'ప్రేమ పిపాసి' మూవీ రివ్యూ

Prema Pipasi

Movie Name: Prema Pipasi

Release Date: 2020-03-13
Cast: G.P.S., Kapilakshi Malhotra, Sinakshi, Suman,Fun Bucket Bhargav
Director:Murali Ramaswami
Producer: RamaKrishna
Music: R.S.
Banner: S.S.Arts Productions
Rating: 1.50 out of 5
ఈ తరం అమ్మాయిల్లో చాలా మందిలో నిజమైన ప్రేమ లోపించిందని భావించిన ఓ యువకుడు, అసలైన ప్రేమకి అద్దం వంటి ఓ అమ్మాయి మనసు గెలుచుకోవాలనుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో అతను విజయాన్ని సాధిస్తాడా లేదా? అనేదే కథ. బలహీనమైన కథాకథనాలు .. బరువు తగ్గిన పాత్రలు .. ఆసక్తికరంగా లేని సన్నివేశాలతో ఈ సినిమా నిదానంగా .. నీరసంగా సాగుతుంది. 

తెలుగు తెరకి ప్రేమకథలు కొత్తకాదు. సున్నితమైన ప్రేమను సుతారంగా ఆవిష్కరించిన  ప్రేమకథలెన్నో ఇప్పటికీ మనసు తెరను తడుముతూనే ఉంటాయి. సాధారణంగా ప్రేమకథా చిత్రాలలో నాయక నాయికల చుట్టూనే కథ అంతా తిరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒకరి మనసును ఒకరు ఎలా గెలుచుకుంటారనే విషయమే ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది .. ఆ సంఘటనలు .. మలుపులే ఆ ప్రేమకథపై ఆసక్తిని రేకెత్తించేలా చేస్తుంటాయి. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రేమ పిపాసి' ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకోగలిగిందో ఇప్పుడు చూద్దాం.

కథానాయకుడు పెద్ద కొండపై నుంచి సముద్రంలోకి దూకేసి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతూ, తను ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఒక అమ్మాయని చెప్పడం మొదలుపెడుతూ ప్రేక్షకులను ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళతాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కథానాయకుడు (జీపీఎస్) ఎప్పుడు చూసినా మందుకొడుతూ ఉంటాడు. నిద్రలేస్తే తాగడం .. తాగితే పడిపోవడం .. ఈ గ్యాప్ లో అమ్మాయిలతో ముచ్చట తీర్చుకోవడం అతని దినచర్య. ఆకతాయిగా తిరుగుతూ .. అమ్మాయిల వెంటపడుతూ ఉంటాడు. తెలివిగా అమ్మాయిలను ముగ్గులోకి దింపుతూ, ఆ తరువాత వాళ్లను వదిలించుకుంటూ వెళుతుంటాడు.

ఈ నేపథ్యంలోనే అతను ఓ కోటీశ్వరుడు (సుమన్) కూతురు కీర్తిని తన వలలో వేసుకోవడానికి ప్రయత్నించి, అతని మనుషులతో తన్నులు తింటాడు. ఆ సమయంలోనే అటుగా వస్తున్న బాలా ( కపిలాక్షి మల్హోత్ర)ను చూసిన కథానాయకుడు, ఆమెను ప్రేమిస్తున్నట్టుగా చెబుతాడు. ఒక వైపున తన మనుషులతో తన్నులు తింటూనే, మరో వైపున మరో అమ్మాయికి అతను ఐ లవ్ యు చెప్పడం చూసి సుమన్ షాక్ అవుతాడు.

తన ప్రేమను అంగీకరించవలసిందేనంటూ బాలా ఇంటిముందే కథానాయకుడు తిష్ట వేస్తాడు. నిద్రాహారాలు మానేసి అక్కడే మకాం పెట్టిన కథానాయకుడిని సుమన్ చూస్తాడు. అతని ప్రేమలోని సిన్సియారిటీని గ్రహించి, అతను ఒప్పుకుంటే తన కూతురినిచ్చి పెళ్లి జరిపిస్తాననీ, తన ఆసిపాస్తులన్నింటినీ ఇచ్చేస్తానని అంటాడు. అప్పుడు కథానాయకుడు ఎలా స్పందిస్తాడు? అతను బాలా ఇంటిముందే తిష్టవేసుకుని కూర్చోవడానికి గల కారణాలేమిటి? అనేది మిగతా కథ.

దర్శకుడు మురళీ రామస్వామి 'ప్రేమ పిపాసి' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే కథ ఎక్కడా కూడా ప్రేమ దరిదాపుల్లో కనిపించదు. అంతా కామం చుట్టూనే తిరుగుతూ, కథానాయకుడి కోరికలను తీరుస్తుంటుంది. పైగా కథానాయకుడు .. అమ్మాయిల్లో నిజమైన ప్రేమలేదనే ఒక నిందను వాళ్లపై వేసేసి, ఈ కారణంగానే కోరిక తీరగానే వాళ్లను వదిలించుకుంటున్నట్టుగా తన స్నేహితుడితో చెబుతూ, తన పాత్రను సమర్ధించుకుంటూ ఉంటాడు.
 
జేబులో కండోమ్స్ ప్యాకెట్ .. చేతిలో మందు బాటిల్ పట్టుకుని తిరిగే ఈ కథానాయకుడు, ప్రేమలో నిజమైన .. నిజాయతీ కలిగిన అమ్మాయి కోసం అన్వేషిస్తున్నట్టుగా చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు కథానాయకుడికి ఎలాంటి వ్యాపకం వుండదు. తాగడం .. పడిపోవడం .. అలా బయటికొస్తే అమ్మాయిలను లైన్లో పెట్టేయడం. ప్రేమలో నిజాయతీ కలిగిన అమ్మాయి ఇంటిముందు, ఆమె ప్రేమ కోసమే ధర్నా చేస్తూ తాగుతూ .. 'నువ్వు కూడా తాగుదువుగాని రా' అని పిలవడం కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దిన తీరుకు పరాకాష్ఠగా కనిపిస్తుంది.

కథాపరంగా హీరోగారికిగానీ .. హీరోయిన్ కి గాని ఎలాంటి కుటుంబ నేపథ్యాలు లేవు. అందువలన ఆ వైపు నుంచి ఎలాంటి ఎమోషన్స్ కథలో కనిపించవు. ఇతర నాయికలతో శృంగారం సాగిస్తూ వచ్చిన కథానాయకుడు, అసలు కథానాయికతో ఐలవ్ యూ చెప్పించుకోవడానికి పడే పాట్లతోనే మిగతా కథంతా కూడా సాగిపోతుంది. కథలో ఎమోషన్ కి చోటులేదు .. కామెడీకి చోటు ఉన్నప్పటికీ పేలలేదు. పూర్తిగా రొమాన్స్ పైనే ఆధారపడిపోయి, అందుకు ఒక అందమైన కారణంగా ఫ్లాష్ బ్యాక్ తో మెప్పించే ప్రయత్నం చేశారు. చివరికి ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా విషయం లేకపోవడంతో, కథ చప్పగా సాగుతుంది.

ఈ సినిమాతోనే కథానాయకుడిగా పరిచయమైన జీపీఎస్, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. లుక్ పరంగా అతను హీరోగా అనిపించలేదు. ఇక హీరోయిన్ గానీ .. ఇతర నాయికల పాత్రలలో కనిపించిన వారుగాని చేసిందేమీ లేదు. హీరోగా .. విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా సుమన్ కి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అంతటి ఆర్టిస్ట్ ఇలాంటి విషయం లేని పాత్రలను ఇకపై ఒప్పుకోకుండా వుంటే బాగుంటుంది.  

ఈ సినిమాకి ఆర్.ఎస్. అందించిన సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. 'ప్రియతమా .. ప్రియతమా' అనే బాణీ మాత్రం ఆకట్టుకుంటుంది. రీ రికార్డింగ్ కూడా కథకి తగినట్టుగానే సాగింది. తిరుమల కెమెరా పనితనం ఫరవాలేదు. ఎస్.జె. శివ కిరణ్ ఎడిటింగ్ అంతంత మాత్రంగా అనిపిస్తుంది. కోమలి పాత్ర ఆటోవాలతోను .. బట్టల షాపులో సేల్స్ మెన్ తోను గొడవపడే సీన్స్ .. కమెడియన్ లవ్ ట్రాక్ .. హీరోయిన్ ని పడగొట్టడానికి హీరో కవిత్వం చెప్పే సీన్స్ ను లేపెయ్యచ్చు. ఇక కాలేజ్ నేపథ్యంతో నడిచే ఎపిసోడ్ ను ట్రిమ్ చేయవలసింది.      
     
కథ ఆరంభంలోని సన్నివేశాలే కథాబలాన్ని చాటిచెప్పేస్తాయి. అలాగే హీరో ఇంట్రడక్షన్ సీన్ తోనే అతనిపై సదభిప్రాయం కలగకుండా చేస్తుంది. ఇక కొంతమంది ఆర్టిస్టుల మేకప్ .. హెయిర్ స్టైల్ పై కూడా శ్రద్ధ పెట్టలేదు. కమెడియన్ పాత్రకి సంబంధించి డబ్బింగులో అక్కడక్కడా లిప్ సింక్ కాలేదు. చేతిలో మందు బాటిల్ లేకుండా తెరపై హీరో కనిపించిన సందర్భాలు తక్కువ. లిప్ లాక్ సీన్స్ కి కొదవలేదు .. సిటీ బస్సులో కూడా లిప్ లాకులు పెట్టించేశాడు.
పూర్తిగా నిరాశపరిచే కథాకథనాల వలన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఏ పనీ లేకుండా ప్రేమ పేరుతో కాలక్షేపం చేసే కథానాయకుడికి, ఒక కోటీశ్వరుడు తన కూతురుతో పాటు యావదాస్తిని ఇవ్వడానికి సిద్దపడటం విచిత్రం!

More Reviews