ఓటీటీ రివ్యూ :'ఫాల్'

  • అంజలి ప్రధాన పాత్రధారిగా 'ఫాల్'
  • థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో సాగే కథ 
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
  • అందుబాటులో ఉన్న మూడు ఎపిసోడ్స్ 
  • ఆసక్తికరమైన కథాకథనాలతో ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్
ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టాలనే సరికి ఇటు సినిమాలు .. అటు వెబ్ సిరీస్ లు థ్రిల్లర్ జోనర్ నే ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? అనే ఒక ఉత్కంఠను రేకెత్తించే కథలే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. అలాంటి జోనర్లో రూపొందిన వెబ్ సిరీస్ నే 'ఫాల్'. అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్ నిన్నటి నుంచి 'డిస్నీ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. దీపక్ - రాజేశ్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి సిద్ధార్థ రామస్వామి దర్శకత్వం వహించాడు. 

అంజలి ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నుంచి వచ్చిన వెబ్ సిరీస్ లు మంచి రివ్యూలను సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన 'ఫాల్'కి సంబంధించి మూడు ఎపిసోడ్స్ ను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' వారు అందుబాటులో ఉంచారు. అంజలితో పాటు సోనియా అగర్వాల్ .. ఎస్.పి. చరణ్ .. సంతోష్ ప్రతాప్ .. తలైవాసల్ విజయ్ .. పూర్ణిమ భాగ్యరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

కథలోకి వెళితే .. కోయంబత్తూరులో లక్ష్మి ( పూర్ణిమ భాగ్యరాజ్) శంకరన్ (తలైవాసల్ విజయ్) అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వారి సంతానమే రోహిత్ (ఎస్.పి. చరణ్) దివ్య (అంజలి) మాయ (నమిత కృష్ణమూర్తి). రోహిత్ కి మలార్ (సోనియా అగర్వాల్)తో వివాహం జరుగుతుంది. వారి సంతానమే భూమిక. ఒక అరుదైన వ్యాధితో ఆ పాప బాధపడుతూ ఉంటుంది. రోహిత్ ను మలార్ పెళ్లి చేసుకోవడానికి ముందు నుంచి ఆమెతో దివ్యకి మంచి స్నేహం ఉంటుంది.  

దివ్య - డేనియల్ ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే తనకి సంబంధించిన ఒక స్థలానికి దగ్గరలో మెట్రో స్టేషన్ వస్తుందనీ, ఆ స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతోనే తనకి డేనియల్ చేరువయ్యాడనే సంగతి దివ్యకి తెలుస్తుంది.  ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి అతను ట్రై చేస్తున్నాడని గ్రహిస్తుంది. స్పోర్ట్స్ కి సంబంధించి అనాథ పిల్లలతో అక్క్కడ ఆమె ఒక ట్రైనింగ్ సెంటర్ ను నిర్వహిస్తుంటుంది. డేనియల్ పథకం గురించి తెలుసుకున్న రోజు రాత్రి ఆ స్పోర్ట్స్ సెంటర్ బిల్డింగ్ పై నుంచి దివ్య  పడిపోతుంది. 

6 నెలలపాటు దివ్య కోమాలోనే ఉంటుంది. ఇక ఆమె బ్రతకదని భావించిన రోహిత్, ఆ స్థలాన్ని అమ్మేద్దామని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తుంటాడు. అతని అభిప్రాయంతో మాయ కూడా ఏకీభవిస్తుంది. ఆ స్థలం కోసం కృతికతో కలిసి డేనియల్ ట్రై చేస్తూనే ఉంటాడు. దివ్య పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం వలన, ఇక ఆమెను ప్రాణాలతో ఉంచవలసిన అవసరం లేదని డాక్టర్లతో చెప్పడానికి రోహిత్ సిద్ధపడతాడు. 

 సరిగ్గా ఆ సమయంలోనే కోమాలో నుంచి దివ్య బయటికి వస్తుంది. అయితే ఆమె తన గతాన్ని మరిచిపోతుంది. ఆమెకి గతం గుర్తొచ్చేలోగా తమ పనులను చక్కబెట్టాలని ఇటు రోహిత్ - మాయ, అటు డేనియల్ - కృతిక నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? మలార్ కోరిక మేరకు రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కుమరన్ విచారణ ఎలా జరుగుతుంది?  అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

ఈ వెబ్ సిరీస్ నుంచి ఈ వారం మూడు ఎపిసోడ్స్ ను మాత్రమే వదిలారు. అంజలిపై పాత్రపైనే ఫస్టు సీన్ ను ఓపెన్ చేసిన డైరెక్టర్ ఆ సీన్ తోనే ఆయాసక్తిని రేకెత్తించాడు. ప్రతి ఎపిసోడ్ ముగింపు కూడా ఆ తరువాత ఎపిసోడ్ పై కుతూహలాన్ని పెంచేదిలా ఉంది. ప్రధాన పాత్రలు ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ .. కథను ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుంటాయి. ఏ పాత్రతోను ప్రేక్షకుడికి గ్యాప్ రానీయకుండా చేసిన స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్ కి ప్రధానమైన బలం అని చెప్పచ్చు. 

 దర్శకుడు కథాకథనాల్లో మంచి వేగం చూపించాడు. ఎక్కడా కూడా బోర్ అనిపించదు. అలాగే ప్రధానమైన పాత్రలను మలచిన తీరు బాగుంది. ఆ పాత్రల స్వరూప స్వభావాల విషయంలో దర్శకుడు పూర్తి అవగాహనతో ఉన్నాడు. కిషన్ ఎడిటింగ్ బాగుంది. అజేశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఆహా అనిపించే స్థాయిలో లేకపోయినా, కథాకథనాల పరంగా ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది. మిగతా ఎపిసోడ్స్ ను త్వరలో స్త్రీమించి చేసే ఛాన్స్ ఉంది.

Movie Name: Fall

Release Date: 2022-12-09
Cast: Anjali, Sonia Agarwal, Talaivasal Vijay, Santhosh Prathap
Director: Siddharth Ramaswamy
Producer: Deepak Dhar
Music: Ajesh
Banner: Circle Box Entertainment

Fall Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews