: చైనాకు దగ్గరవుతున్న భూటాన్ పై భారత్ ప్రతీకారం
భూటాన్ అవడానికి స్వతంత్ర దేశమే అయినా భారత్ లో భాగమా అన్నట్లుంటుంది. ఈ రెండు దేశాల మధ్య ఎంతో సాన్నిహిత్యం, సామీప్యం ఉన్నాయి. ఈ రెండు దేశాలదీ దశాబ్దాల బంధం. అలాంటిది ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. దీనికి కారణం భూటాన్ తీరులో మార్పు రావడమే. దీంతో తాజాగా భారత్ భూటాన్ కు సబ్సిడీ గ్యాస్, కిరోసిన్ సరఫరాలను నిలిపివేసింది.
గతేడాది భూటాన్ ప్రధాని జిగ్మే థిన్లే బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా ప్రధానితో సమావేశమయ్యారు. అంతేకాదు, చైనా నుంచి 20 బస్సులను కూడా భూటాన్ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఇప్పటికే చైనా పాలకులు పాక్, శ్రీలంకకు చేయూతనిస్తూ భారత్ కు వ్యతిరేకంగా విదేశాంగ మంత్రాంగాలను నడుపుతున్నారు. ఇక బంగ్లాదేశ్ మనకు పక్కలో బల్లెం లాంటిదే. ఇప్పుడు భూటాన్ విషయంలోనూ చైనా తలదూర్చడం, భూటాన్ ప్రభుత్వం కూడా చైనా పట్ల సానుకూలంగా ఉండడం భారత్ కు నచ్చలేదు. అందుకే వచ్చే నెలలో అక్కడ ఎలక్షన్లు ఉండగా.. అదను చూసి భారత్ కిరోసిన్, గ్యాస్ పై సబ్సిడీని నిలిపివేయడంతో అక్కడ ధరలు రెట్టింపయ్యాయి. మరి భూటాన్ మారుతుందా? లేదా? చూడాలి!