ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ప్ర‌జాప్ర‌తినిధులు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం బాటిల్ నీటినే వాడాలి: మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి

Related image

  • మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ప‌నుల‌పై రాష్ట్ర స్థాయి స‌మావేశం నిర్వ‌హించిన మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట: మిషన్ భగీరథ పథకంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం బాటిల్ నీటిని విడుద‌ల చేశారు. ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో, ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ఈ బాటిల్ నీటినే వాడాల‌ని కోరారు. బాటిల్ నీటిలో మిన‌ర‌ల్స్ అన్నీ ఉంటాయ‌ని, ఆరోగ్య‌వంతంగా నీరు ఉంటుంద‌ని చెప్పారు. ఈ నీటిపై ఎవ‌రైనా త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్య క‌ర‌మైన‌, శుద్ధి చేసిన మంచినీటిని అందించ‌డ‌మే మిష‌న్ భ‌గీర‌థ ల‌క్ష్యం. అందుకే సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్య‌త ప‌థ‌కంగా మొద‌లుపెట్టారు. ఒక్క‌సారి గ‌త ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తే... గుండెల‌విసి పోతాయి. అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోని మంచినీటి కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఎండా కాలం వచ్చిందంటే చాలు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడి. నల్లాలు, బోరింగుల దగ్గర శిగపట్లు. పానీ పట్లు. కిలో మీటర్ల కొద్దీ నడిచి వెళ్ళే పరిస్థితులు. ప్రజాప్రతినిధులకు ఖాళీ కుండలు, బిందెల ప్రదర్శనలు ఎదురయ్యేవి. అసెంబ్లీ జరిగితే చాలు... ప్రతిపక్షాలకు పండగే. నీటి సమస్యలను చూసి అసెంబ్లీని ఆలస్యంగా సమావేశ పరిచే దుస్థితులు ఉండేవి. ఇక సర్పంచ్ లకు ఎండా కాలం ఓ నరక యాతన. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఐదేళ్ళూ మంచినీటిని అందించడానికి పడే పాట్లతోనే గడిచిపోయేది. నల్లగొండ లాంటి జిల్లాల్లోనైతే ఫ్లోరైడ్ తో ఎముకల గూళ్ళైన జనాలు. ఆ మహమ్మారితో యుక్త వయసు రాక ముందే ముడుచుకుపోయిన శరీరాలతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. కావాలని చేసినా, చేయకపోయినా, ఆనాటి పాలకుల నిర్లక్ష్యం ఖరీదు తెలంగాణ ప్రజల నిండు ప్రాణాలు. అని అన్నారు.

అలాగే, వెయ్యి కోట్ల బడ్జెట్ ఏ మూలకూ సరిపోయిది కాదు. అదనంగా రూ.50 కోట్లు ఖర్చు చేసినా, జెడ్పీ, మండల, గ్రామాలతో పాటు ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ నిధులెన్ని పెట్టినా సరిపోయేది కాదు. సుదీర్ఘ పోరాటంతో ప్రజల తెలంగాణ ఆరాటం తీరింది. అప్పటి ఉద్యమ నేత సీఎం కేసీఆరే తెలంగాణ సీఎం అయ్యారు. అదే తెలంగాణకు కలిసి వచ్చింది. కన్నీటి కష్టాలు తీరడానికి ఆస్కారమిచ్చింది. 25 ఏళ్ళ క్రితమే 1996లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్, ఎల్ఎండి జలాలతో సిద్దిపేట ప్రజలకు ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించిన సక్సెస్ ఫుల్ ప‌థ‌కం ప్రయోగమే మిష‌న్ భ‌గీర‌థ‌. సీఎం ఆ ప్ర‌యోగ‌మే, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించడానికి దోహదపడింది. అపర భగీరథుడిలా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ అపూర్వ పథకానికి అంకురార్పణ చేశారు. అని మంత్రి చెప్పారు.

46వేల 123 కోట్ల రూపాయ‌లు మిష‌న్ భ‌గీర‌థ‌ అంచ‌నా వ్య‌యం. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌నుల‌ను బ‌ట్టి చూస్తే, దాదాపు 8వేల కోట్ల రూపాయ‌ల ఆదా జ‌రిగే అవ‌కాశం ఉంది. 99 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని 23,968  గ్రామీణ ఆవాసాలు, 120 ప‌ట్ట‌ణ‌, స్థానిక సంస్థ‌ల‌లో, రాష్ట్రంలోని మొత్తం 71ల‌క్ష‌ల 61వేల ఇండ్ల‌కు న‌ల్లాల ద్వారా స్వ‌చ్ఛ‌మైన మంచినీటిని అందించ‌డ‌మే ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. ఇందులోనూ 55ల‌క్ష‌ల 59వేల గ్రామీణ ఇండ్లు, 16ల‌క్ష‌ల 2వేల ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని ఇండ్ల‌కు మంచినీరు అందించ‌డం ప్ర‌ధాన ఉద్దేశ్యం.ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం మిష‌న్ భ‌గీర‌థ ద్వారా రూ.29వేల కోట్ల వ్య‌యం తో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మంచినీరు అందిస్తున్న‌ది. ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం అద‌న‌పు భారం ప‌డ‌కుండా...మంచినీరు అందిస్తున్న‌ది. కేవ‌లం ఆర్ ఓ ప్లాంట్ల ద్వారానే... నీటి కొనుగోలుకు ప్ర‌జ‌ల‌పై నెల‌కు క‌నీసం రూ.300 చొప్పున ఏడాదికి రూ.1800 కోట్ల భారం ప‌డేది. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని కేంద్రం స‌హా, అనేక రాష్ట్రాలు మ‌న రాష్ట్రానికి ప్ర‌తినిధుల‌ను పంపి, అధ్య‌య‌నం చేశాయి. ఈ మ‌ధ్యే ప‌శ్చిమ‌ బెంగాల్ ప్ర‌భుత్వం రూ.56వేల కోట్ల‌తో జ‌ల్ స్వ‌ప్న పేరుతో మిష‌న్ భ‌గీర‌థ ప‌థకానికి శ్రీ‌కారం చుట్టింది. మ‌హారాష్ట్ర‌, బీహార్, ఒడిశా లాంటి అనేక రాష్ట్రాలు మ‌న ప‌థ‌కాన్ని వారి రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్నాయి. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

*జ‌ల్ మిష‌న్ కీ, అనేక రాష్ట్రాలకీ ఆద‌ర్శం*

మిష‌న్ భ‌గీర‌థ స్ఫూర్తితో కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ను ఏర్పాటు చేసింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 84కోట్ల 83ల‌క్ష‌ల ఇండ్లు ఉండ‌గా, అందులో 2020-21 ఏడాదికి కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద దేశంలోని 45ల‌క్ష‌ల మంచినీటి క‌నెక్ష‌న్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అందులో మొద‌టి విడ‌త‌గా, అస్సాం, బీహార్, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ బెంగాల్ ఈ ఐదు రాష్ట్రాల‌లోని ఐదు జిల్లాల‌ను ఎంపిక చేసింది. కానీ, ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌మాణాల ప్ర‌కారం, 32 (హైద‌రాబాద్ జిల్లా మిన‌హా) జిల్లాల్లో 23వేల 968 గ్రామీణ ఆవాసాలు, 120 ప‌ట్ట‌ణ, స్థానిక సంస్థ‌ల‌కు మిష‌న్ భ‌గీర‌థ నీరు స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న‌ది. అట‌వీ, మారుమూల‌న ఉన్న 126 గ్రామాల్లోనూ మంచినీరు అందించే ప‌నులు మొద‌ల‌య్యాయి. గ్రామీణ‌కుల ప్ర‌తి రోజూ 100 లీట‌ర్లు, ప‌ట్ట‌ణాల ప్ర‌జ‌ల‌కు 135 లీట‌ర్లు, న‌గ‌రాల ప్ర‌జ‌ల‌కు 150లీట‌ల‌ర్ల నీటిని అందిస్తున్నాం. స్థిరీక‌ర‌ణ ప‌నులు కూడా పూర్తి కావ‌స్తున్నాయి. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు.

*ప్ర‌ధాని మోదీచే ప్రారంభం*

మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని ఆగ‌స్టు 7, 2016న  ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం, ఇదే కోమ‌టి బండ‌ నుంచే ప్రారంభించారు. తేదీః 22-05-2016న‌ మ‌న్ కీ బాత్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత నీటిని అందించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గొప్ప ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ప్ర‌శంసించారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో వినూత్న ప‌థ‌కంగా మిష‌న్ భ‌గీర‌థ‌కు ఇప్ప‌టికే హ‌డ్కో మూడు సార్లు అవార్డులిచ్చింది. జాతీయ వాట‌ర్ మిష‌న్ అవార్డులు -2019లో... తెలంగాణ నీటి వినియోగ సామ‌ర్థ్యాన్ని 20శాతం పెంచే విభాగంలో మిష‌న్ భ‌గీర‌థ మొద‌టి బ‌హుతి గెలుచుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం, భార‌త ప్ర‌ధాని, నీతిఅయోగ్, 15వ ఆర్థిక సంఘంతోపాటు, ప‌శ్చిమ బెంగాల్, బీహార్, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, మ‌ధ్య ప్ర‌దేశ్, ఉత్త‌ర ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌, ఒడిశా వంటి అనేక రాష్ట్రాలు తెలంగాణ మిష‌న్ భ‌గీర‌థ‌ను ప్ర‌శంసించాయి. అని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు.

*ఇంకా అనేక అవార్డులు, రివార్డులు*

ఇంకా స్కోచ్ వంటి అనేక సంస్థ‌ల అవార్డులు, రివార్డుల‌కు లెక్క‌లేదు. ఇదీ తెలంగాణ ఘ‌న‌త‌. ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించిన ప్ర‌గ‌తి. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న మిష‌న్ భ‌గీర‌థ పథ‌కం విధానం అన్ని రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలుస్తుంద‌ని జాతీయ జ‌ల్ జీవ‌న్ మిష‌న్ డైరెక్ట‌ర్ మ‌నోజ్ కుమార్ సాహూ చెప్పారు. మిష‌న్ భ‌గీర‌థ‌ త‌ర‌హాలో అమ‌లు చేస్తున్న జ‌ల్ జీవ‌న్ ప‌థ‌కంలోనూ ఫ్లో కంట్రోల్ వాల్వ్ ని వాడాల‌ని సూచించారు. తెలంగాణ మోడ‌ల్ ని అధ్య‌య‌నం చేయ‌డానికి సాంకేతిక బృందాల‌ను ఆ రాష్ట్రానికి పంపండి అని అన్ని రాష్ట్రాల‌కు లేఖ‌లు రాశారు. అంత‌కుముందు నీతి అయోగ్ సిఫార‌సు, 15వ ఆర్థిక సంఘం, అనేక సంస్థ‌లు, జ‌ల శాస్త్ర‌వేత్త‌లు, వివిధ రాష్ట్రాలు, సాక్షాత్తు ప్ర‌ధాని ప్ర‌శంస‌ల‌న్నీ కూడా మ‌న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు అవుతున్న మిష‌న్ భగీర‌థ వియ‌వంతానికి నిద‌ర్శ‌నం. మంత్రి ద‌యాక‌ర్ రావు అన్నారు.

*మిష‌న్ భ‌గీర‌థ‌కు కేంద్రం నిధుల కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి*

మిష‌న్ భ‌గీర‌థ‌కు రూ.15వేల కోట్లు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ కేంద్ర ప్ర‌భుత్వానికి రెక‌మండ్ చేసింది. స్వ‌యంగా సీఎం కేసీఆర్, ప్ర‌ధాన మంత్రి మోదీని క‌లిసి విజ్ఞాప‌నులు అంద‌చేశారు. నేను స్వ‌యంగా 4సార్లు ఢిల్లీకి వెళ్ళిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని, మంత్రులు,అధికారులు అంతా ప్ర‌శంసించారు. ఇంతా చేస్తే.. కేంద్ర ప్ర‌భుత్వం న‌యా పైస నిధులివ్వ‌లేదు.  ఇంకా ప్రాథ‌మిక ద‌శ‌లోనే ప‌నులు సాగుతున్న గుజ‌రాత్, ఉత్త‌ర ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల‌కు నిధుల వ‌ర‌ద పారిస్తున్నారు.

ఇప్ప‌టికైనా విజ‌య‌వంత‌మైన, కేంద్రం స‌హా, అనేక రాష్ట్రాలు అనుస‌రిస్తున్న మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి  చేస్తున్నాను. ఈ ప‌థ‌కాన్ని మ‌న‌కందించిన సీఎం కేసీఆర్ కి, మొద‌ట ఈ స్కీంని నిర్వ‌హించిన మంత్రి కేటీఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేసిన అధికారులు, ఉద్యోగులంద‌రికీ పేరు పేరునా అభినంద‌న‌లు తెలిపారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

ఈ సంద‌ర్భంగా స్మిత సభర్వాల్ మాట్లాడుతూ, మిషన్ భగీరథ పూర్తి అయిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 56 లక్షల ఇండ్లకు నల్లాలతో శుద్ధి చేసిన నీరూ సరఫరా అవుతుంది. ఈ.ఎన్. సీ నుంచి ఏ ఈ వరకు అందరూ చాలా నిజాయితీ, అంకితభావంతో పని చేసి ఈ ఘనత సాధించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలిపారు.

More Press Releases