విజయ్ సేతుపతి - త్రిష జంటగా తమిళంలో తెరకెక్కిన '96' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆ సినిమాను కన్నడలో '99' పేరుతో రీమేక్ చేశారు. గోల్డెన్ స్టార్ గణేశ్ - భావన జంటగా నటించిన ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాత 'దిల్' రాజు .. తమిళంలో ఈ సినిమాను రూపొందించిన ప్రేమ్ కుమార్ నే దర్శకుడిగా తీసుకుని, 'జాను' టైటిల్ తో తెలుగు రీమేక్ చేయించాడు. ఈ రోజున విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం.
వైజాగ్ లోని ఒక స్కూల్లో రామ్ (శర్వానంద్) .. జాను (సమంత) చదువుతుంటారు. టీనేజ్ లోకి అడుగుపెడుతూనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతూ వుండగా, కొన్ని కారణాల వలన రామ్ ఆ ఊరు వదిలి పోవలసి వస్తుంది. ఆ తరువాత జాను జీవితంలోను అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా ఒకరి జాడ ఒకరికి తెలియకుండా పోతుంది. 15 యేళ్ల తరువాత రామ్ - జాను క్లాస్ మేట్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమ్మేళనానికి రామ్ - జాను ఇద్దరూ వస్తారు. అప్పుడు అక్కడ ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయి? ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.
తమిళంలో ఇదే కథతో ఆల్రెడీ హిట్ కొట్టిన ప్రేమ్ కుమార్, తెలుగు తెరపై ఆ కథను ఆవిష్కరించాడు. కథ .. కథనం .. సంగీతం అన్నీ కూడా అనుభూతిని ప్రధానంగా చేసుకునే సాగుతాయి. డైలాగ్స్ కంటే కూడా హావభావాలకి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. పాత్రల హావభావాలకు .. దృశ్యాలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు సహజంగానే సన్నివేశాలను సాగదీసి చెబుతున్నట్టు అనిపిస్తుంది .. ఇక్కడ అదే జరిగింది.
కథకి తగినట్టుగా తెరపై కొన్ని పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అయితే అవి తమ ఉనికిని చాటుకునే పాత్రలేగానీ, అంతగా ప్రాధాన్యత కలిగినవి కావు. ఆ కాసిన్ని పాత్రలతోనే ఫస్టాఫ్ లో కాస్త సందడి చేయించిన దర్శకుడు, సెకండాఫ్ మొత్తాన్ని నాయకా నాయికలపైనే నడిపించాడు. లొకేషన్లు మారిపోతుంటాయిగానీ, తెరపై నాయకానాయికలు మాత్రమే కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పడుతుంటాయిగానీ, ఇద్దరినీ అంతసేపు చూడటం ప్రేక్షకులకు బోర్ కొట్టేసే విషయం.
ప్రేమకథా చిత్రాల్లో దృశ్యంలో అందం .. భావంలో సున్నితత్వం .. పాటల్లో పరిమళం .. మాటల్లో లోతు ఉండాలి. ఈ సినిమాలో మొదటి రెండు మాత్రమే కనిపిస్తాయి. మిగతా రెండూలేని లోపం తెలుస్తూనే ఉంటుంది. ఇక రైలు బోగీల మాదిరిగా ఒక సీన్ తరువాత ఒకటి వస్తుంటాయి గానీ, ఎక్కడా ఎలాంటి మలుపులు లేవు. ఉన్నది ఒకటే ట్విస్ట్ .. దానిపైనే కథ మొత్తం నడుస్తుంది. ఇక ఈ సినిమాకి సమంత పాత్ర పేరు పెట్టడంతోనే, ఆ పాత్రకి ఎంత ప్రాధాన్యత వుందో అర్థం చేసుకోవచ్చు. కానీ సమంత మరీ పీలగా అనిపిస్తూ .. మునుపటి ఆకర్షణ లేకుండా కనిపించడం ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించే మరో అంశంగా చెప్పుకోవచ్చు.
శర్వానంద్ .. సమంత ఇద్దరికీ కూడా నటనపరంగా వంక బెట్టవలసిన పనిలేదు. లవ్ .. ఏమోషన్స్ కి సంబంధించిన హావభావాలను మనసుకు తాకేలా ఆవిష్కరించారు. అయితే సమంత వచ్చి కటింగ్ చేయించే వరకూ గుబురు గెడ్డం .. మీసాలతో శర్వానంద్ కనిపించిన తీరు ప్రేక్షకులకు కూడా నచ్చదు. ఇక మరీ బక్క పలచగా మారిపోయి కళ తప్పిన ఫేస్ తో సమంత లుక్ కూడా ఇబ్బంది పెడుతుంది. స్కూల్ డేస్ లో వీళ్ల పాత్రలను పోషించిన అమ్మాయి - అబ్బాయి కూడా బాగా చేశారు. హీరో హీరోయిన్ల స్నేహితులుగా వెన్నెల కిషోర్ .. శరణ్య ప్రదీప్ .. తాగుబోతు రమేశ్ పాత్ర పరిధిలో నటించారు.
తమిళ చిత్రానికి సంగీతాన్ని అందించిన గోవింద్ వసంతనే ఈ సినిమాకి బాణీలు కట్టాడు. సందర్భానికి తగినట్టుగా ఆ బాణీలు పలకరించి వెళుతుంటాయిగానీ, మనసును పట్టుకుని వేళ్లాడవు. రీ రికార్డింగ్ తో ఫీల్ మెయిన్ టేన్ చేసిన తీరు ఫరవాలేదు. సన్నివేశాలు ఫీల్ తో కూడుకుని ఉండటం వలన, ట్రిమ్ చేసే విషయంలో ఎడిటర్ ప్రవీణ్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మహేంద్రన్ జయరాజ్ కెమెరా పనితనం బాగుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. కథానాయకుడిని ట్రావెలింగ్ ఫొటోగ్రఫర్ గా చూపించవలసి రావడంతో, ఈ ఫొటోగ్రఫర్ కి తన సత్తా చాటుకునే అవకాశం లభించింది.
స్కూల్ డేస్ .. కాలేజ్ డేస్ లో ప్రేమలు, అవి పెళ్లి వరకూ వెళ్లకుండానే బ్రేక్ పడటాలు వంటి సంఘటనలు చాలా మంది జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. అందువలన ఈ తరహా కంటెంట్ తో వచ్చిన కథలకు ప్రేక్షకులు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంటారు. ఆ ఫీల్ ను కొంతవరకూ ఆస్వాదిస్తారు .. అనుభూతి చెందుతారు. కథలో మలుపులను పట్టించుకోకుండా అదే ఫీల్ ను లాగదీస్తూ కూర్చుంటే మాత్రం అసహనానికి లోనవుతారు. అనుభూతి అనేది పదార్థం కాకూడదు .. పరిమళమైతేనే అందం. అలాగే జ్ఞాపకమనేది కూడా పట్టుకుని వేళ్లాడకుండా పట్టులా జారిపోతున్నప్పుడే అందంగా ఉంటుంది. ఈ విషయాలు లోపించడం వల్లనే ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
'జాను' మూవీ రివ్యూ
| Reviews
Jaanu Review
అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు భవిష్యత్తును నిర్ణయిస్తుంటాయి .. జీవితాన్ని మార్చేస్తుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇద్దరి ప్రేమికులను దూరం చేస్తుంది. ఆ సంఘటన ఏమిటి? చాలా కాలం తరువాత కలుసుకున్న ఆ ఇద్దరూ ఆ జ్ఞాపకాలను ఎలా పంచుకున్నారు? అనేది కథ. అనుభూతి ప్రధానమైన ఈ కథ, ఆ పరిధిని దాటేసి సాగతీతగా అనిపిస్తుంది. ఈ తరహా కథలకు ప్రాణంగా నిలవాల్సిన పాటలు, ప్రేక్షకుల మనసులను పట్టుకోలేకపోయాయి .. ఆకట్టుకోలేకపోయాయి. తమిళ .. కన్నడ భాషా ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కథ, తెలుగు రీమేక్ గా మాత్రం ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
Movie Name: Jaanu
Release Date: 2020-02-07
Cast: Sharwanand, Samantha, Vennela Kishore, Saranya Pradeep, Raghu Babu, Thagubothu Ramesh
Director: Prem Kumar
Music: Govind Vasantha
Banner: Sri Venkateswara Craetions
Review By: Peddinti