మొదటి నుంచి కూడా నాగశౌర్య లవర్ బాయ్ ఇమేజ్ తో కూడిన సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. అందుకు భిన్నంగా ఈ సారి ఆయన యాక్షన్ కి ప్రాధాన్యతనిస్తూ 'అశ్వద్ధామ' చేశాడు. ఈ సినిమా కోసం అన్బు - అరివు అనే హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ను కూడా ఆయన రంగంలోకి దింపాడు. అంతేకాదు ఈ సినిమా ద్వారా ఆయన 'రమణ తేజ' అనే దర్శకుడిని పరిచయం చేశాడు. యాక్షన్ హీరోగా ఆయన ఎన్ని మార్కులు కొట్టేశాడో .. దర్శకుడిగా రమణ తేజ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించాడో ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళితే .. గణ (నాగశౌర్య)కి తన చెల్లెలు ప్రియ (సర్గన్ కౌర్) అంటే ప్రాణం. ఆ చెల్లెలి నిశ్చితార్థం కోసం విదేశాల నుంచి ఆయన తిరిగొస్తాడు. ఆనందంగా ఉండవలసిన ప్రియ ఆత్మహత్యకి ప్రయత్నించడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తను తల్లిని కానున్నాననీ .. అందుకు కారకులు ఎవరన్నది తనకి తెలియదని చెల్లెలు చెప్పడంతో బిత్తరపోతాడు. అదే సమయంలో నగరంలో కొంతమంది అమ్మాయిలు అదృశ్యం కావడం .. పెళ్లి కాకుండానే తాము ఎలా గర్భవతులమయ్యామో తెలియక కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారుతుంది. జరుగుతున్న ఈ విపరీతాలకు కారణం ఏమిటి? ఆడపిల్లల తల్లిదండ్రులను కలవరపెడుతున్న వరుస సంఘటనల వెనుక ఎవరున్నారు? అనే విషయాలను కనుక్కోవడానికి గణ రంగంలోకి దిగుతాడు. ఈ ప్రయత్నంలో గణకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? గణను ప్రేమిస్తున్న నేహా (మెహ్రీన్) ఈ విషయంలో ఆయనకి ఎలా సాయపడుతుంది? అనే మలుపులతో మిగతా కథ నడుస్తుంది.
కథ ఎక్కడ ఎలా మొదలైంది .. ఎక్కడ ఎలా ముగిసింది అనే రెండు విషయాల మధ్యలో చాలా తతంగం జరుగుతుంది. ఈ తతంగమే ప్రేక్షకుడిని చివరివరకూ సీట్లో కూర్చోబెడుతుంది. కథ రాయడంలో అనుభవం లేకపోయినా, ఆ కథను తెరపై చెప్పడంలో అనుభవం లేకపోయినా ఆ లోపాలు ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి అసంతృప్తిని కలిగించే చిత్రంగా 'అశ్వద్ధామ' కనిపిస్తుంది. సాధారణంగా హీరోలు తమ ఇమేజ్ పరిధిలో నుంచి బయటికి రావడానికి అంతగా ఇష్టపడరు. అందుకు కారణం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే సందేహం .. కోట్ల రూపాయలతో ప్రయోగం. అలాంటి సాహసాన్ని నాగశౌర్య చాలా తక్కువ సమయంలో చేయడం అభినందనీయమే. అయితే తను కథ రాసుకోవడం .. ఆ కథ తనకి బాగా అనిపించడమే ఆడియన్స్ లో అసంతృప్తికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇక దర్శకుడిగా రమణ తేజ అనుభవ లోపం మరో కారణమనే చెప్పాలి.
యాక్షన్ హీరోగా తనని తాను నిరూపించుకోవాలనే నాగశౌర్య ఆలోచన మంచిదే. అయితే అందుకు చాలా సమయం వుంది. ఇక యాక్షన్ ను ఒక అంశంగా చేసుకుని మిగతా రసాలను మేళవిస్తూ కూడా ఆయన ఈ ప్రయత్నం చేయవచ్చు. కానీ యాక్షన్ వెంట పరిగెడుతూ ఆయన ప్రేక్షకులు కోరుకునే వినోదాన్నీ .. హీరోయిన్ నుంచి ఆశించే రొమాన్స్ ను .. ఆ రొమాన్స్ అందంగా ఆవిష్కరించే పసందైన పాటలను పక్కన పెట్టేశాడు. హీరోయిన్ ను .. ఇతర పాత్రలను కూడా నామమాత్రం చేశాడు. జరుగుతున్న నేరాలకు .. ఘోరాలకు కారకులు ఎవరనేది ప్రేక్షకులకు చివరివరకూ తెలియకూడదు. ఆ సస్పెన్స్ నే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. కానీ విశ్రాంతి కాగానే వెంటనే ఆ ముడి విప్పేసి ఆ కాస్త ఆసక్తిని చల్లబరిచారు. కథ .. కాసులు రెండూ నాగశౌర్యవే గనుక, దర్శకుడి పాత్ర నామమాత్రంగానే వుండే అవకాశం ఎక్కువ. అందువలన ఆయన ప్రమేయాన్ని తక్కువగా చెప్పుకుంటున్నాం. ఉండటానికి హీరో హీరోయిన్ల కుటుంబాలంటూ చాలామంది ఆర్టిస్టులనే చూపించారు. కానీ ఏ పాత్రకి ప్రాధాన్యత లేదు .. ప్రత్యేకత లేదు .. ప్రయోజనమూ లేదు. కనీసం ఆ పాత్రల పేర్లను కూడా రిజిస్టర్ అయ్యేలా చేయలేకపోయారు.
గణపాత్రలో .. గుడ్ లుకింగ్ తో నాగశౌర్య చాలా బాగా చేశాడు. మంచి ఫిట్ నెస్ తో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు. అయితే హాలీవుడ్ ఫైట్ మాస్టర్లు ఈ సినిమాకి పెద్దగా హెల్ప్ కాలేదనే చెప్పాలి. ఫైట్స్ లో ఎక్కడా ప్రత్యేకత కనిపించదు. పైగా అవసరానికి మించి ... సందర్భానికి మించి .. పరిధిని దాటిపోయి కనిపిస్తాయి. డూప్ లేకుండా ఛేజ్ సీన్స్ లో పాపం బాగానే కష్టపడ్డాడు. కథానాయికగా మెహ్రీన్ ఈ పాత్ర ఎందుకు ఒప్పుకుందో ఆమెకే తెలియాలి. ఆమె గురించి చెప్పుకోవడానికి ఒక్క లైన్ కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇక విలన్ గా జిషు సేన్ గుప్తా బాగానే చేశాడు. విలన్ గా కొత్త ఫేస్ ను చూపించాలనే ప్రయత్నం బాగుంది. అయితే హేమచంద్రతో కాకుండా మరొకరితో డబ్బింగ్ చెప్పించాల్సింది. హేమచంద్ర.. అరవింద్ స్వామికి చెబుతూ వస్తుండటం వలన, తెరపై అరవింద్ స్వామిని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. విలనిజం పేరుతో ఆయన పాత్ర ద్వారా చూపించిన రక్తపాతం ఎక్కువ ఉండటం మరో మైనస్ గానే చెప్పుకోవాలి.
శ్రీచరణ్ పాకాల సంగీతం .. జిబ్రాన్ రీ రికార్డింగ్ . . గ్యారీ ఎడిటింగ్ ఓ మాదిరిగా వున్నాయి. 'మనోజ్ రెడ్డి ఫొటోగ్రఫీ ఫరవాలేదు. 'నేరం చేయడం తప్పుకాదు .. సాక్ష్యాన్ని వదిలేయడం తప్పు' అనే విలన్ డైలాగ్, 'అర్జునుడే దిగి వచ్చినా అర్థం కానీ పద్మవ్యూహం ఇది' అనే హీరో డైలాగ్ సందర్భానికి తగినట్టుగా ఆకట్టుకుంటాయి. ఆకట్టుకోలేకపోయిన కథ .. ఆసక్తిని రేకెత్తించని కథనం .. వినోదానికి దూరంగా సాగిన ప్రయాణం కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే చెప్పాలి .
'అశ్వద్ధామ ' మూవీ రివ్యూ
| Reviews
Ashwathama Review
ఒక వైపున కుటుంబ గౌరవాన్నీ .. మరో వైపున చెల్లెలి కాపురాన్ని కాపాడుకోవడానికి రంగంలోకి దిగిన కథానాయకుడే 'అశ్వద్ధామ'. నగరంలో ఆడపిల్లలు అదృశ్యం కావడానికి గల కారణాన్ని కనుక్కునే బాధ్యతను కూడా ఆయన తన భుజాలపైనే వేసుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది ? వాటిని ఆయన ఎలా అధిగమించాడు? అనేది కథ. నాగశౌర్య తను స్వయంగా రాసిన కథ ఇది .. నిర్మాత కూడా ఆయనే. నిర్మాణ పరమైన విలువలు బాగానే ఉన్నప్పటికీ కథాపరంగా విషయాల్లో అనుభవలేమి కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ను మాత్రమే పట్టుకుని వేళ్లాడిన నాగశౌర్య, మిగతా అంశాలను సరిగ్గా రాసుకోలేకపోయాడు .. ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు.
Movie Name: Ashwathama
Release Date: 2020-01-31
Cast: Naga Shaurya, Mehreen, Sargan Kaur, Jishu Sen Gupta,Posani, Prince, Sathya, Pavitra Lokesh, Jaya Prakash
Director: Ramana Teja
Music: Sri Charan Pakala
Banner: IRA Creations
Review By: Peddinti