: ఈజిప్టులో ప్రజ్వరిల్లిన హింస
ఇస్లామిక్ దేశం ఈజిప్టులో అల్లర్లు హింసాత్మక రూపు దాల్చాయి. అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని బలవంతంగా గద్దె దించడంపై ఆయన మద్దతుదారులు సైన్యంపై దాడికి దిగారు. ఈ ఆందోళనల ఫలితంగా నేడు 42 మంది మరణించారని కైరోలోని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మోర్సీని పదవీచ్యుతుడిని చేసిన సైన్యం ఆయనను నిర్బంధించిన నేపథ్యంలో 'ముస్లిమ్ బ్రదర్ హుడ్' పార్టీ వర్గాలు సైన్యంపై దాడులు చేయాలంటూ ఈజిప్టు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మోర్సీ బందీగా ఉన్న మిలిటరీ బ్యారక్స్ పై నిరసనకారులు దాడికి ఉపక్రమించారు. సైన్యం ప్రతిదాడుల్లో పదుల సంఖ్యలో మరణించగా.. 200 మందికి పైగా గాయాలయ్యాయని ఈజిప్టు మీడియా పేర్కొంది.
ఈ విషయమై సైన్యం స్పందిస్తూ.. ఓ తీవ్రవాద మూక రిపబ్లికన్ గార్డ్స్ కాంపౌండ్ పై దాడికి దిగిందని.. ఈ ఘటనలో ఓ సైనికాధికారి మరణించగా, 40 మంది గాయపడ్డారని వివరించింది. ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరపకతప్పలేదని సైన్యం పేర్కొంది.