: మనిషి క్రోమోజోమ్‌తో ఎలుక పుట్టింది!
వైద్య పరిజ్ఞానం రోజు రోజుకూ పెరిగిపోతోంది. కృత్రిమ మానవ క్రోమోజోమును రూపొందించి దానితో ఎలుకను సృష్టించారు వైద్యులు. సదరు ఎలుక శరీరంలోని ప్రతి కణంలోనూ మానవ క్రోమోజోము ఉండేలా కూడా దాన్ని రూపొందించినట్టు వైద్యులు చెబుతున్నారు.
మనుషుల్లో జన్యుపరమైన లోపాలను సరిదిద్దే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధలో భాగంగా ప్రయోగశాలలో కృత్రిమ మానవ క్రోమోజోమ్‌లను తయారు చేసేందుకు రసాయన నిర్మాణ బ్లాకులను ఉపయోగించారు. ఇలా సృష్టించిన కృత్రిమ మానవ క్రోమోజోములతో జన్యుపరంగా తీర్చిదిద్దిన ఎలుకను రూపొందించారు. ఈ ఎలుక శరీరంలోని ప్రతి కణంలోనూ మానవ క్రోమోజోములు ఉండేలా దీన్ని రూపొందించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిద్వారా మనుషుల్లో జన్యుపరంగా తలెత్తే లోపాలను సరిదిద్దే దిశగా ముందుకెళ్లేందుకు వీలు కలుగుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ విషయం గురించి అమెరికా జాతీయ క్యాన్సర్ కేంద్రం పరిశోధకులు నటాలే కౌప్రినా మాట్లాడుతూ జన్యు థెరపీలో ఇది శక్తిమంతమైన పరిజ్ఞానమని, కొన్ని రకాల జన్యు ఉత్పరివర్తనాల వల్ల పలు వంశపారంపర్య వ్యాధులు తలెత్తుతున్నాయనీ, మనుషుల్లో జన్యు లోపాలను సరిదిద్దేందుకు ఈ జన్యు థెరపీ తోడ్పడుతుందని చెబుతున్నారు.