: మహనీయులపై రాజకీయ వివక్ష తగదు: అద్వానీ
మహనీయుల విషయంలో రాజకీయనాయకులు పార్టీల ప్రాతిపదికన వివక్ష చూపరాదని బీజేపీ అగ్రనేత అద్వానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు హితవు పలికారు. పార్లమెంటులో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీల గైర్హాజరీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ మీరా కుమార్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా రాకపోవడంపై అద్వానీ మాట్లాడుతూ 'జాతి గర్వించదగ్గ మహనీయుల విషయంలో పార్టీ ప్రాతిపదికన వివక్ష పనికిరాదన్నారు. ముఖర్జీకి నివాళిగా పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమానికి ఒక్కరూ రాలేదు. ఇది పొరపాటున జరిగితే సరే కానీ, కావాలనే చేసుంటే బాధాకరమైన విషయమే'నన్నారు.
గతంలో స్వాతంత్ర్యసమర యోధుడు వీర సావర్కార్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టినప్పడు కూడా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కానప్పటికీ నెహ్రూ కేబినెట్ లోకి తీసుకోడానికి కారణం గాంధీజీ సలహానే అని తెలిపారు. అప్పట్లో దేశం ఎదుర్కోంటున్న సవాళ్లను పరిష్కరించడంలో వీరి సేవలు అవసరమని గాంధీజీ భావించారని అద్వానీ అన్నారు.