రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్

Related image

  • గత ఏడాది మార్కును దాటిన ధాన్యం కొనుగోళ్ళు 
  • పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించిన సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: రైతులు, పేదల ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇతర ప్రభుత్వ కార్పొరేషన్ల కంటే పౌరసరఫరాల కార్పొరేషన్ చాలా భిన్నమైందని, ఇది పూర్తిగా పేద ప్రజలకు, రైతులకు సేవ చేసే సంస్థ, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు పని చేయాలని అన్నారు. సోమవారం నాడు పౌరసరఫరాల భవన్ లో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సరం డైరీ 2021ని ఛైర్మన్ ఆవిష్కరించారు.

పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఈ సందర్భంగా ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో రూపాయికే సరఫరా చేస్తోందన్నారు. ప్రతినెల 87.54 లక్షల కుటుంబాలకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోందని, అలాగే సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఏడాదికి లక్షా 20వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోందని ఈ బియ్యం క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని ఉద్యోగులకు సూచించారు.

ధాన్యం కొనుగోళ్లలో ఈ ఏడాది వానాకాలంలో గత ఏడాది వానాకాలం మార్కును దాటడం జరిగింది. గత ఏడాది 47.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 47.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దాదాపు 11 లక్షల మంది రైతుల నుండి 6,505 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 9వేల కోట్లు విలువచేసే 47.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రూ.8375 కోట్ల రూపాయలను నేరుగా రైతు ఖతాలో జమ చేయడం జరిగిందన్నారు.

నిజాయితీ, నిబద్దత, అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మరింత మంచి పేరు వచ్చేలా ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ సమయంలో పౌరసరఫరాల ఉద్యోగులు చాలా బాగా పని చేశారని, అదనపు బియ్యం సరఫరాతో పాటు రూ.1,500 నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖతాలో జమచేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు సంస్థలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సమావేశంలో పౌరసరఫల శాఖ కమిషనర్ వి. అనిల్‌ కుమార్ తో పాటు సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. గోపికృష్ణ, జనరల్ సెక్రటరీ రవినాయక్ సభ్యులు సౌజన్య, రినా తదితరులు పాల్గొన్నారు.

More Press Releases