: మన కుర్రాళ్లు విండీస్ ని ఆడుకున్నారు!


మొదటి రెండు మ్యాచులూ దారుణంగా ఓడిన మనవాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు. వెస్ట్ ఇండీస్ ని ఎడాపెడా ఆడుకున్నారు. రాత్రి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ ని 102 పరుగుల తేడాతో మన కుర్రాళ్లు మట్టికరిపించారు. సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో విజయంతో పాటు బోనస్ పాయింటు కూడా కొట్టుకొచ్చారు. 312 పరుగుల టార్గెట్ తో బ్యాటింగుకి దిగిన విండీస్ జట్టు మన బౌలర్ల ధాటికి తలవంచింది. 34 ఓవర్లలో 171 పరుగులకే విండీస్ బ్యాట్స్ మెన్ అందరూ చేతులెత్తేశారు. విండీస్ స్కోరు 56/2 వద్ద వుండగా వర్షం పడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. దాంతో డక్ వర్త్ లూయిస్ పధ్ధతి ప్రకారం విండీస్ స్కోరును 39 ఓవర్లలో 274 పరుగులుగా నిర్దేశించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా దూకుడుగా ఆడి 312 పరుగులు చేసి భారీ విజయ లక్ష్యాన్ని విండీస్ ముందుంచింది. విపరీతమైన ఒత్తిడిలో సైతం విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, 102 పరుగులు చేసి, సహచర బ్యాట్స్ మెన్ లో ఉత్సాహాన్ని నింపాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్ 69, రోహిత్ శర్మ 46 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగెత్తించారు. సెంచురీ కుర్రాడు కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ప్రదానం చేశారు. మొదటి రెండు మ్యాచులలో ఓడిన భారత్ జట్టుకి ఈ విజయం ఉత్సాహాన్నీ, విశ్వాసాన్నీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News