: ఎక్కడికైనా 'వీడు' వెళ్లగలడు!
మనిషిలాగా నడిచే రోబోలను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇలాంటి రోబోలతో పనులను చేయించడం అనేది సర్వసాధారణం. అయితే ఈ పనులకు సంబంధించిన ప్రోగ్రామింగ్ అనేది అప్పటికే ఆ రోబోల్లో తయారు చేయబడి ఉంటుంది. అలా కాకుండ ప్రోగ్రామింగ్ చేయని ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం రోబోలు వెళ్లలేవు. అయితే ఈ కొత్తరకం యంత్రపు మనిషి అసలు జీపీఎస్‌లు, వైఫైలు కూడా పనిచేయనటువంటి ప్రాంతాలకు వెళ్లగలడు.
బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక మరమనిషిని తయారు చేశారు. రోబో రే అని పిలిచే ఈ మరమనిషి తాను ఎక్కడికి వెళ్లినా అక్కడికక్కడే త్రీడీ విజువల్ మ్యాప్‌ను తయారు చేసుకోగలడు. అలాగే తాను తయారు చేసుకున్న వాటిని గుర్తుపెట్టుకోగలడు కూడా. ఎలాంటి ప్రాంతానికి వెళ్లినా తిరిగి రాగలిగే ఈ రోబో రేని స్టీరియో కెమెరా, కంప్యూటర్ విజన్ ప్రోగ్రామింగ్, 53 యాక్చువేటర్స్, అత్యాధునిక ర్యాపిడ్ త్రీడీ మ్యాపింగ్ సాంకేతికతతో శాస్త్రవేత్తలు తయారు చేశారు. 4.5 అడుగుల ఎత్తు, 50 కేజీల బరువున్న ఈ రోబో రే రూపమే కాదు నడక కూడా అచ్చు మనిషిలాగే ఉంటుంది. మనుషుల్లాగే ఎప్పటికప్పుడు భూమ్యాకర్షణ శక్తికి లోనవుతూ నడిచే ఈ పద్ధతిని డైనమిక్ వాక్ అంటారు.