: పంచాయతీలకు మంచి నాయకులు రావాలి: బాబు ఆకాంక్ష
రాష్ట్రంలో పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడలో జరుగుతున్న టీడీపీ ప్రాంతీయ సదస్సులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు అవినీతిపరులను దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బాబు అన్నారు. భవిష్యత్ లో గ్రామాలన్నీ ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఉత్తరాఖండ్ వరదలపై మాట్లాడుతూ.. బాధితులను ఆదుకున్నది టీడీపీయేనని నొక్కి చెప్పారు. కేంద్రం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
గతనెల 16న ఘటన జరిగితే తాను అదేనెల 23న అమెరికా నుంచి భారత్ వచ్చానని, తాను వెళ్ళి బాధితులను పరామర్శిద్దామని భావించానని తెలిపారు. అయితే, తాను ఊహించిన దానికి భిన్నంగా.. వరదబాధితులను ఎవరూ ఆదుకోలేదని, తాము వెళ్ళి తెలుగువాళ్ళకు ధైర్యం చెప్పి, వారిని ప్రత్యేక విమానాల్లో తరలించాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర సర్కారు మేలుకొందని బాబు ఆరోపించారు.