'నిను వీడని నీడను నేనే' మూవీ రివ్యూ

ఇటీవల కాలంలో తెలుగు తెరపైకి కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాల జాబితాలో 'నినువీడని నీడను నేనే' ఒకటిగా కనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఆసక్తికరంగా అనిపించే ఈ సినిమా, కథాకథనాల్లోని మెలికల కారణంగా, బి - సి సెంటర్స్ లోని ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు.
తెలుగు తెరకు హారర్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు కొత్తేమీ కాదు. ఈ తరహాలో వచ్చిన సినిమాల్లో బలమైన కంటెంట్ వుంటే మాత్రం బాగానే ఆడేశాయి. అలాంటి హారర్ జోనర్ ను టచ్ చేస్తూ .. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'నినువీడని నీడను నేనే'. కొంచెం హారర్ ను .. కొంచెం రొమాన్స్ ను మరికొంచెం ఎక్కువగా సస్పెన్స్ పాళ్లను కలిపి ఒక కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆయన కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఈ కథ 2035లో హైదరాబాద్ లో మొదలవుతుంది. మానసిక వైద్యుడిగా పనిచేసి విశ్రాంతి జీవితాన్ని గడుపుతోన్న మురళీశర్మను కొంతమంది యువ స్కాలర్స్ కలుస్తారు. తమ పరిశీలనలోకి వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ కేసులకి సంబంధించిన సందేహాలను ఆయన దగ్గర వ్యక్తం చేస్తారు. అప్పుడు తన కెరియర్లో ఒక చిత్రమైన కేసును చూశానంటూ 2013లో హైదరాబాద్ - కూకట్ పల్లిలో జరిగిన ఒక సంఘటనను గురించి మురళీశర్మ చెప్పడం మొదలెట్టడంతో కథ ఆ కాలానికి వచ్చేస్తుంది.
 
రిషి (సందీప్ కిషన్) దియా (ఆన్యా సింగ్) ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. ఒక రోజున రాత్రి వాళ్లిద్దరూ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురవుతుంది. చిన్నచిన్న గాయాలతో బయటపడిన రిషి - దియా, తాము శ్మశానానికి సమీపంలో వున్నట్టుగా గుర్తిస్తారు. దియా భయపడుతూ ఉండటంతో రిషి ఆమెను తీసుకుని అతికష్టం మీద ఇంటికి చేరుకుంటాడు. అప్పటి నుంచి రిషి 'అద్దం' చూసుకున్నప్పుడల్లా అతనికి బదులుగా 'అద్దం'లో మరో వ్యక్తి కనిపిస్తుంటాడు.

దియాకి కూడా అద్దంలో తన రూపానికి బదులుగా మరో స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. శ్మశానం దగ్గర తమని దెయ్యాలు ఆవహించి వుంటాయని వాళ్లు భయపడిపోతారు. తమకి బదులుగా అద్దంలో కనిపిస్తోన్న ఆ ఇద్దరూ ఎవరో కనుక్కోవాలనే నిర్ణయానికి వస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్లు డాక్టర్ మురళీశర్మను కలుస్తారు. ఈ కేసు విషయంలో ఆయన పోలీస్ ఆఫీసర్ పోసాని సాయం తీసుకుంటాడు. వాళ్ల పరిశీలనలో తెలిసే భయంకరమైన నిజాలు ఏమిటి? ఆ నిజాలను జీర్ణించుకోలేకపోయిన రిషి - దియా ఏం చేస్తారు? అనే ఆసక్తికరమైన మలుపులతో మిగతా కథ నడుస్తుంది.

దర్శకుడు కార్తీక్ రాజు హారర్ .. సస్పెన్స్ .. రొమాన్స్ మేళవింపుతో ఈ కథను అల్లుకున్నాడు. 400 సంవత్సరాల క్రితం 'గ్రీస్' దేశం పక్కనే గల ఒక గ్రామంలో ఒక పిల్లవాడు అద్దం చూసుకోగా ఒక మాంత్రికుడి రూపం కనిపించిన సంఘటన జరిగిందంటూ ఒక యథార్థ సంఘటనతో ఈ కథకి బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేశాడు. ఆసక్తికరమైన టాపిక్ తో కథను మొదలెట్టిన కార్తీక్ రాజు, రొమాన్స్ పాళ్లను పెంచుతూ హారర్ దిశగా ప్రేక్షకులను తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సస్పెన్స్ ను పెంచుతూ అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు. ఇక్కడివరకూ పట్టుగా నడిచిన స్క్రీన్ ప్లే, ఆ తరువాత సడలిపోతూ పట్టు జారిపోయింది. అద్దంలో తమకి బదులుగా కనిపిస్తున్నది ఎవరనే విషయం రిషికి .. దియాకి తెలిసిన తరువాత తెరపైకి వచ్చే సన్నివేశాలు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. మురళీశర్మ పాత్ర వైపు నుంచి క్లారిటీ ఇచ్చే విషయంలో, సెకండాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.

గతంలో కంటే ఈ సినిమాలో సందీప్ కిషన్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లో బాగా చేశాడు. కారు ప్రమాదానికి గురైన రోజున అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకున్న సందర్భంలోను .. ప్రీ క్లైమాక్స్ లో తల్లిదండ్రులను కలుసుకునే సీన్లోను మంచి నటనను కనబరిచాడు. నాయికగా 'ఆన్యా సింగ్' కి ఇది తొలి సినిమా. పాత్ర పరంగా న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నం చేసింది. అయితే ఆడియన్స్ వైపు నుంచి గ్లామర్ పరంగా ఆమెకి పడే మార్కులు చాలా తక్కువనే చెప్పాలి. మానసిక వైద్యుడి పాత్రను మురళీ శర్మ చాలా డీసెంట్ గా చేశాడు. ఇక దెయ్యాలంటే భయపడే పోలీస్ ఆఫీసర్ గా పోసాని నవ్వించాడు. ఒకటి రెండు సార్లు తప్ప, వెన్నెల కిషోర్ ఎక్కువగా అద్దంలోనే కనిపించాడు. ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించినస్థాయి హాస్యం అందలేదు.

తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మొత్తం మూడు పాటల్లో చివర్లో వచ్చే 'అమ్మా అమ్మా ఈ జన్మకు రుణమింతేనమ్మా' అనే పాట ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తమన్ అందించిన రీ రికార్డింగ్ మాత్రం ఈ సినిమాకి మరింత బలాన్నిచ్చింది. ఈ సినిమాకి ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా చీకటి నేపథ్యంలోని  సీన్స్ ను ఆకట్టుకునేలా ఆవిష్కరించాడు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, హీరో - హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ను పోసాని - మురళీ శర్మల సీన్స్ ను ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి నచ్చుతుంది. మాస్ ఆడియన్స్ కు నచ్చే అంశాలు చాలా తక్కువ. కథాకథనాల్లోని మలుపులు సాధారణ ప్రేక్షకులకు కొంత అయోమయాన్ని కలిగిస్తాయి. అందువలన ఈ సినిమా బి - సి సెంటర్స్ లోని ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. 

Movie Name: Ninu Veedani Needanu Nene

Release Date: 2019-07-12
Cast: sandeep Kishan, Aanya Singh, Murali Sharma, Posani, Pragathi
Director: Karthick Raju
Producer: Sandeep Kishan,Supriya Kancharla
Music: S.Thaman
Banner: Venkatadri Talkies

Ninu Veedani Needanu Nene Rating: 2.75 out of 5


More Movie Reviews