'కౌసల్య కృష్ణమూర్తి' మూవీ రివ్యూ

kousalya krishnamurthy

kousalya krishnamurthy Review

కష్టాలను ఎదురిస్తూ .. ప్రతికూల పరిస్థితులపై పోరాడినప్పుడే గమ్యం చేరువవుతుంది .. విజయం సొంతమవుతుంది. క్రీడా స్ఫూర్తిని కలిగిస్తూ అలాంటి సందేశంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'కౌసల్య కృష్ణమూర్తి'. సందేశంపైనే ప్రధానంగా దృష్టిపెట్టడం వలన, వినోదపరమైన అంశాల పాళ్లు తగ్గిపోయి ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.

జీవితంలో ఓ ఆశయం పెట్టుకున్నాక దానిని సాధించడానికి అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అడుగడుగునా ఎదురయ్యే ఎన్నో అవరోధాలను దాటుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. ఆ ఆశయం క్రీడా రంగానికి సంబంధించినదైతే మరింత ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. క్రీడా రంగానికి సంబంధించిన కథా వస్తువుతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. కొంత గ్యాప్ తరువాత ఆ తరహాలో వచ్చిన 'కౌసల్య కృష్ణమూర్తి', ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్) మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన భార్య సావిత్రి (ఝాన్సీ) ఒక వైపున కుటుంబ వ్యవహారాలు చక్కబెడుతూనే, మరో వైపున పొలం పనులు కూడా చూసుకుంటూ ఉంటుంది. ఈ ఇద్దరి కూతురైన కౌసల్య( ఐశ్వర్య రాజేశ్) చదువుకుంటూ ఉంటుంది. కృష్ణమూర్తికి వ్యవసాయమంటే ఇష్టం .. క్రికెట్ అంటే ప్రాణం. ఒకసారి ఇండియా ప్రపంచ కప్ ను సాధించలేకపోయినందుకు ఆయన ఏడ్చేస్తాడు. దాంతో తాను పెద్దయిన తరువాత ఇండియా తరఫున క్రికెట్ ఆడి .. గెలిపించి తండ్రి కళ్లలో సంతోషాన్ని చూడాలని కౌసల్య బలంగా నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఆ క్రమంలో ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే మలుపులు కథలో చోటుచేసుకుంటాయి.

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తెలుగు నేటివిటీకి తగినట్టుగా రీమేక్ లను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. రీమేక్ చిత్రాల ద్వారా ఆయన అందుకున్న విజయాలే ఎక్కువ. ఈ సారి ఆయన క్రితం ఏడాది తమిళంలో హిట్ కొట్టిన 'కనా' చిత్రాన్ని 'కౌసల్య కృష్ణమూర్తి' పేరుతో రీమేక్ చేశాడు. టైటిల్ కి తగినట్టుగానే 'కౌసల్య' అనే కూతురి పాత్ర చుట్టూ, కృష్ణమూర్తి అనే తండ్రి పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక అమ్మాయి క్రీడా రంగంలో ఎదగడానికి ఎన్ని అవాంతరాలను ఎదుర్కోవాలనే విషయాన్ని కూతురి పాత్ర ద్వారా, ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం రైతులకి ఎంత కష్టంగా మారిందనేది తండ్రి పాత్ర ద్వారా ఆవిష్కరించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే కథను సమస్యల చుట్టూ తిప్పుతూ, వినోదపరమైన మిగతా అంశాలను పట్టించుకోకపోవడం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తుంది.

క్రికెట్ ద్వారా ఇండియాకి ప్రపంచ కప్ ను సాధించిపెట్టాలి .. తన తండ్రి కళ్లలో ఆనందాన్ని చూడాలనే ఆశయంతో ముందుకుసాగే 'కౌసల్య' పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపిస్తుంది. తమిళ చిత్రం 'కనా'లో తను చేసిన పాత్రనే ఇందులోను చేసింది. అందువలన పాత్ర పరంగా ఈజీగా మెప్పించేసింది. మానసిక సంఘర్షణకి సంబంధించిన సీన్స్ లోను .. ఎమోషనల్ సీన్స్ లోను బాగా చేసింది. ఇక పంట చేతిక రాక నష్టపోయి, బ్యాంకు ఋణం చెల్లించలేని రైతు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. కూతురి కోసం ఏదైనా చేసే తండ్రిగా .. ప్రాణంగా చూసుకున్న పొలాన్ని కోల్పోయిన రైతుగా ఆయన నటన మనసును భారం చేస్తుంది. కాకపోతే ఆయన హెయిర్ స్టైల్ .. గెడ్డం .. మీసం విషయాల్లో శ్రద్ధ తీసుకోకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుంది. ఇక ఎదిగిన కూతురుని క్రికెట్  ఆడటానికి పంపించడం  ఇష్టం లేని పల్లెటూరి తల్లి పాత్రలో ఝాన్సీ జీవించింది. అలాగే టాలెంట్ వున్న వాళ్లతో ఆడించాలిగానీ, వాళ్ల జీవితాలతో ఆడుకోవాలని చూడకూడదని నమ్మే కోచ్ పాత్రలో శివకార్తికేయన్ నటన మెప్పిస్తుంది. ఇక 'జబర్దస్త్' మహేశ్ .. కార్తీక్ రాజు .. సీవీఎల్ నరసింహారావు పాత్ర పరిథిలో నటించారు. బ్యాంక్ మేనేజర్ గా భీమనేని శ్రీనివాసరావు నటించడం విశేషం.

ధిబూ నినన్ థామస్ అందించిన సంగీతం ఫరవాలేదనిపిస్తుంది. 'ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసైనా' పాట బాగుంది. బాణీ .. కొరియోగ్రఫీ .. ఫొటోగ్రఫీ బాగున్నాయి. ఇక తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ ను ఆవిష్కరించే పాట, క్రికెట్ విషయంలో ఐశ్వర్య రాజేశ్ కసరత్తు చేస్తోన్న సందర్భంలో వచ్చే పాటలు కూడా ఫరవాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ విషయానికొస్తే, కౌసల్య బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్ నిడివి ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది. తండ్రి చనిపోతే కృష్ణమూర్తి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా క్రికెట్ స్కోర్ తెలుసుకోవడానికి ఆరాటపడటమనే సీన్ కాస్త 'అతి'గా అనిపిస్తుంది. కృష్ణమూర్తికి క్రికెట్ అంటే ఎంత పిచ్చి అనేది చూపించడానికి మరో సీన్ ఏదైనా అల్లుకుని వుంటే బాగుండేది.

ఈ కథలో ప్రధాన పాత్రధారి అయిన కౌసల్యకు జోడీ లేకపోవడంతో డ్యూయెట్లకు అవకాశం లేకుండాపోయింది. కామెడీ ట్రాక్ లేకుండా పోవడం మరింత నిరాశను కలిగిస్తుంది. తెలియని ముఖాలే ఎక్కువగా కనిపించడం .. కథలో ఎలాంటి ట్విస్టులు లేకపోవడం అసహనాన్ని పెంచుతుంది. ఒక వైపున క్రీడా రంగంలో అమ్మాయిలకి ఎదురయ్యే పరిస్థితులు .. మరో వైపున వ్యవసాయంలో రైతులు పడే ఇబ్బందుల గురించిన సందేశం ఇవ్వాలనే దర్శకుడి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, ఆ సందేశానికి తగిన పాళ్లలో వినోదాన్ని జోడించకపోవడంతో ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.        

Movie Name: kousalya krishnamurthy

Release Date: 2019-08-23
Cast: Aishwarya Rajesh, Rajendra Prasad, Shiva Karthikeyan, jhansi, Vennela Kishore, kathik Raju
Director: Bhimaneni Srinivasa Rao
Music: Dhibu Ninan Thomas
Banner: Creative Commercials

kousalya krishnamurthy Rating: 2.00 out of 5

More Reviews