిశోధనలో గుర్తించారు. ఇలా హెడ్‌ఫోన్స్‌ వంటి పరికరాల వాడకం వల్ల, ఎక్కువ శబ్దం వినడం వల్ల వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సర్వేలో అమెరికాలో 18 ఏళ్లనుండి 44 ఏళ్లలోపు వయసున్న వారిలో ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. కాబట్టి హెడ్‌ఫోన్స్‌ వినియోగించడం మంచిది కాదని, వీటిని అతి తక్కువగా వినియోగించే వారితో పోల్చితే, ఎక్కువగా వినియోగించే వారికి వినికిడి సమస్యలు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు అధ్యయన కర్తలు చెబుతున్నారు. కాబట్టి హెడ్‌ఫోన్స్‌ని తక్కువగా వినియోగించడం, తక్కువ వాల్యూమ్‌ పెట్టుకోవడం వల్ల వినికిడి సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News