'నిన్ను తలచి' మూవీ రివ్యూ

ప్రేమ అనేది ప్రతి నిమిషాన్ని అందమైన అనుభూతిగా మారుస్తుంది .. ఊహల ఊయలను ఉత్సాహంతో ఊపేస్తుంది. అలాంటి సున్నితమైన ప్రేమకథను సుదీర్ఘంగా చెప్పిన చిత్రమే 'నిన్నుతలచి'. నిజమైన ప్రేమను సొంతం చేసుకునేందుకు కథానాయిక అనుభవించిన మానసిక సంఘర్షణే ఈ సినిమా కథ. హృదయాన్ని తాకే సన్నివేశాలుగానీ .. మాటలుగాని .. పాటలుగాని లేని ఈ సినిమా యూత్ ను నిరాశ పరుస్తుంది.
ప్రేమ అనే రెండు అక్షరాల చుట్టూ అందం .. అల్లరి .. ఆనందం .. అనుభూతి .. వినోదం .. విరహం అల్లుకుని కనిపిస్తాయి. వీటిలో ఏది లోపించినా అది నిజమైన ప్రేమకథగా నిలబడలేదు. ఈ అంశాలన్నీ మేళవింపుగా వచ్చిన ప్రేమకథా చిత్రాలు తెరపై తడబడలేదు. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నిన్ను తలచి'లో ఈ అంశాలు ఎంతవరకూ వున్నాయో .. దర్శకుడిగా అనిల్ తోట ఏ మేరకు మెప్పించాడో ఇప్పుడు చూద్దాం.

అభి(వంశీ) ఓ బిజినెస్ మేన్ వారసుడు. అంకిత( స్టెఫీ పటేల్) ఓ ఇంజనీర్ గారాల పట్టి. అంకితను తొలిసారి చూడగానే అభి మనసు పారేసుకుంటాడు. అంకితకి ఇష్టమైన పెయింటింగ్స్ ద్వారా ఆమెకి చేరువవుతాడు. తన మనసులో ఆమెపట్ల గల ప్రేమను గురించి చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఆ సమయం రానే వస్తుంది .. ఆమెని తను ప్రేమిస్తున్నట్టుగా అతను చెప్పేలోగా ఆమె ఓ విషయం చెబుతుంది. ఊహించని ఆ సంఘటనకి అతను బిత్తరపోతాడు. ఆ తరువాత వాళ్లిద్దరి మధ్యలోకి కిరణ్ ఎంటరవుతాడు. కిరణ్ ఎవరు? అతని రాకతో ఆ ఇద్దరి మధ్య చోటుచేసుకునే సంఘటనలు ఎలాంటివి? అనే మలుపులతో మిగతా కథ ముందుకు వెళుతుంది.

ప్రేమకథలను ఫీల్ తో తెరకెక్కించడం అంత ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే నాయకా నాయికల పాత్రల్లో తమని తాము చూసుకుంటూ కనెక్ట్ అయ్యేవాళ్లు ఎక్కువ వుంటారు. ఆ పాత్రలను ఓన్ చేసుకుని మిగతా పాత్రలతో కలిసి ట్రావెల్ చేస్తుంటారు. ఆ ఫీల్ లేనప్పుడు ప్రేక్షకులు ఆనందాన్ని పొందలేరు .. అనుభూతిని చెందలేరు. ఈ సినిమా విషయంలో ఇదే జరిగింది. కథలో బలం లేదు .. కథనంలో పట్టు ఎక్కడా కనిపించదు. 'ఆ సీన్ తరువాత ఈ సీన్ వేసేద్దాం' అని ఓ మాట అనుకుని ఆర్డర్ వేసినట్టుగా అనిపిస్తుంది. హీరో .. హీరోయిన్ ఇద్దరూ కొత్తవాళ్లే. గ్లామర్ పరంగా చూసుకుంటే ఫరవాలేదు .. కానీ నటన పరంగా వీక్ గా వున్నారు. హీరోతో పోలిస్తే హీరోయిన్ కాస్త బెటర్. ఫస్టాఫ్ అంతా ఎలాంటి మలుపులు లేకుండా సహనానికి పరీక్ష పెడుతూ సాగిపోతుంది. సెకండాఫ్ లో చిన్న పాయింట్ ఉన్నప్పటికీ దానిని బలంగా చెప్పే ప్రయత్నం జరగలేదు.

నటీనటుల విషయానికొస్తే హీరో వంశీ ఒడ్డూ పొడుగు పరంగా ఫరవాలేదు. హావభావాలను పలికించడంపైన .. డైలాగ్ డెలివరీ పైన .. డాన్సుల పైన ఆయన చాలా కసరత్తు చేయవలసి వుంది. ఈ సినిమాలో హీరో .. పక్కనున్న పాత్రలతో కంటే తనలో తను ఎక్కువగా మాట్లాడుకోవడం విశేషం. ఈ సినిమా ద్వారానే పరిచయమైన స్టెఫీ పటేల్ నటన కూడా అంతంత మాత్రమే. అమ్మాయి కళ్లలో మంచి ఆకర్షణ వుంది. ఇక హీరోయిన్ తండ్రి పాత్రను పోషించిన ఆనంద్ సీనియర్ ఆర్టిస్ట్ కనుక, తనదైన శైలిలో బాగానే చేశాడు. హీరో తండ్రిగా చేసిన కేదార్ శంకర్ డైలాగ్ డెలివరీ - ఎక్స్ ప్రెషన్స్ మ్యాచ్ కానట్టుగా అనిపిస్తాయి. కిరణ్ పాత్రలో కొత్త నటుడు ఫరవాలేదనిపించాడు. హీరో మిత్రబృందం పేరుతో చాలామందే కనిపించారుగానీ, వాళ్ల ద్వారా కామెడీ పండలేదు .. కథకి ప్రయోజనమూ చేకూరలేదు.

ఈ సినిమాకి సంబంధించినంత వరకూ ఎక్కువ మార్కులు ఎవరికి ఇవ్వొచ్చు అనే ప్రశ్న వేసుకుంటే, ముందుగా కెమెరా పనితనమే కనిపిస్తుంది. కథ కథనాలను భరిస్తూ ప్రేక్షకులను కూర్చోబెట్టింది ఈ ఫొటోగ్రఫీనే. నాయకా నాయికలను అందమైన ఫ్రేమ్స్ లో చూపించాడు. సముద్రం .. పంటపొలాలు ... కొండకోనలు .. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను చాలా అందంగా చిత్రీకరించాడు. సంగీత దర్శకుడు మహావీరకి ఓ మాదిరి మార్కులు పడతాయి. ఓ లవ్ సాంగ్ .. ఓ మాస్ బీట్ .. ఓ ఏమోషనల్ సాంగ్ .. ఇలా చేసుకుంటూ వెళ్లాడు గానీ, ఏదీ మనసుకు పట్టుకోదు. అప్పటికప్పుడు ఓకే అనిపిస్తాయంతే. ప్రేమకథలకు ప్రాణంపోసే మంచి మెలోడీ పడకపోవడం మరో మైనస్సే.

ఇక ఎడిటింగ్ పరంగా చూసుకుంటే అవసరం లేని సీన్స్ .. అవసరానికి మించిన సీన్స్ .. ఇరికించిన సాంగ్స్ కూడా కనిపిస్తాయి. హీరో - ఫ్రెండ్స్ కాంబినేషన్ సీన్స్ .. హీరో - చెల్లెలు సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక మాటల విషయానికొస్తే పాత్రలని కనెక్ట్ చేయవు, చూస్తున్న ప్రేక్షకులను కనెక్ట్ కానీయవు. పాటల్లోని సాహిత్యం అంతంత మాత్రమే. 'నిన్ను కోరి' తరహాలోనే 'నిన్ను తలచి' టైటిల్ ను డిజైన్ చేయించినా, ఆ ఫీల్ ఏ మూలన కనిపించదు. 'నిన్ను తలచి'లో ప్రతి దృశ్యం తెరపై నుంచి జారిపోయినంత తేలికగానే మనసు తెరపై నుంచి కూడా జారిపోతుంది. ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోని ప్రేమకథా చిత్రాల జాబితాలోనే ఇది చేరిపోతుంది.

Movie Name: Ninnu Thalachi

Release Date: 2019-09-27
Cast: Vamsi, Stefy Patel, Anand, Kedar Shankar
Director: Anil Thota
Producer: Ajith Reddy, Obulesh
Music: Yellendar Mahaveera
Banner: Nedurumalli Productions

Ninnu Thalachi Rating: 1.50 out of 5


More Movie Reviews