సురవరం ప్రతాప రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.. అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం!

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో తెలంగాణ వైతాళికులు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సురవరం ప్రతాప రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం గర్వించే గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సురవరం సాహిత్య, చరిత్ర పరిశోధన, జర్నలిజం లాంటి రంగాలలో చేసిన సేవలను నేటి తరానికి అందించేందుకు తెలంగాణ సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వైతాళికులను, సంగీత, సాహిత్య వేత్తలను, కవులను, మేధావులను, కళాకారులు మొదలైన రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖుల జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించి గౌరవిస్తున్నామన్నారు.

మే 28న సురవరం జయంతిని పురస్కరించుకుని వారి స్వగ్రామం అలంపూర్ చౌరస్తాలో గాని లేదా ఇటిక్యాల వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి అందుకు స్థల పరిశీలనను చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ వైతాళికులు సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను అధికారికంగా, అంగరంగ వైభవంగా, తెలంగాణ ఘన చరిత్ర, కీర్తిని తెలుగు ప్రజలకు, సురవరం అభిమానులకు, సాహితీ వేత్తలకు, చరిత్ర పరిశోధకులకు, జర్నలిజం విభాగంలో విశేష కృషి చేస్తున్నా ప్రముఖులతో, తెలుగు భాషాభిమానులతో కలసి భాగస్వామ్యం చేసుకొని గొప్ప కార్యక్రమంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సురవరం ప్రతాప్ రెడ్డి రచించిన కథలను, నాటకీకరించి నాటకోత్సవాలను సంగీత నాటక అకాడమీ ద్వారా నాటకాలుగా ప్రదర్శించేలా కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. హైదరాబాద్ తో పాటు పాత ఉమ్మడి 10 జిల్లా కేంద్రాలలో కవి సమ్మేళనాలు, సాహితీ చర్చలు మేధావులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించాలని మంత్రి అధికారులను కోరారు.

వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో నిర్వహించి వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని మంత్రి సూచించారు. సురవరం ప్రతాప రెడ్డి చేసిన సేవలను నేటి తరానికి తెలిసేలా వివిధ పత్రికలు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం లభించేలా మీడియా సంస్థల ఎడిటర్లతో సమావేశం నిర్వహించాలని అధికారులను కోరారు.

వీటితో పాటు షార్ట్ ఫిలిమ్స్ వీడియో కాంటెస్ట్ లు నిర్వహించాలని, వీటితో పాటు తెలుగు యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ లలో సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య కృషి మీద చర్చలు జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సురవరం ప్రతాప్ రెడ్డి పేరుతో రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చేందుకు ఒక కమిటీని నియమించేలా చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు కపిల్, గిరిధర్ రెడ్డి, నివేదిత, పుష్పలత, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

More Press Releases