'మల్లేశం' మూవీ రివ్యూ
చేనేత కార్మికుల కష్టాలను గట్టెక్కించడానికి ఆసు యంత్రాన్ని తయారుచేసిన 'చింతకింది మల్లేశం' బయోపిక్ ఇది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కదిలించేస్తుందనే చెప్పాలి.
సాధారణంగా సినిమా రంగానికీ .. క్రీడా రంగానికి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆ రంగాలలో అద్భుతాలు చేసినవారి జీవితచరిత్రలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతుంటారు .. ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జనానికి అంతగా తెలియని 'చింతకింది మల్లేశం' అనే ఓ చేనేత కార్మికుడి జీవితచరిత్రను తెరకెక్కించడానికి ప్రయత్నించడం నిజంగా సాహసమే అవుతుంది. అలాంటి ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతగా రాజ్. ఆర్ కనిపిస్తాడు. 'మల్లేశం' బయోపిక్ తో ఆయన చేసిన సాహసం ఎంతవరకూ విజయవంతమైందో ఇప్పుడు చూద్దాం.
1984నాటి ఈ కథలోకి వెళితే 'మల్లేశం' (ప్రియదర్శి) ఓ చేనేత కార్మికుడు. మల్లేశం చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు .. చురుకైనవాడు. పవర్ తో నడిచే పనిముట్లను తయారు చేయడం ఆయనకి ఇష్టం. ఆయన తల్లి లక్ష్మి (ఝాన్సీ) తండ్రి నర్సింహులు(చక్రపాణి ఆనంద్) నేత పనిచేసుకుంటూ బతుకు బండిని లాగుతుంటారు. ఆర్ధికపరమైన ఇబ్బందుల కారణంగా ఏడవ తరగతితోనే తన చదువును ఆపేసిన మల్లేశం, తల్లిదండ్రులకు తనవంతు సహకారాన్ని అందిస్తూ పేదరికంలోనే పెద్దవాడవుతాడు.
చీరలలో ఆయా డిజైన్స్ రావడానికి అవసరమైన దారం అమరిక (ఆసు పోయడం) పనితో లక్ష్మి ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటుంది. దాంతో తల్లికి ఆ కష్టం లేకుండా చేయడం కోసం 'ఆసు యంత్రం'ను తయారు చేయడానికి 'మల్లేశం' రంగంలోకి దిగుతాడు. కోడలు వస్తే తనకి సహాయంగా ఉంటుందని తల్లి అనడంతో, తను మనసు పడిన పద్మ (అనన్య)ను వివాహం చేసుకుంటాడు. భార్య రాకతో పెరిగిన బాధ్యత ఒక పక్క .. ఆసు యంత్రాన్ని తయారు చేసే విషయంలో ఎదురయ్యే అవాంతరాలు మరోపక్క. ఒంటి చేత్తో ఆయన వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ.
సాధారణంగా ఇలాంటి సినిమాలు వినోదానికి దూరంగా .. ఆర్ట్ సినిమాలకి దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడా అలాంటి ఛాయలు కనిపించనీయకుండా దర్శకుడు రాజ్.ఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 'మల్లేశం'గా ప్రియదర్శి తెరపైకి రావడానికి కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నా, ఆయన బాల్యానికి సంబంధించిన సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా 'పల్లెల బడిలోన పిల్లల గుడి ఆట' పాటతో, పల్లె అందాలను .. ప్రకృతితో వాళ్లకి వుండే బంధాలను పరిచయం చేశాడు. ప్రేక్షకులను బాల్యంలోకి తీసుకెళ్లి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాడు.
కథారంభంలో సరదా సన్నివేశాలను కలుపుతూ వెళ్లిన ఆయన, ఇంటర్వెల్ తరువాత కథను ఉద్వేగం వైపు ఉరుకులు పెట్టించిన తీరు, స్క్రీన్ ప్లే పై ఆయనకి గల పట్టును నిరూపిస్తుంది. పేదరికానికి .. పెద్ద మనసులకు మధ్య జరిగే సంఘర్షణను అడుగడునా ఆయన ఆవిష్కరించిన తీరు బాగుంది. కథ .. కథనం .. మాట .. పాట .. లొకేషన్ల విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ, ఈ సినిమాను సహజత్వానికి మరింత దగ్గరగా తీసుకెళ్లాయనడంలో సందేహం లేదు.
ప్రియదర్శి కెరియర్లో 'మల్లేశం' పాత్ర చెప్పుకోదగినదిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పాత్రలో ఆయన పసిడి ఉంగరంలో పగడంలా ఇమిడిపోయాడు. మగ్గాన్ని నమ్ముకున్నవాళ్లు ఆత్మహత్యలు చేసుకోకూడదు .. వలస కూలీలుగా మారకూడదు. అలా జరగాలంటే ముందుగా తాను ఆసు యంత్రాన్ని తయారు చేయాలంటూ ఆరాటపడే మల్లేశం పాత్రకు ప్రియదర్శి జీవం పోశాడు. పల్లెల్లో బతకలేని పరిస్థితులు .. పట్నంలో బతకనీయని పరిస్థితులను ఎదుర్కొనే సందర్భాల్లోను, తాను సిద్ధం చేస్తోన్న చెక్క ఆసు యంత్రాన్ని తండ్రి తగలబెట్టినప్పుడు కన్నీటి పర్యంతమయ్యే సందర్భంలోను ఆయన కన్నీళ్లు పెట్టించాడు.
ఇక 'మల్లేశం' భార్య పద్మగా చేసిన 'అనన్య' ఈ కథా రథానికి రెండవ చక్రమని చెప్పాలి. ఆకర్షణీయమైన తన కళ్లతోనే అన్నిరకాల హావభావాలను పలికించేసింది. పుట్టింటివారు పెట్టిన పుస్తెల తాడును .. బంగారు గాజులను తాకట్టు కోసం భర్త అడిగినప్పుడు కోప్పడటం .. ఆ తరువాత మనసు మార్చుకుని ఆయనకి ఆ నగలు ఇచ్చేటప్పుడు 'అనన్య' అద్భుతంగా నటించింది. అందం .. అమాయకత్వంతో ఆకట్టుకుంటూనే, ప్రేమకి - పేదరికానికి మధ్య నలిగిపోయే ఇల్లాలి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. 'మల్లేశం' తల్లిదండ్రుల పాత్రలకు ఝాన్సీ .. చక్రపాణి ఆనంద్ జీవం పోశారు. 'మల్లేశం' కారణంగా అప్పులవాళ్లు ఇంటిపైకి వచ్చినప్పుడు, ఈ ఇద్దరూ ఆవిష్కరించిన భావోద్వేగాలు మనసును భారం చేస్తాయి.
సంగీతం పరంగా మార్క్ కె. రాబిన్ కి మంచి మార్కులే పడిపోతాయి. ఫస్టాఫ్ లో వచ్చే రెండు పాటలు ఆయన ప్రతిభకు కొలమానంగా కనిపిస్తాయి. సాహిత్యం కూడా చక్కని భావజాలంతో కథకు మరింత బలాన్నిచ్చింది. మాటలు రాసినట్టుగా కాకుండా, పాత్రోచితంగా .. సందర్భోచితంగా అనిపిస్తాయి. ఇక ఇటు సన్నివేశాలను .. అటు పాటలను అద్భుతమైన చిత్రీకరణతో మనసుకు మరింత దగ్గరగా తీసుకొచ్చిన కెమెరామెన్ 'బాలు'ని అభినందించకుండా ఉండలేం. ఎడిటర్ రాఘవేందర్ పనితనం కూడా బాగుంది. పాటల్లోను .. సన్నివేశాల్లోను ఫీల్ పోకుండా ఆయన తన ప్రతిభను కనబరిచాడు. మొత్తంగా చూసుకుంటే ఈ 'మల్లేశం' గ్రామస్థుల మనసులతో పాటు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంటాడనే చెప్పాలి.

Movie Name: Mallesham
Release Date: 2019-06-21
Cast: Priyadarshi, Ananya, Jhansi
Director: Raj.R
Producer: Raj.R, Sri Adhikari
Music: Mark K. Robin
Banner: SP, Studio 99
Review By: Peddinti