ఒక్కో ఆరోగ్య సమస్యకు ఒక్కో పరీక్ష... ఏ పరీక్షలో ఏం తెలుస్తుంది?

28-10-2017 Sat 12:25

ఆరోగ్యవంతులు సైతం ప్రతీ ఆరు నెలలకోసారి పూర్తి స్థాయి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నది వైద్యుల సూచన. ఎందుకులే? అన్న అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ముందుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేసేందుకు సమర్థవంతమైన చికిత్స ఇవ్వడంతోపాటు, ప్రాణాలను కాపాడడం సులభం అవుతుంది. ఈ సూచన వెనుక ఉన్న మర్మం అదే. వ్యాధి నిర్ధారణ కోసం చాలా రకాల రక్త పరీక్షలున్నాయి. వీటితోపాటు మల మూత్ర పరీక్షలు, ఎక్స్ రే, స్కానింగ్ లు కూడా వ్యాధి నిర్ధారణలో భాగమే. వీటిలో ఎక్కువగా అవసరపడే అత్యంత సాధారణ రక్త పరీక్షలు, వాటి ద్వారా ఏ విషయాలు తెలుస్తాయో తెలియచేసే ప్రయత్నమే ఇది.

డాక్టర్లు ఓ సమస్యకు చికిత్స ప్రారంభించే ముందు దాని కారకాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగానే వారి ఆరోగ్య చరిత్ర, లక్షణాలు అవన్నీ అడిగిన తర్వాత రోగిని పరీక్షించి అవసరమనుకుంటే వ్యాధి నిర్ధారణ కోసం, వ్యాధి తీవ్రత తెలుసుకునేందుకు పలు రకాల పరీక్షలు సూచిస్తుంటారు. సాధారణ వ్యాధులకు రక్త, మూత్ర పరీక్షలు అవసరం లేదు. కాకపోతే నేడు వైద్యులు అధిక శాతం సమస్య ఏదైనా ముందు రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు సూచించడం అలవాటైపోయింది.  

1. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ)
representational image
అత్యంత సాధారణంగా సిఫారసు చేసే రక్త పరీక్షల్లో ఇదీ ఒకటి. ఈ పరీక్షలో రెడ్ బ్లడ్ సెల్స్ (ఎర్ర రక్తకణాలు/ఆర్ బీసీ),  హెమోగ్లోబిన్, ఈఎస్ఆర్, పీసీవీ, ఎంసీవీ, ఎంసీహెచ్, ఎంసీహెచ్ సీ, వైట్ బ్లడ్ సెల్స్ (డబ్ల్యూబీసీ, డీసీ), ప్లేట్ లెట్స్ చూస్తారు.

ఎర్ర రక్త కణాలు క్యుబిక్ మీటర్ కు 4.56 మిలియన్ల మధ్య ఉండాలి. హెమోగ్లోబిన్ (హెచ్ బీ) పురుషుల్లో 42-52 శాతం, మహిళలకు 36-48 శాతం మధ్య ఉంటే అది సాధారణం. ఈఎస్ఆర్ మొదటి గంటకు 1-7ఎంఎంగా ఉంటే నార్మల్. ఎంసీవీ 78-90 క్యూబిక్ మైక్రాన్స్, ఎంసీహెచ్ 27-32 పికోగ్రామ్స్, ఎంసీహెచ్ సీ 30-38 శాతం మధ్య ఉండాలి. 
వీటి సంఖ్యను బట్టే మీ ఆరోగ్యంపై వైద్యులకు ఓ స్పష్టత వస్తుంది. 

అనీమియా, ఇన్ఫెక్షన్, కొన్ని రకాల కేన్సర్లలో వీటి సంఖ్యలో మార్పులు జరుగుతాయి. డెంగీ జ్వరం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, రక్తానికి సంబంధించిన కేన్సర్ల నిర్ధారణకు రక్త కణాల సంఖ్య ఎంతుందన్నది కీలకం. బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ వస్తే శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగిపోతుంది. బ్లడ్ కేన్సర్, ఇతర సమస్యల్లో తెల్ల రక్త కణాల సంఖ్యలో అసాధారణత చోటు చేసుకుంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పై పోరాడేందుకు మన శరీరమే వీటిని అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఊపరితిత్తుల నుంచి ఆక్సిజన్ ను శరీరమంతటికీ తీసుకెళతాయి. వీటి సంఖ్యలో అసాధారణత చోటు చేసుకుంటే అది అనీమియా, డీ హైడ్రేషన్, రక్తస్రావం, ఇతర సమస్యలకు దారితీయవచ్చు. ప్లేట్ లెట్స్ అన్నవి రక్తం గడ్డకట్టేందుకు ఉపకరించేవి. మెనింజైటిస్ వంటి తీవ్ర ఇన్ఫెక్షన్లలో రక్తం, రక్త కణాల సంఖ్య పడిపోతుంది. 

పాలీసిథెమియా
పాలీసిథెమియాలో ఆర్ బీసీ (ఎర్ర రక్త కణాలు) కౌంట్ అసాధారణంగా 8-11 మిలియన్లకు పెరిగిపోతుంది. సాధారణంగా ఎత్తయిన ప్రాంతాల్లో ఉండేవారిలో వచ్చే సమస్య ఇది. అలాగే, శ్వాసకోస సమస్యలైన ఎంఫిసెమా, కంజెన్షియల్ హార్ట్ డిసీజ్, క్రానిక్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ సమస్యల్లోనూ ఆర్ బీసీ కౌంట్ అసాధారణంగా పెరుగుతుంది.

అనీమియా
ఎర్రరక్త కణాలు తగినంత లేకపోతే లేదా ఐరన్ లోపిస్తే మన శరీరానికి రక్తం తగినంత ఆక్సిజన్ ను తీసుకెళ్లలేదు. దీన్నే అనీమియా అంటారు. ఎర్రరక్తకణాలు లేదా ఐరన్ తగినంత లేకపోవడంతో రక్తం పరిమాణం తగ్గిపోవడం, పోషకాల లేమి, ఎర్ర రక్తకణాలు క్షీణించడం, బోన్ మారోలో లోపాలు కారణాలు అయి ఉంటాయి.

హెమోగ్లోబిన్
representational imageపుట్టినప్పుడు 25 గ్రాములు ఉంటుంది. మూడో నెలకు ఇది 20 గ్రాములకు తగ్గుతుంది. ఏడాది తర్వాత 17 గ్రాములు, పెద్ద వాళ్లయ్యే సరికి 15 గ్రాములకు చేరుతుంది. అదే  మహిళల్లో ఇది 14.5 గ్రాములు ఉంటుంది.

హెమటోక్రిట్ (పీసీవీ)
ఎరిత్రోసైట్స్ (ఎర్ర రక్తకణాల)తో కూడిన రక్తం పురుషుల్లో 40-45 శాతం, మహిళలకు 38-42 శాతం ఉండడం సాధారణం. మీ రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎంత మేర వ్యాపించాయన్నది ఇందులో తెలుస్తుంది. హెమటోక్రిట్ స్థాయిలు చాలా అధికంగా ఉంటే మీరు డీహైడ్రేషన్ లో ఉన్నట్టు (శరీరంలో నీటి స్థాయిలు పడిపోవడం). హెమటోక్రిట్ తక్కువ స్థాయిలో ఉంటే అనీమియా ఉన్నట్టు. హెమటోక్రిట్ అసాధారణ స్థాయిలో ఉంటే రక్తం లేదా ఎముకమజ్జకు సంబంధించి సమస్యలకు కూడా సంకేతం కావచ్చు.

ఈఎస్ఆర్ (ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్)
శిశువులు, పిల్లల్లో తక్కువగా, మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. గర్భిణుల్లో మూడో నెల నుంచీ పెరుగుదల ఉంటుంది. అన్ని రకాల అనీమియాల్లో (సికిల్ సెల్ అనీమియా తప్ప) ఈఎస్ఆర్ పెరుగుతుంది. అలాగే, టీబీ, మాలిగ్నంట్ ట్యూమర్లు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమాటిక్ ఫీవర్, లివర్ వ్యాధుల్లోనూ ఈఎస్ఆర్ సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అవుతుంది. సికిల్ సెల్ అనీమియా, అలర్జిక్ సమస్యలు, పాలీసిథెమియా, తీవ్రమైన ల్యూకోసైటోసిస్, పెప్టోన్ షాక్ లలో ఈఎస్ఆర్ తగ్గడం జరుగుతుంది.  తీవ్ర వ్యాధులు, చికిత్సా సమయంలో మందుల పనితీరును ఈఎస్ఆర్ శాతం చెప్పేయగలదు.

ఎంసీవీ
representational imageమీన్ కార్పుస్కులర్ వ్యాల్యూమ్. సగటు ఎర్రరక్త కణాల పరిమాణమే ఎంసీవీ. ఎర్ర రక్త కణాలు చాలా చిన్నగా ఉన్న సమయంలో ఎంసీవీ సాధారణం కంటే తగ్గుతుంది. దీన్నే మైక్రోసైటిక్ అనీమియాగా చెబుతారు. ఐరన్ లోపం, నెలసరి రుతుస్రావం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లో రక్తస్రావం, తలసీమియా మైక్రోసైటిక్ అనీమియాకు కారణమవుతాయి.

ఎంసీహెచ్ సీ
మీన్ కార్పుస్కులర్ హెమోగ్లోబిన్ కాన్సెంట్రేషన్. ఒక ఎర్రరక్త కణంలో ఎంత మేర హెమోగ్లోబిన్ ఉన్నదీ తెలుసుకునే పరీక్ష. అనీమియా వ్యాధి నిర్ధారణకు దీని వాల్యూ కీలకమవుతుంది. సాధారణంగా ఇది 30-38 శాతం మధ్య ఉండాలి.

డబ్ల్యూబీసీ (తెల్ల రక్త కణాలు)
ప్రతీ క్యుబిక్ మీటర్ రక్తంలో 4000-11000 సంఖ్యలో ఉంటే దాన్ని సాధారణంగా పరిగణించాలి. ఇన్ఫెక్షన్ పై పోరాడేందుకు  ఇవి అవసరం. బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ/క్షయ), అలర్జీ, జ్వరం, స్టెరాయిడ్ ఔషధాల స్వీకరణ సమయంలో పెరిగిపోతాయి. అనాఫిలాక్టిక్ షాక్, లివర్ సిర్రోసిస్, స్ప్లీన్ సమస్యలు, పెర్నీసియస్ అనీమియా, టైఫాయిడ్, పారా టైఫాయిడ్ జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, కేన్సర్ కు కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో, కొన్ని రకాల ఔషధాలు, వ్యాధి నిరోధక శక్తి లోపాల వల్ల తెల్ల రక్త కణాలు తగ్గుతాయి.

డిఫరెన్షియల్ కౌంట్ (డీసీ)
ఇందులో న్యూట్రోఫిల్స్ 40-70 శాతం మధ్య, ఇసినోఫిల్స్ 1-4 శాతం మధ్య, బాసోఫిల్స్ 0-1 శాతం, మోనోసైట్స్ 4-8 శాతం మధ్య, లింఫోసైట్స్ 20-40 శాతం మధ్య ఉంటే సాధారణం.

న్యూట్రోఫిల్స్
representational imageతెల్ల రక్త కణాల్లో ఇవి ఒక రకం. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్టు సంకేతం అందిన వెంటనే ముందుగా ఆ ప్రదేశానికి చేరి దాడి చేసేవి న్యూట్రోఫిల్సే. తెల్ల రక్తకణాల్లో ఇవి 60 శాతం మేర ఉంటాయి. ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమ్మేషన్, నెక్రోసిస్, మాలిగన్సీ, ఒత్తిడి, అధిక వ్యాయామాలు, ఔషధాలు, గర్భం సమయాల్లో న్యూట్రోఫిల్స్ లో పెరుగుదల ఉంటుంది.

ఇసినోఫిల్స్
వ్యాధులు, ఇన్ఫెక్షన్లపై పోరాడే ఓ తరహా తెల్ల రక్తకణాలు ఇవి. అలర్జిక్ రియాక్షన్, ఆస్థమా, పారాసైటిక్ ఇన్ఫెక్షన్, కేన్సర్ వచ్చినప్పుడు ఇసినోఫిల్స్ లో పెరుగుదల ఉంటుంది. ఇసినోఫిల్స్ తగ్గితే ఆందోళన చెందక్కర్లేదు.  

బాసోఫిల్స్
అరుదైన తెల్ల రక్తకణాలు ఇవి. అలర్జిక్ రియాక్షన్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కనిపిస్తాయి. బాసోఫిల్స్ యాంటికోగులంట్ హెపారితన్ తో కలిసి ఉంటాయి,. దాంతో రక్తం వెంటనే గడ్డకట్టకుండా అడ్డుకుంటాయి. అలాగే, కణజాలానికి రక్తసరఫరా జరిగేందుకు వీలుగా వాసడిలేటర్ హిస్టామిన్ ను కలిగి ఉంటాయి.  

లింఫోసైట్స్
తెల్ల రక్త కణాల్లో చాలా కీలకమైనవి. 20-45 శాతం వరకూ ఉంటాయి. లింఫ్ గ్రంధులు, టాన్సిల్స్, స్ప్లీన్ దగ్గర ఎక్కువగా ఇవి చిక్కుకుంటాయి. యాంటీజెన్స్ కు స్పందిస్తాయి. యాంటీజెన్స్ అంటే టీ సెల్స్, బీసెల్స్. తీవ్రమైన వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, పొగతాగడం, అధిక ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ థైరాయిడిటి ఇవి పెరగడానికి కారణం.

మోనోసైట్స్
తెల్ల రక్త కణాల్లో 4-8 శాతం ఇవే. కీమో, వ్యాధి నిరోధక శక్తిని సప్రెస్ చేసే చికిత్సలు, తీవ్ర మైన ఒత్తిడి, స్టెరాయిడ్ల వాడకం సమయంలో ఇవి తగ్గుతాయి. ఇన్ఫెక్షన్ సహా ఇతర కొన్ని వ్యాధులప్పుడు పెరుగుతాయి. టోటల్ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ (మొత్తం తెల్ల రక్త కణాల సంఖ్య) కంటే కూడా అందులోనే ఒక్కో రకం తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయన్నది కొన్ని వ్యాధులకు కీలకం. సమస్యను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ప్లేట్ లెట్స్
రక్తంలో ఇదో representational imageరకం కణం. గాయపడిన సమయాల్లో రక్తస్రావం అవకుండా రక్తాన్ని గడ్డకట్టించేందుకు ఇది తోడ్పడుతుంది. రక్త స్రావం అవుతుంటే తెల్ల రక్త కణాలన్నీ కలసి స్రావానికి అడ్డుపడతాయి. శరీరంలో వీటి సంఖ్య తగ్గితే శరీరం రక్తాన్ని గడ్డకట్టించలేదు. తక్కువ ప్లేట్ లెట్స్ ఉండడాన్ని త్రోంబోసిస్టోపీనియాగా చెబుతారు. డెంగీ ఫీవర్, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమ్మేషన్, గర్భం దాల్చినప్పుడు, ఐరం లోపం, వ్యాధి నిరోధక సమస్యలు, కాలేయ వ్యాధుల్లో ఇవి తగ్గడం జరుగుతుంది. లక్ష కంటే ప్లేట్ లెట్స్ తగ్గడాన్ని త్రోంబోసిస్టోపీనియాగా చెబుతారు.  

2. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ / కంప్లీట్ యూరిన్ అనలైసిస్
representational imageమూత్ర పిండాలు శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలను బయటకు పంపించేది మూత్రాశయ వ్యవస్థ. శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటి నిల్వలను బయటకు పంపిస్తుంటుంది. రెండు మూత్రపిండాలు, రెండు మూత్రకోశ నాళాలు, ఒక మూత్ర సంచి, ఒక మూత్రమార్గం ఇవే సమగ్ర వ్యవస్థ. మనం తీసుకునే ఆహారం, ద్రవ పదార్థాలను బట్టి యూరిన్ కాంపోజిషన్ ఉంటుంది. సాధారణంగా మూత్రంలో యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, సోడియం క్లోరైడ్, అమ్మోనియా, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ ఉంటాయి. మూత్రాన్ని పరీక్షించడం ద్వారా శరీరంలో చాలా రకాల అనారోగ్యాలను గుర్తించొచ్చు. కంప్లీట్ యూరిన్ అనలైసిస్ లో భాగంగా యూరిన్ భౌతిక రూపాన్ని పరీక్షించడం జరుగుతుంది. అలాగే, రసాయనిక విశ్లేషణ, మైక్రోస్కోప్ పరీక్ష ఉంటుంది.
స్పెసిఫిక్ గ్రావిటీ; యూరిన్ గాఢత ఆధారంగా మూత్రంలో వివిధ రకాల పదార్థాలను గుర్తిస్తారు. ఇది తక్కువ ఉంటే మూత్ర విసర్జనకు ముందు అధికంగా నీరు తీసుకున్నట్టు అర్థం చేసుకోవాలి.
పీహెచ్ : పీహెచ్ అన్నది అధికంగా లేదా తక్కువగా ఉంటే  మూత్రంలో స్ఫటికాలు ఏర్పడి తద్వారా కిడ్నీలో రాళ్లు తయారవుతాయి. పీహెచ్ ను ఆహారం, మందుల ద్వారా సరిచేయవచ్చు.
కలర్ : మూత్రం రంగు గాఢంగా ఉంటే అది పలు మందులు తీసుకోవడం వల్ల, కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల, శరీరంలో నీరు తగ్గిపోవడం, జ్వరం, మూత్రంలో రక్తం కారణాలు అయి ఉంటాయి.
ప్రొటీన్ (అల్బూమిన్): మూత్రంలో ప్రొటీన్ ఉంటే అది మూత్ర పిండాల వ్యాధులు లేదా మూత్రాశయ పరిస్థితికి నిదర్శనం.
గ్లూకోజ్: మూత్రంలో గ్లూకోజ్ ఉంటే, రక్తంలోనూ గ్లూకోజ్ అధిక స్థాయిలో ఉన్నట్టు భావించొచ్చు.
కీటోన్స్: శరీరం కొవ్వును కరిగించే సమయంలో కీటోన్స్ విడుదల అవుతాయి. మూత్రంలో కీటోన్స్ ఉంటే అధిక ప్రొటీన్, తక్కువ కార్బోహైడ్రేటెడ్ ఆహారం తీసుకుంటున్నట్టు. మధుమేహుల్లోనూ కీటోన్స్ ఉంటాయి.
బైలురూబిన్: కాలేయం ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థం ఇది. మూత్రంలో బైలురూబిన్ ఉందంటే అది కాలేయ వ్యాధికి సూచన.
యూరోబిలినోజెన్: ఇది బైలు రూబిన్ నుంచి వెలువడేది. ఇది ఉన్నా కాలేయ వ్యాధికి సూచికే.
నైట్రేట్: బ్యాక్టీరియా కారణంగా మూత్రంలో నైట్రేట్ కనిపిస్తుంది. ఇది ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందని అనుమానించొచ్చు.
మూత్రకోశంలో ఇన్ఫెక్షన్ ఉంటే తెల్ల రక్త కణాలు (డబ్బ్యూబీసీ) కనిపిస్తాయి.
ఎర్ర రక్త కణాలు (ఆర్బీసీ): కిడ్నీలకు గాయం అయినా లేక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫమ్మేషన్ కు గురైనా ఇవి కనిపిస్తాయి.
ఎపిథెలియల్ సెల్స్: మూత్రకోశ మార్గం ఇన్ఫెక్షన్ కు గరైనప్పుడు , వాపునకు గురైనప్పుడు ఎపిథెలియల్ సెల్స్ ఏర్పడతాయి.
క్రిస్టల్స్: చాలా రకాల రూపాల్లో క్రిస్టల్స్ ఏర్పడతాయి. కాకపోతే చాలా రకాల క్రిస్టల్స్ మూత్రంలోనే కరిగిపోతుంటాయి. పీహెచ్ బ్యాలన్స్ తప్పితే మాత్రం స్ఫటికాలుగా మారతాయి.  
బ్యాక్టీరియా: మూత్రంలో బ్యాక్టీరియా ఉందంటే అది ఇన్ఫెక్షన్ కు సూచనే.
మ్యూకస్: మూత్రకోశ మార్గంలో ఇన్ఫెక్షన్ ఉంటే మ్యూకస్ సైతం మూత్రంలోకి వచ్చేస్తుంది.

3. మూత్రపిండాల పరీక్ష (రీనల్ ప్రొఫైల్)
మూత్ర పిండాల పనితీరును తెలిపే రక్త పరీక్ష ఇది. ఇందులో బ్లడ్ యూరియా నైట్రోజన్, క్రియాటినైన్ అన్నవి ప్రొటీన్ మెటబాలిజం ఉప ఉత్పత్తులు. జీవ క్రియల్లో భాగంగా విడుదలయ్యేవ వీటిని మూత్రపిండాలు ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. ఈ విషయంలో మూత్రపిండాలు ఏ విధంగా పనిచేస్తున్నాయన్నది రక్త పరీక్షలో తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తున్నా, అప్పటికే వైఫల్యం ఉన్నా తెలుస్తుంది.

representational imageఎలక్ట్రోలైట్స్ అనేవి మినరల్స్. మన శరీరంలో లవణాలు, యాసిడ్ బేస్ స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు ఎలక్ట్రోలైట్స్ తోడ్పడతాయి. సోడియం, పొటాషియం, బైకార్బోనేట్, క్లోరైడ్ ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ కిందకే వస్తాయి. ఇవి అసాధారణ స్థాయికి చేరితో మూత్ర పిండాలు, కాలేయ వ్యాధులు, గుండె వైఫల్యం, అధిక రక్తపోటు, ఇతర సమస్యలకు సంకేతంగా భావించొచ్చు. సోడియం అనేది శరీరంలోని నీటిలో ఉండే ఒక లవణం. శరీరంలో నీటి సమతుల్యతకు సోడియం చాలా ముఖ్యం. అలాగే, నరాలు, కండరాల ఎలక్ట్రికల్ చర్యలకు కూడా అవసరం. పొటాషియం అనేది నరాలు, కండరాలను కాపాడుతుంది. ఇవన్నీ ఏ స్థాయిలో ఉన్నాయన్నది ఈ వైద్య పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

4. లివర్ ఫంక్షన్ టెస్ట్
representational imageమన శరీరంలో ఉండే కాలేయం (లివర్) అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది ఎన్నో రకాల పనులను నిర్వహిస్తుంటుంది. దీని పనితీరును లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష కూడా కాలేయం గురించి చాలా రకాల సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరీక్షల్లో భాగంగా శరీరంలో పోషకాలు ఎంతున్నది ప్రొటీన్ గణాంకాలు తెలియజేస్తాయి. అల్బూమిన్ అన్నది రక్తంలో ఒకానొక ప్రధాన ప్రొటీన్. ఎంత పోషకాలు అందుతున్నది దీని ద్వారా తెలుస్తుంది. అలాగే గ్లోబులిన్. రక్తంలో ఇదొక ప్రొటీన్ల సమూహం. ఇన్ఫెక్షన్లపై పొరాడే యాంటీబాడీలతో కలసి ఉంటుంది. కొవ్వు కరిగించడం, కాలేయ పనితీరును బైల్ రూబిన్ తెలియజేస్తుంది. బైల్ రూబిన్ అధికంగా ఉంటే కామెర్లు ఉన్నట్టు.

ఇంకా లివర్ లోనే మూడు ముఖ్యమైన ఎంజైమ్స్ ఉంటాయి. వాటిలో ఆల్కాలిన్ ఫాస్పాటేస్ అనేది బాడీ ప్రొటీన్. ఇది ఎముక, లివర్ పనితీరును తెలియజేస్తుంది. పిత్తాశయంలో ఏవైనా అడ్డంకులు ఉంటే ఆల్కాలిన్ ఫాస్పాటేస్ పెరుగుతుంది. తల, గుండె కండరాల్లో ఆస్పార్టేట్ అమినో ట్రాన్స్ ఫరేజ్ (ఏఎస్ టీ లేదా ఎస్జీవోటీ) ను గుర్తించొచ్చు. ఇందులో ఏవైనా అసాధారణత ఉంటే అది కాలేయ వ్యాధికి సూచిక. మూడో ఎంజైమ్ అలానైన్ అమినో ట్రాన్ఫరేజ్ (ఏఎల్ టీ లేదా ఎస్ జీపీటీ) అనేది ప్రధానంగా లివర్ లో ఉండే ఎంజైమ్. ఇందులో అసాధారణత ఉంటే లివర్ వ్యాధికి సూచన.

5. కొలెస్టరాల్ - లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్
representational imageరక్తంలో వివిధ రకాల కొవ్వులు (లిపిడ్స్) ఏ స్థాయిలో ఉన్నాయనే సమాచారాన్ని తెలియజేస్తే రక్త పరీక్ష ఇది. ఇందులో టోటల్ కొలెస్టరాల్, హెచ్ డీఎల్ కొలెస్టరాల్, ఎల్ డీఎల్ కొలెస్టరాల్, రిస్క్ రేషియో, ట్రై గ్లిజరైడ్స్ తెలుస్తాయి. రక్తంలో కొవ్వు అధికంగా ఉంటే అది గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇందులో ఎల్ డీఎల్ కొలెస్టరాల్ అన్నది చాలా హాని తలపెట్టేది. రక్తనాళాల గోడల్లో పేరుకుని గుండెజబ్బులకు కారణమవుతంది. హెచ్ డీఎల్ అన్నది ఇలా రక్తనాళాల గోడల్లో పేరుకుని ఉన్న కొవ్వును తొలగించేస్తుంది.

6. బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్
రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించే పరీక్ష. ఇందులోనే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్, హెచ్ బీఏ1సీ పేరుతో భిన్న పరీక్షలు ఉన్నాయి. హెచ్ బీఏ1సీ పరీక్షతో గత కొన్ని నెలలుగా మీరు మధుమేహాన్ని ఎంత మేర నియంత్రణలో ఉంచుకున్నారన్నది తెలుస్తుంది. సాధారణ రక్త పరీక్షల్లో షుగర్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా తెలుస్తుంది. హెచ్ బీఏ1సీలో గత కొంత కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు  సగటున ఎలా ఉందీ తెలుస్తుంది. రక్తంలో అధికంగా ఉన్న చక్కెరలు, రక్తంలోనే ఉన్న హెమోగ్లోబిన్ కు అతుక్కుపోతాయి. దాంతో హెమోగ్లోబిన్ ఏ1సీ పెరిగిపోతుంది. అందుకే రక్తంలో చక్కెరలు తెలుసుకునేందుకు హెచ్ బీఏ1సీ పరీక్షను కనీసం ఆరు నెలలకోసారి చేయించుకోవాలి.

7. యాంటీబాడీస్ టెస్ట్
representational imageయాంటీబాడీలు అనేవి మన రక్తంలో ఉండే సాధారణ ప్రొటీన్లు. శరీర రోగ నిరోధక వ్యవస్థలో కీలక భాగం. రుమటాయిడ్ ఫాక్టర్ అన్నది కూడా ఒకానొక యాంటీబాడీయే. కానీ సాధారణ వ్యక్తుల్లో ఇది ఉండదు. ఇది ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్ల వాతం)కు కారణమవుతుంది. దీన్ని గుర్తిచేందుకు రక్తంలో ఉండే రుమటాయిడ్ ఫాక్టర్ ను పరిగణనలోకి తీసుకుంటారు.మన శరీరంలోకి బ్యాక్టీరియా చొరబడి ఇన్ఫెక్షన్ కు దారితీసినప్పుడు దాన్ని గుర్తించేందుకు వైద్యులు యాంటీబాడీ పరీక్షలకు సిఫారసు చేస్తారు. బ్యాక్టీరియా చొరబడినప్పుడు దాన్నుంచి రక్షణ కల్పించేందుకు గాను శరీర రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఏదైనా కొత్త ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దానికి తగినట్టు యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు శరీరం కొంత సమయం తీసుకుంటుంది. కనుక ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఈ పరీక్ష చేస్తే ఫలితం కచ్చితంగా ఉండదు. ఇన్ఫెక్షన్ సోకిన కొన్ని రోజుల తర్వాత చేస్తే ఉపయోగం. ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా చాలా రోజుల వరకు ఈ యాంటీబాడీలు అలానే ఉండిపోతాయి. దీంతో వెంటనే మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా రక్షణ ఉంటుంది. హెపటైటిస్, లైమ్ వ్యాధి, హైఐవీ ఇన్ఫెక్షన్లను యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.

8. కేన్సర్ టెస్ట్ (ట్యూమర్ మార్కర్స్)
representational imageట్యూమర్ మార్కర్స్ ద్వారా శరీరంలో కొన్ని రకాల కేన్సర్లు ఉన్నదీ, లేనిదీ గుర్తించొచ్చు. కేన్సర్ చికిత్స ప్రగతిని కూడా ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. బ్రెస్ట్ కేన్సర్ గుర్తించేందుకు సీఏ15-3 ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్యూమర్ల గుర్తింపునకు సీఏ19-9, ఓవేరియన్ కేన్సర్ గురించి తెలుసుకునేందుకు సీఏ-125, ప్రొస్టేట్ కేన్సర్ గుర్తింపునకు పీఎస్ఏ, పాంక్రియాటిక్, బ్రెస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, లంగ్ కేన్సర్ల గురించి తెలుసుకునేందుకు సీఈఏ( కార్సినోఎంబ్రియోనిక్ యాంటీజెన్) మార్కర్ పరీక్షలు ఉపయోగపడతాయి.

9. గుండె పరీక్ష (కార్డియాక్ మార్కర్లు)
హోమో సిస్టీన్ స్థాయిలు తక్కువగా ఉన్న వారికంటే ఎక్కువగా ఉన్న వారిలో గుండె పోటు, స్ట్రోక్ ముప్పు పెరిగిపోతుంది. సి రియాక్టివ్ ప్రొటీన్ స్థాయిలకు, గుండె జబ్బు ముప్పునకు సంబంధం ఉంటుంది.  

10. మల పరీక్ష
మలాన్ని పరీక్షించడం ద్వారానూ కొన్ని వ్యాధి కారకాలను తెలుసుకోవచ్చు. టైఫాయిడ్ ఫీవర్ కు కారణమయ్య బ్యాక్టీరియా గురించి తెలుస్తుంది. అరుదుగానే ఈ పరీక్షను సూచిస్తారు. అలాగే హెపటైటిస్ వ్యాధిని సైతం మలంలో గుర్తించొచ్చు.

11. బ్లడ్ క్లాటింగ్ టెస్ట్
వైద్యులు కొందరికి బ్లడ్ క్లాటింగ్ టెస్ట్ సిఫారసు చేస్తుంటారు. ఈ పరీక్ష రక్తంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియపై ప్రభావం చూపే ప్రొటీన్లను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. పరీక్షలో ఫలితాలు అబ్ నార్మల్ గా ఉంటే రక్త స్రావం లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నట్టు. రక్తం గడ్డకట్టే రిస్క్ ఉన్న వారికి రక్తాన్ని పల్చన చేసే మందులను వైద్యులు సిఫారసు చేస్తుంటారు. ఈ మందులు వాడే వారిలో రక్తం ఏ స్థాయిలో పల్చన ఉంది, మరింత పల్చగా మారితే రక్తస్రావం ముప్పు పెరుగుతుంది గనుక దాన్ని తెలుసుకునేందుకు ఈ పరీక్షను సిఫారసు చేస్తారు.

12. ఎక్స్ రే
representational imageరేడియేషన్ ను శరీరంలోని ఏదేనీ ఒక భాగంలోకి పంపినప్పుడు అక్కడి దృశ్యం మరోవైపు ఉంచిన ఫొటోగ్రఫీ ప్లేట్ పై పడుతుంది. దీని ఆధారంగా వైద్యులు రోగి ఎదుర్కొంటున్న సమస్యను గుర్తిస్తారు. ఉదాహరణకు న్యూమోనియాతో బాధపడుతున్న వ్యక్తి ఊపరితిత్తులను ఎక్స్ రే తీసినప్పుడు, ఎక్స్ రేలో ఆ భాగం తెల్లగా కనిపిస్తుంది. కొన్ని భాగాల్లో మరింత స్పష్టత కోసం కాంట్రాస్ట్ డై ని రోగులకు ఇవ్వడం జరుగుతుంది.1

13. బోన్ స్కాన్స్
ఇదొక రకం ఎక్స్ రేగా భావించొచ్చు. ఎముకల్లో కేన్సర్, ఇన్ఫెక్షన్ ను గుర్తించేందుకు ఈ స్కాన్ సాయపడుతుంది. రేడియో ట్రేసర్ అనే కెమికల్ సాయంతో ఎముకల్లో పరిస్థితిని మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. స్కానింగ్ సమయంలో ఈ సమచారాన్ని కంప్యూటర్ రికార్డు చేసి వాటిని చిత్రాలుగా మారుస్తుంది. వీటి సాయంతో సమస్య ఏ భాగంలో ఉందీ వైద్యులు తెలుసుకుంటారు. సీటీ స్కాన్ కూడా శరీరంలో ఓ భాగాన్ని భిన్న కోణంలో స్కాన్ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో తీసుకున్న సమాచారం ఆధారంగా కంప్యూటర్ చిత్రాలుగా మారుస్తుంది.

14. ఎంఆర్ఐ
representational imageమ్యాగ్నటిక్ రీసోనన్స్ ఇమేజింగ్ అన్నది చాలా శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రం మన శరీరంలో ఉన్న నీటిని కుదుపునకు గురి చేస్తుంది. ఈ కుదుపులను ఎంఆర్ఐ మెషిన్ రికార్డు చేస్తుంది. ఈ రికార్డు ఆధారంగా చిత్రాలను తీస్తుంది.

15. అల్ట్రాసౌండ్
అల్ట్రాసౌండ్ స్కాన్ లో భాగంగా అధిక ఫ్రీక్వెన్సీ ఉన్న తరంగాలను శరీరంలోకి పంపించడం జరుగుతుంది. వీటిని మనం వినలేం. ఈ తరంగాల ప్రవాహంతో మనకు ఏ విధమైన నొప్పి, అసౌకర్యం ఉండవు. గర్భంలో ఉన్న పిండం నుంచి కాలేయం, మూత్ర పిండాల్లో అణువణువూ పరిశీలించేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగపడుతుంది.

16. ఎకో కార్డియోగ్రామ్
representational imageఅధిక ఫ్రీక్వెన్సీతో కూడిన తరంగాలను ఉపయోగించి గుండె చిత్రాలను తీసే పరీక్ష. దీన్నే ఎకోకార్డియోగ్రఫీ లేదా కార్డియాక్ అల్ట్రాసౌండ్ పరీక్ష అని కూడా అంటారు. ఈ తరంగాల సాయంతో గుండె చాంబర్లు, వాల్వ్ లు, వాల్స్, గుండెకు అనుసంధానమైన ఉన్న రక్త నాళాలు తీరును తెలుసుకోవచ్చు.

17. ఎలక్ట్రో కార్డియో గ్రామ్ (ఈసీజీ, ఈకేజీ)
గుండెకు సంబంధించి కండరాలు, ఎలక్ట్రికల్ యాక్టివిటీని తెలుసుకునేందుకు చేసే పరీక్ష. కేవలం నిమిషాల్లోనే ఈ పరీక్ష పూర్తవుతుంది. గుండె సమీపంలో ఉంచిన ఎలక్ట్రోడ్స్ ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డు చేస్తాయి. హార్ట్ బీట్ రేటు, రిథమ్ ను కొలుస్తుంది.


More Articles
Advertisement
Telugu News
Covishield is Ready for use says Poonawala
వాడకానికి సిద్ధంగా ఉన్న కరోనా వ్యాక్సిన్: అదార్ పూనావాలా
1 minute ago
Advertisement 36
Bharath Bio tech Says Vaccine Trails for 26 Thousand Volenteers
25 కేంద్రాల్లో 26 వేల మందికి టీకా ఇచ్చామన్న భారత్ బయోటెక్!
11 minutes ago
america ready for pfizer vaccine distribution
ఫైజర్ టీకా రవాణాకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు అనుమతులు
21 minutes ago
Who will get Maradona assets is a real dispute
వీలునామా రాయని మారడోనా... పలు దేశాల్లో వారసులు!
8 hours ago
Vijayasanthi slams CM KCR over his comments in election campaign
బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉంది: విజయశాంతి
8 hours ago
IYR Krishana Rao responds to Undavalli press meet
ఉండవల్లి గారు చక్కగా చెప్పారు: ఐవైఆర్
9 hours ago
Pawan Kalyan wants stricter acts on endowment lands
పాలకులు దేవాదాయ ఆస్తుల జోలికి వెళ్లకుండా పటిష్ట చట్టాలు చేయాలి: పవన్ కల్యాణ్
9 hours ago
Madhavan to play Ratan Tata
వెండితెరకు ప్రముఖ పారిశ్రామికవేత్త కథ.. హీరోగా మాధవన్?
9 hours ago
Ram Gopal Varma tweets on Corona Virus film release
లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా ఇదే: వర్మ
9 hours ago
Prakash Raj replies to Nagababu
నాకు తెలుగు భాష వచ్చు కానీ, మీ భాష రాదు: నాగబాబుకు కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
10 hours ago
CM KCR comments on BJP campaign with national level leaders
బక్క కేసీఆర్ ను కొట్టేందుకు ఇంతమందా...?: బీజేపీ ప్రచారంపై సీఎం కేసీఆర్ ఫైర్
10 hours ago
Yogi Adithyanath terms CM KCR as another Nizam
కేసీఆర్ కు, నిజాంకు తేడా లేదు: యోగి ఆదిత్యనాథ్
11 hours ago
Saitej new movie Solo Brathuke So Better set to release in Theaters on Christmas
క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్న సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'
11 hours ago
Mahavira sculpture found in Tamilnadu
తమిళనాడులో 10వ శతాబ్దానికి చెందిన వర్ధమాన మహావీరుడి విగ్రహం లభ్యం
11 hours ago
double digit cases in AP districts except Krishna district
ఏపీ కరోనా అప్ డేట్: కృష్ణా జిల్లాలో తప్ప అన్ని జిల్లాల్లో రెండంకెల కేసులే!
12 hours ago
TTD governing council takes key decisions
టీటీడీ పాలకమండలి సమావేశం వివరాలు ఇవిగో!
12 hours ago
 Chandrababu thanked PM Narendra Modi for his visit of Bharat Biotech in Hyderabad genome valley
జీనోమ్ వ్యాలీని సందర్శించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు: చంద్రబాబు
13 hours ago
Yogi Adithyanath Roadshow in Hyderabad
మల్కాజ్ గిరిలో యూపీ సీఎం ఆదిత్య నాథ్ రోడ్ షో... భారీ జనసందోహం!
13 hours ago
Kriti sanon as heroine in Adipurush
'ఆదిపురుష్' నాయికగా కృతి సనన్.. బాలీవుడ్ మీడియాలో వార్తలు!
13 hours ago
Tension in Raja Singh road show
రాజాసింగ్ రోడ్ షోలో ఉద్రిక్తత
14 hours ago