'మిస్ మ్యాచ్' మూవీ రివ్యూ

రెండు ప్రాంతాలు .. రెండు కుటుంబాలు .. వేరు వేరు స్వభావాలు .. అయినా ఒకటి కావాలని ఆరాటపడే రెండు మనసులు. పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ జంటకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది? అనేది కథ. ఆసక్తికరంగా అనిపించని కథాకథనాలతో ఆద్యంతం ఈ సినిమా నీరసంగా సాగుతుంది .. అనూహ్యమైన మలుపులనేవి లేకుండా అసహనానికి గురిచేస్తుంది. 
ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినా, పెళ్లి అనేది రెండు కుటుంబాలకు .. రెండు వంశాలకి సంబంధించినది. ప్రేమికులకు కులమతాలేకాదు .. పెరిగిన వాతావరణం .. ఆశయాలు కూడా పెళ్లికి అడ్డంకిగా మారుతుంటాయి. అలా ఆశలకి .. ఆశయానికి మధ్య జరిగే చిన్న ఘర్షణతో రూపొందిన చిత్రమే 'మిస్ మ్యాచ్'. గతంలో ఈ తరహా సినిమాలు చాలా వచ్చినప్పటికీ, ఈ కథతో దర్శకుడు నిర్మల్ కుమార్ కొత్తగా ఏం చెప్పడానికి ప్రయత్నించాడనేది ఇప్పుడు చూద్దాం.

వస్తాద్ గోవిందరాజులు (ప్రదీప్ రావత్) కుస్తీ పోటీల్లో జాతీయస్థాయిలో బంగారు పతకాన్ని సొంతం చేసుకోవాలని కలలు కంటాడు. అయితే కొన్ని రాజకీయాల కారణంగా ఆయన అక్కడి వరకు వెళ్లలేకపోతాడు. దాంతో తన కూతురు మహాలక్ష్మి( ఐశ్వర్య రాజేశ్) ద్వారా తన ముచ్చట తీర్చుకోవాలనుకుంటాడు. ఆ దిశగా తన కూతురిని ప్రోత్సహిస్తూ, జాతీయస్థాయిలో కుస్తీ పోటీల్లో పాల్గొనేలా చేస్తాడు. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి .. సిద్ధార్థ్ (ఉదయ్ శంకర్) ప్రేమలో పడుతుంది. అతణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే పెళ్లి తరువాత 'కుస్తీ' పోటీల్లో పాల్గొనడానికి వీల్లేదని సిద్ధార్థ్ కుటుంబసభ్యులు షరతు పెడతారు. కుస్తీ విషయంలో తండ్రి కలను నిజం చేయాలా? ప్రేమించిన వ్యక్తి కోసం ఆ కుస్తీనే వదులుకోవాలా? అనే సందిగ్ధంలో మహాలక్ష్మి పడుతుంది. చివరికి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేదే మిగతా కథ.

దర్శకుడు నిర్మల్ కుమార్ కథను పకడ్బందీగా తయారు చేసుకోలేకపోయాడు. దాంతో సహజంగానే సన్నివేశాల్లో బలం లోపించింది. హీరో .. హీరోయిన్ సహా కొన్ని పాత్రలను సరిగ్గా మలచలేకపోయాడు. ప్రదీప్ రావత్ .. సంజయ్ స్వరూప్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం కొంతవరకూ ఫరవాలేదు. దర్శకుడు హీరోని మహా మేధావిగా .. అద్భుతమైన జ్ఞాపకశక్తి కలవాడిగా పరిచయం చేస్తాడు. ఈ కథకు అది ఎంతవరకు అవసరమో ఆయనకే తెలియాలి. ఇక హీరోయిన్ ఒక్కోసారి చిన్నపిల్ల మాదిరిగా .. మరోసారి పరిణతి కలిగినదిగా అనిపిస్తూ ప్రేక్షకులను అయోమయంలో పడేస్తుంది.

భూపతి రాజా స్క్రీన్ ప్లే ఎంతమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయింది. విశ్రాంతికి ముందువరకూ థియేటర్లో కూర్చున్నవాళ్లు సెలఫోన్లు చూసుకుంటూ .. ఛాటింగులు చేసుకుంటూ కనిపిస్తారు. అంత నీరసంగా కథ నత్తనడక నడుస్తూ ఉంటుంది. విశ్రాంతికి 'హమ్మయ్య ఒక బ్యాంగ్ పడింది .. ఇక ఇప్పటి నుంచి ఉంటుంది అసలైన కథ!' అనుకున్న వాళ్లను నిరాశ పరుస్తూ తరువాత కథ నడుస్తుంది. పేలవమైన సన్నివేశంతోనే హీరో .. హీరోయిన్ల పరిచయ కార్యక్రమాన్ని చూపించిన దర్శకుడు, కొంతైనా కొత్తదనాన్ని ఆవిష్కరించలేకపోయాడు.

సిద్ధార్థ్ పాత్రలో ఉదయ్ శంకర్ ఎంతమాత్రం యాక్టివ్ గా కనిపించలేదు. ఆయన కళ్లలో అసలు ఎక్స్ ప్రెషన్స్ పలకలేదు. ఫైట్స్ బాగానే చేశాడుగానీ .. ఇక్కడా ఎక్స్ ప్రెషన్స్ సమస్యే.  పవన్ కల్యాణ్ 'తొలిప్రేమ'లోని .. 'ఈ మనసే .. సే .. సే .. ' అనే పాటను ఉదయ్ శంకర్ పై చిత్రీకరించారు. పవన్ బాడీ లాంగ్వేజ్ తో ముడిపడిన ఈ సాంగ్, ఉదయ్ శంకర్ పై తేడా కొట్టేసింది. స్టేజ్ పై సరదాగా చేసే డాన్స్ లా అనిపిస్తుంది. ఇక ఐశ్వర్య రాజేశ్ ఫేస్ ను చాలా 'డల్' గా చూపించారు. దాంతో ప్రేక్షకులు మరింత నీరుగారిపోయారు. ఎమోషనల్ సీన్స్ ను మాత్రం అమ్మాయి బాగా చేసింది. ఐశ్వర్య రాజేశ్ తండ్రి పాత్రలో ప్రదీప్ రావత్ నటన ఆకట్టుకుంటుంది. అయితే తెరపై ఆయన చాలా బలహీనంగా కనిపించాడు. హీరో తండ్రి పాత్రలో సంజయ్ స్వరూప్ నటన మెప్పిస్తుంది. ఉన్నంతలో చాలా డీసెంట్ గా కనిపిస్తూ ఆయన ఆ పాత్రకి న్యాయం చేశాడు. ఇక పెద్దగా ప్రయోజనం లేని మిగతా పాత్రలను గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

సంగీతం పరంగా చూసుకున్నా .. రీ రికార్డింగ్ పరంగా చూసుకున్నా ఓ మాదిరిగా మాత్రమే అనిపిస్తాయి. 'భలేగా వుందే' అనుకునే పాటను వెతికిపట్టుకోవడం కష్టమే. గణేశ్ చంద్ర కెమెరా పనితనం ఫరవాలేదు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే రాజా సేతుపతి చాలా ఉదారంగా వ్యవహరించాడనిపిస్తుంది. హీరో - హీరోయిన్ల బాల్యం తాలూకు సీన్స్ .. బస్ సీన్స్ .. పిల్లలతో హీరోయిన్ గాలిపటం సీన్ .. జాతర సీన్లు అనవసరంగా అనిపిస్తాయి. ఇక సంభాషణల పరంగా చూసుకున్నా, గుర్తుపెట్టుకోదగిన డైలాగ్ ఒక్కటీ వినిపించదు.

టైటిల్ కి తగినట్టుగా హీరో .. హీరోయిన్ల కుటుంబ నేపథ్యాలు .. అలవాట్లు .. అభిరుచులను 'మిస్ మ్యాచ్'గా చూపించడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. అయితే హీరో హీరోయిన్లు కూడా 'మిస్ మ్యాచ్'గా కనిపించడం పెద్ద మైనస్ గా మారింది. పాత సీసాలో పాత నీరే పోసినట్టుగా అనిపించే ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.          


Movie Name: Mis Match

Release Date: 2019-12-06
Cast: Udya Shankar, Aishwarya Rajesh, pradeep Rawat, Sanjay Swaroop, Sharanya Pradeep, Rupa Lakshmi, 
Director: N.V. Nirmal Kumar 
Producer: Sri Ram Raju, Bharath Ram 
Music: Gifton Elias 
Banner: Adhiroh Creative Signs

Mis Match Rating: 1.50 out of 5


More Movie Reviews