: ఢిల్లీ మెట్రో రైళ్లలో లవ్ + డేటింగ్
ప్రేమికులకు, రసికులకు ఢిల్లీ మెట్రో రైళ్లు అనువుగా మారాయి. ఎక్కడో భద్రత లేని ప్రదేశాల కంటే ఎంతో భద్రత, రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో, కదిలే విలాసవంతమైన మెట్రో రైళ్ల కోచ్ లలో అయితే తమకు మరింత అనుకూలంగా ఉంటుందని ఢిల్లీ నగర ప్రేమికులు (ప్రేమికులు, కామికులు, నానా రకాలు) డిసైడైనట్లున్నారు. స్టేషన్లలో బల్లలపై కూర్చుని ముద్దాడుకోవడం, ఇంకేవో పనులు చేసుకోవడం వంటి వికృత చర్యలతో అక్కడి యువత బరితెగించింది. వీరి వ్యవహారం అక్కడి సీసీటీవీ కెమెరాల ద్వారా వెలుగులోకి వచ్చింది. భద్రతలో భాగంగా స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజులు పరిశీలిస్తుండగా.. జంటల ప్రేమ, డేటింగ్ వ్యవహారం బయటపడింది. మెట్రో ఉద్యోగి ఒకరు ఆ వీడియోలను కాస్తా అనధికారికంగా ఆన్ లైన్ లో పెట్టేశారు.
మెట్రో రైళ్లలో కూర్చోవడానికి విలాసంగా, విశాలంగా ఉండే సీట్లు, తింటూ కబుర్లాడుకోవడానికి జంటలకు అనువుగా ఉందట. పైగా, స్టేషన్లలో మూరు మూల ప్రదేశాలు వారికి తెగ నచ్చేశాయి. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు...అన్నట్టు 'మా ఎంజాయిమెంట్ మాది, మీరే కాస్త కళ్లు కప్పుకోండి' అనేట్టుగా అక్కడి వారి ధోరణి ఉంది. హన్సరాజ్ కాలేజీ విద్యార్థి వరుణ్ దీనిపై మాట్లాడుతూ.. "అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయని మాకు తెలుసు. కానీ, మేమెవరికీ సమస్యలు తేవడం లేదు కదా. జంట కలిసి ఉండగా, వారి వైపు చూడడం ఎందుకు? అని తమ కామాతురాన్ని సమర్థించుకున్నాడు. విషయం ఏమిటంటే ప్రేమ పుట్టడానికి మెట్రో, పెళ్లి చేసుకోవడానికి మెట్రో, శృంగారానికీ మెట్రో అన్నట్లుగా ప్రస్తుతం వాతావరణం అక్కడ ఉంది. మెట్రో రైళ్లలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలున్నాయి. మోజులో ముచ్చటలు తీర్చుకుంటున్న వారూ ఉన్నారు. ప్రేమలో పడి మెట్రోలను కేరాఫ్ గా చేసుకుంటున్నవారూ ఉన్నారు. వెరసి ఢిల్లీ మెట్రో ఇప్పుడొక హాట్ టాపిక్ లా మారిపోయింది. కొసమెరుపు ఏమిటంటే, ఓ మెట్రో అభిమాని ఢిల్లీ మెట్రో ఫేస్ బుక్ పేజీలోకి వెళ్లి ఇలా పోస్ట్ చేశాడు: 'థాంక్యూ మెట్రో. మేము వచ్చినప్పుడల్లా రద్దీగా ఉంటున్నావు. మా మొదటి డేటింగ్ తో బాటు, ఆ తర్వాత కూడా అన్నీ నీ ప్లాట్ ఫాంపైనే'. ఈ పోస్ట్ చాలదూ... ఢిల్లీ మెట్రో డేటింగ్ సెంటర్ లా తయారైందనడానికి!