: సర్కారుపై 'మర్రి' ఆరోపణలు
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ డీఎంఏ) కు స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి చేశామని, అయితే సర్కారు స్పందించలేదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అప్పుడు భూమి కేటాయించివుంటే.. సిటీలైట్ ప్రమాదం జరిగిన వెంటనే తాము సంఘటన స్థలానికి వెనువెంటనే చేరుకునేవారమని ఆయన చెప్పారు. తద్వారా మృతుల సంఖ్యను మరింత తగ్గించగలిగేవారమని ఆయన అభిప్రాయపడ్డారు. శశిధర్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఎన్ డీఎంఏ సమావేశం నేడు జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా సిటీ లైట్ హోటల్ కూలిన ఘటనపై చర్చించారు.
ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హైదరాబాద్ లోనూ ఎన్ డీఎంఏ బెటాలియన్ ఏర్పాటు చేస్తామని శశిధర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ డీఎంఏ బెటాలియన్ మంగళగిరిలో మాత్రమే ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా విపత్తు సంభవించినప్పుడు ఈ బెటాలియన్ సభ్యులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడతారు.