ఓటీటీ రివ్యూ: 'జగమే మాయ' (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

Jagame Maya

Jagame Maya Review

  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'జగమే మాయ'
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • ప్రధానమైన పాత్రను పోషించిన ధన్య బాలకృష్ణ
  • కొత్తదనం లేని కథ .. ఆకట్టుకొని కథనం  
  • వెబ్ సిరీస్ కి తగినదిగా అనిపించే కంటెంట్

ఒక తప్పు చేస్తే దానిని కప్పి పుచ్చుకోవడానికి వంద తప్పులు చేయవలసి వస్తుంది' .. 'ఎవరు చేసిన కర్మ వారిని వెంటాడుతూనే ఉంటుంది' అనే మాటలు లోకంలో వినిపిస్తూ ఉంటాయి. పెద్దలు చెప్పిన  అలాంటి ఒక మాటను గుర్తుచేసే కథగా 'జగమే మాయ' కనిపిస్తుంది. ఉదయ్ కోలా - విజయ్ శేఖర్ నిర్మించిన ఈ సినిమాకి, సునీల్ పుప్పాల దర్శకత్వం వహించాడు. ధన్య బాలకృష్ణ .. చైతన్యరావు .. తేజ ఐనంపూడి .. 'పెళ్లి ' పృథ్వీ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

కథలోకి వెళితే .. "విజయవాడలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ ఆనంద్ (తేజ) పనీ పాట అనేది లేకుండా అల్లర చిల్లరగా తిరుగుతుంటాడు. డబ్బు కోసం కష్టపడకూడదు .. సుఖాల కోసం దానిని ఖర్చు చేయాలి అనేదే అతని ఉద్దేశం. అందుకోసం  బెట్టింగులు ఆడుతుంటాడు. ఎదుటివారి బలహీనతలను పసిగట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇదంతా లేనిపోనీ శ్రమ .. బాగా డబ్బున్న అమ్మాయిని వల్లో వేసుకుంటే లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని భావించి, తనకి పరిచయస్తులు లేని హైదరాబాదుకి చేరుకుంటాడు. 

వచ్చిన రోజు నుంచే అమ్మాయిల వేట మొదలుపెడతాడు. ఆ సమయంలోనే ఆయనకి చిత్ర (ధన్య బాలకృష్ణ)తో పరిచయం ఏర్పడుతుంది. ఆరు నెలల క్రితం ఆమె భర్త అజయ్ (చైతన్యరావు) కారు ప్రమాదంలో చనిపోయాడనీ, ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుంటాడు. ఖరీదైన జీవితాన్ని గడుపుతున్న ఆమెకి, పథకం ప్రకారం చేరువవుతాడు. ఆమె దాచ్చుకున్న డబ్బుతో పాటు ఆమె భర్తకి వచ్చే ఇన్సూరెన్స్  డబ్బును కూడా కాజేసి అవతల పడాలనుకుంటాడు. 

ఈ లోగానే చిత్ర అత్తమామల దృష్టిలో ఆనంద్ పడతాడు. ఆయన చూపించే వినయం .. చెప్పే అబద్ధాలు నిజమని భావించి, చిత్ర - ఆనంద్ ల వివాహం జరిపిస్తారు. ఆయనతో చిత్ర వేరు కాపురం పెడుతుంది. ఒక రోజున చిత్ర తన సీక్రెట్ షెల్ఫ్ లో దాచుకున్న పెన్ డ్రైవ్ ఒకటి ఆనంద్ కంటపడుతుంది. దాంతో ఆయన అందులో ఏవుందో చూడటానికి ట్రై చేస్తాడు. చిత్ర భర్త అజయ్ చనిపోలేదనీ, అతణ్ణి ఆమెనే చంపించిందని తెలుసుకుని ఆనంద్ షాక్ అవుతాడు. అప్పుడు ఆనంద్ ఏం చేస్తాడు? అజయ్ ను చిత్ర ఎందుకు మర్డర్ చేయిస్తుంది? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

సాఫ్ట్ వేర్ సైడ్ కి సంబంధించి అక్రమంగా జరిగే కోట్ల రూపాయల డీల్ లో .. ఆకతాయిగా తిరిగే ఒక జల్సారాయుడు ఎలా ఇరుక్కున్నాడు? దానం పట్ల వ్యామోహం ఎలాంటి దారుణాలకు దారి తీస్తుంది? అనే ప్రధానమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పును చేయడం .. ఒకరిని అడ్డుతప్పించడం కోసం మరొకరిని వాడుకోవడం అనే సూత్రం పైనే దర్శకుడు సునీల్ పుప్పాల ఈ కథను తయారు చేసుకున్నాడు. 

కథలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. చివర్లో తప్ప ఎక్కడా ఎలాంటి అనూహ్యమైన మలుపులుగానీ, ట్విస్టులుగాని లేవు. నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. మిగతా పాత్రలు ఇలా వచ్చి కనిపించి వెళ్లిపోతుంటాయి. కథ కోసం ఎంచుకున్న లొకేషన్స్ కూడా చాలా తక్కువ. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో దర్శకుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో .. అది నీట్ గా చెప్పగలిగాడుగానీ .. ఉత్కంఠ భరితంగా చెప్పలేకపోయాడు.

బలమైన కారణంతో ధన్య - తేజ పాత్రలను కలపలేకపోయాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలు చాలా బలహీనంగా కనిపిస్తాయి. అలాగే ధన్య పాత్రను తేజ సీక్రెట్ గా ఫాలో అయ్యే సన్నివేశాన్ని మరీ సిల్లీగా చిత్రీకరించాడు. కొన్ని సన్నివేశాలను ఆసక్తికరంగా ఆవిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇక నిర్మాణ విలువల పరంగా మాట్లాడుకోవడానీకేం లేదు. చాలా తక్కువ బడ్జెట్ లోనే కానిచ్చేశారు. 

ధన్య పాత్రను .. తేజ పాత్రలను డిజై చేసిన తీరు బాగుంది. తేజ పాత్రకి రాసిన డైలాగ్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. అజయ్ అరసాడ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. రాహుల్ వీరమాచినేని ఫొటోగ్రఫీ ఫరవాలేదు.  ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉన్నట్టుగా చెప్పారు. కాకపోతే ఇది సినిమా స్థాయికి తగిన కంటెంట్ కాదు. ఏ రకంగా చూసినా ఇది వెబ్ సిరీస్ కి తగిన కంటెంట్ అనే అనిపిస్తుంది .. అలా చేసి ఉంటే బాగుండేదేమోననే అనిపిస్తుంది.

Movie Name: Jagame Maya

Release Date: 2022-12-15
Cast: Dhanya Balakrishna, Teja Ainampudi, Chaitanya Rao, Pruthvi
Director: Sunil Puppala
Music: Ajay Arasada
Banner: Xappie Studios

Jagame Maya Rating: 2.00 out of 5

Trailer

More Reviews