: నటన, రాజకీయం... రెండూ కొనసాగిస్తా: బాలయ్య
ఇక నుంచి క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని ప్రముఖ నటుడు బాలకృష్ణ తెలిపారు. క్రియాశీలక రాజకీయాల వల్ల తన నటజీవితానికి ఏ విధమైన ఆటకం కలగదని అభిమానులకు స్పష్టం చేశారు. అమెరికాలో డాలస్ నగరంలో జరిగిన నాట్స్ సంబరాల్లో ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తన కర్తవ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి అవుతారా? అన్న ప్రశ్నకు భవిష్యత్తు గురించి ఏమీ చెప్పలేనని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు తమ ప్రాంతం నుంచి పోటీచేయాలని నినాదాలు చేయడంతో బాలయ్య ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తానన్నారు.
తన కుమారుడు మోక్షజ్ఞ ఇంకా బీబీఎం చదువుతున్నాడని మరో నాలుగేళ్ల వరకూ విద్యనభ్యసించాక భవిష్యత్తులో ఏం చేయాలో అతనే నిర్ణయించుకుంటాడని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలన్న ప్రశ్నకు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. సౌందర్య ఆకస్మిక మృతితో తన చిరకాల వాంఛ 'నర్తనశాల' ఆగిపోయిందని, ద్రౌపది పాత్రధారిణి కోసం అన్వేషిస్తున్నానని తెలిపిన బాలయ్య, తన తదుపరి సినిమాలో బోయపాటి శీనుతో రాజకీయ ప్రాధాన్యమున్న సినిమాను చేస్తున్నానన్నారు. ఇది ఎన్నికలనాటికి విడుదలవుతుందని ఆయన తెలిపారు.