'తోలుబొమ్మలాట' మూవీ రివ్యూ

23-11-2019 Sat 16:36
Movie Name: Tholu Bommalata
Release Date: 2019-11-22
Cast: Rajendra Prasad, Vishwant, Harshitha Chowdary, Sangeetha, Narayana Rao, Vennela Kishore,Dhan Raj
Director: Vishvanath Maganti 
Producer: Durga Prasad Maganti 
Music: Suresh Bobbili
Banner: Suma Durga Creations

జీవితానికి అందాన్నిచ్చేది .. జీవితానికో అర్థాన్నిచ్చేవి బంధాలు - అనుబంధాలేనని నమ్మే వ్యక్తి సోమరాజు. తన కుటుంబ సభ్యులంతా సఖ్యతగా ఉన్నారని భావించిన ఆయనకి, అందులో నిజంలేదనే విషయం తన మరణం తరువాత తెలుస్తుంది. ఆత్మగా వున్న ఆయన, వాళ్లలో మార్పు తీసుకురావడం కోసం ఏం చేశాడనేదే కథ. మూడు తరాలకి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి సాగే ఈ కథ ఫరవాలేదనిపిస్తుంది.

కుటుంబం .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో సాగే కథా చిత్రాల ద్వారా మనసులను గెలుచుకోవడం రాజేంద్రప్రసాద్ కి కొత్తేమీ కాదు. గతంలో ఆయన చేసిన 'ఆ నలుగురు' సినిమాను ఇప్పటికీ చాలా మంది మరిచిపోలేదు. ఆ సినిమాలో మాదిరిగానే కొంత కథ తరువాత ఈ సినిమాలోను రాజేంద్రప్రసాద్ ఆత్మగా కనిపిస్తాడు. కాకపోతే యూత్ ను కూడా టచ్ చేస్తూ కథ కొత్త కోణంలో ఆవిష్కరించబడుతుంది. అలాంటి ఈ కథ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం.

'అచ్యుతాపురం' అనే గ్రామంలో 'సోమరాజు'(రాజేంద్రప్రసాద్) ఒక రైస్ మిల్లు నడుపుతుంటాడు. చిన్ననాటి స్నేహితుడు చంద్రం (నారాయణరావు) ఆ మిల్లు వ్యవహారాలు చూస్తుంటాడు. సోమరాజు కొడుకు మురళి( దేవీప్రసాద్) కూతురు జానకి (కల్పన) .. అల్లుడు శివాజీ (నర్రా శ్రీనివాస్) అంతా హైదరాబాదులో వుంటారు. కాకపోతే వాళ్ల మధ్య మనస్పర్థలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మురళి కొడుకు రిషి (విశ్వంత్) శివాజీ కూతురు వర్ష (హర్షిత) ప్రేమించుకుంటారు. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. తమ పెద్దల మధ్య సఖ్యత లేకపోవడం వలన, వాళ్లని ఒప్పించమంటూ తాత సోమరాజును కోరతారు.

కొడుకునీ కోడలిని .. కూతురిని అల్లుడిని సోమరాజు పిలిపించి రిషి - వర్ష పెళ్లి గురించి ప్రస్తావిస్తాడు. అందుకు వాళ్లు అంగీకరించడంతో ఆనందిస్తాడు. అదే రోజు రాత్రి నిద్రలోనే ఆయన చనిపోతాడు. దాంతో కొడుకు - అల్లుడు మధ్య ఆస్తిపరమైన గొడవలు మొదలవుతాయి. రిషి - వర్ష మధ్య కూడా మనస్పర్థలు తలెత్తుతాయి. అదే సమయంలో శివాజీ అక్కకొడుకైన సంతోశ్ (వెన్నెల కిషోర్) ఆ ఇంట్లోకి అడుగుపెడతాడు. ఆయనకి ఆత్మలు కనిపిస్తాయి .. మాట్లాడతాయి. ఆత్మగా మారిన సోమరాజు తన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను చిగురింపజేయడం కోసం, సంతోశ్ తో కలిసి ఏం చేశాడనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు విశ్వనాథ్ మాగంటికి ఇది తొలి సినిమా. రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ ఆర్టిస్టును ప్రధాన పాత్రధారిగా చేసుకుని, ఒక వైపున కామెడీని .. మరోవైపున ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేయడం అంత తేలికైన పనేం కాదు. అయినా మూడు తరాల కుటుంబ సభ్యులకి చెందిన ఈ కథను ప్రేక్షకుల మనసులకు కనెక్ట్ చేయడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేశాడు. ఉమ్మడి కుటుంబం నుంచి హీరోను .. హీరోయిన్ ను తీసుకుని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను .. అటు యూత్ ను ఆకట్టుకునేందుకు కృషి చేశాడు. ఈ విషయంలో ఆయన కొంతవరకూ సక్సెస్ అయ్యాడు.

అయితే ఆర్థికపరమైన కారణాల వలన బంధాలను తెంచేసుకోవడం .. ఆస్తులు కలిసొస్తాయనేసరికి కలిసిపోవడానికి ట్రై చేయడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే 'మీ స్వార్థాన్నీ .. ద్వేషాన్ని మా ప్రేమకి అంటనీయకండి. మా పెళ్లి చేయాలనే మా తాతయ్య కలను నిజం చేయనీయండి' అంటూ హీరో హీరోయిన్ ముందుకు రావడం ఈ కథలోని కొత్త కోణంగా దర్శకుడు ఆవిష్కరించాడు. ఇటు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లోను .. అటు ఆత్మగా మారిన సోమరాజుతోను వెన్నెల కిషోర్ పాత్రను లింక్ చేసిన విధానం బాగుంది. ఈ రెండు ట్రాకులలోను వెన్నెల కిషోర్ ఎంట్రీతోనే 'బోర్' బోర్డు మాయమవుతుంది.

సోమరాజు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గొప్పగా చేశాడు. ఈ తరహా పాత్రలు ఆయనకి కొట్టిన పిండి. వ్యక్తిగా వున్నప్పటి ఆనందాలు .. ఆత్మగా మారిన తరువాత తొలగిన భ్రమలు .. అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయతగల ఈ పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. 'భగవంతుడు అయిదు నిమిషాలపాటు బతకడానికి అవకాశమిస్తే, కన్నీళ్లు కనిపించేలా ఏడవాలని వుంది' అంటూ ఆత్మగా ఆయన చెప్పే డైలాగ్ ఈ సినిమాకి హైలైట్. ఇక రాజేంద్రప్రసాద్ తరువాత స్క్రీన్ పై ఒక రేంజ్ లో సందడి చేసింది వెన్నెల కిషోరే. వర్షను ప్రేమించే బావగా .. సోమరాజు ఆశలను నెరవేర్చే మనవడిగా ఆయన నవ్వులు పూయించాడు. ఇక విశ్వంత్ .. హర్షిత .. సంగీత .. ధన్ రాజ్ .. కల్పన పాత్ర పరిధిలో నటించారు.

సురేశ్ బొబ్బిలి సంగీతం ఆకట్టుకునేలా వుంది. ఫస్టాఫ్ లో వచ్చే 'ఓహోహో ఆకాశమా' .. 'ఎన్నెనో ఆనందాలు' .. సెకండాఫ్ లో వచ్చే 'గొప్పదిరా మనిషి పుట్టుక' పాటలు బాగున్నాయి. రీ రికార్డింగ్ సందర్భానికి తగినట్టుగా సాగింది. సతీశ్ ముత్యాల కెమెరా పనితనం బాగుంది. దృశ్య సంబంధమైన .. భావ సంబంధమైన సన్నివేశాలను సహజంగా ఆవిష్కరించాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కి వంకబెట్టవలసిన పనిలేదు. కాకపోతే రాజేంద్రప్రసాద్ లవ్ స్టోరీ ఎపిసోడ్ అంత అవసరమైనదిగా అనిపించదు.

కుటుంబం అంటే నాలుగు గోడలు .. పైకప్పు కాదు. మనసులు కలిసిన మనుషులకి నిలయమైనదనీ, కుటుంబ సభ్యులంతా సఖ్యతగా వున్నప్పుడే పెద్దల ఆత్మలు సంతోషిస్తాయని చాటిచెప్పే కథ ఇది. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ కథతో దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. అయితే ఆ కథను నడిపించిన తీరు మరీ నిదానమై, ప్రేక్షకులు జారిపోయే సందర్భాలు ఏర్పడ్డాయి. టైట్ స్క్రీన్ ప్లే .. లోతైన ఎమోషన్స్ లేని కారణంగా ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుందంతే.    More Articles
Advertisement
Telugu News
natyam movie first look releases
'నాట్యం' సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన ఉపాస‌న‌
20 minutes ago
hero heroin get emotion
‘సూపర్‌ ఓవర్‌’ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో హీరో, హీరోయిన్ల క‌న్నీరు!
1 hour ago
sohel goes chiru home
మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లిన బిగ్‌బాస్ ఫేం సోహెల్... ఫొటోలు వైర‌ల్
2 hours ago
I have a deal with Siva Karthikayan says Rakul Preet Singh
శివ కార్తికేయన్ తో ఒక డీల్ కుదుర్చుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్
2 hours ago
Chiranjeevi confirms film with Bobby
మరో సినిమాను ఖరారు చేసిన మెగాస్టార్!
3 hours ago
Actress Sri Sudha again complaint against shyam k naidu
సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడిపై సినీ నటి శ్రీసుధ మరోమారు ఫిర్యాదు
5 hours ago
Samanta learning horse riding for her next movie
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
6 hours ago
Boyapati to direct Tamil hero Surya
సూర్య తెలుగు సినిమా.. బోయపాటి డైరెక్షన్?
20 hours ago
mahesh wishes namrata
నేను ప్రేమించిన అమ్మాయి ఈ రోజే జన్మించింది: మ‌హేశ్ బాబు
1 day ago
Kajal Aggarwal to pair with Prabhu Deva
ప్రభుదేవా, కాజల్ జంటగా రొమాంటిక్ కామెడీ సినిమా!
1 day ago