'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీ రివ్యూ

Agent Sai Srinivasa Athreya

Movie Name: Agent Sai Srinivasa Athreya

Release Date: 2019-06-21
Cast: Polishetty Naveen,Sruthi Sharma
Director:Swaroop Raj
Producer: Rahul Yadav Nakka
Music: Mark K Robin
Banner: Swadharm Entertaiment
Rating: 3.00 out of 5
చిన్నా చితకా కేసులను పరిష్కరించే డిటెక్టివ్ ఆత్రేయ, ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అది తనకు అనుకున్నంత తేలికైన కేసు కాదనే విషయం తెలిసినా ధైర్యంగా ముందడుగు వేసి, ఎలా ఆ రహస్యాన్ని ఛేదించాడనేదే కథ. యూత్ నుంచి .. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేయడం ఖాయం

హఠాత్తుగా ఒక మర్డర్ జరిగిపోవడం .. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ రంగంలోకి దిగిపోవడం వంటి కథలు తెలుగు తెరను అడపా దడపా పలకరిస్తూనే వస్తున్నాయి. ఈ జోనర్లో వచ్చిన కథలు కొన్ని తేలికపాటి కథనంతో తేలిపోతే, మరొకొన్ని కథలు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మంచి వసూళ్లను రాబట్టాయి. ఆ తరహా డిటెక్టివ్ స్టోరీతో కొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'. మరి ఈ డిటెక్టివ్ ఏ విషయంపై తన పరిశోధన మొదలుపెట్టాడో .. అందులో ఎంతవరకూ సక్సెస్ అయ్యాడో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) నెల్లూరులో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకుని ప్రైవేటు డిటెక్టివ్ గా పనిచేస్తుంటాడు. ఆయన అసిస్టెంట్ గా స్నేహ (శృతి శర్మ) ఉంటుంది. ఆత్రేయకి అటు కేసులు .. ఇటు ఇన్ కమ్ రెండూ లేకపోయినా, బయటికి మాత్రం బాగానే బిల్డప్ ఇస్తుంటాడు. అలాంటి ఆత్రేయ కూతురిని పోగొట్టుకున్న ఒక తండ్రి కన్నీళ్లకు కరిగిపోయి, ఆమె హత్యకు కారకులైన ఇద్దరు వ్యక్తులను పట్టుకోవాలనుకుంటాడు.

అయితే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా దారుణంగా హత్య చేయబడటంతో అయోమయంలో పడిపోతాడు. ఆ రెండు హత్యలకు తనే కారకుడనంటూ సాక్ష్యాలు పుట్టుకురావడంతో బిత్తరపోతాడు. ఇప్పుడు ఆయన ముందున్న సమస్య .. తను ఈ కేసులో నుంచి బయటపడటం, అసలు హంతకులు ఎవరన్నది కనిపెట్టడం. అందుకోసం ఆత్రేయ ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనే అనూహ్యమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

యథార్థ సంఘటనల ఆధారంగా అంటూ దర్శకుడు స్వరూప్ రాజ్ ఒక కొత్త పాయింట్ తో కథను అల్లుకున్నాడు. ఆరంభంలో ఆత్రేయ పాత్రను కాస్త కామెడీగా చూపించినా, ఆ తరువాత ఆత్రేయ ఇన్వెస్టిగేషన్ లో ఆయనలోని డిటెక్టివ్ ను పూర్తిస్థాయిలో ఆవిష్కరిస్తూ, ప్రేక్షకులు ఆయనను ఫాలో అయ్యేలా చేశాడు. ఆత్రేయ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో కథను మరింత లోతుకు తీసుకెళుతూ, ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేశాడు.

అయితే హీరోయిన్ నే హీరోకి అసిస్టెంట్ గా ఫిక్స్ చేయడం దర్శకుడు చేసిన ఒక పొరపాటుగా అనిపిస్తుంది. లవ్ అంటూ వాళ్ల మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడంతో, డ్యూయెట్లకు అవకాశం లేకుండా చేసింది. మొదట్లో తప్ప ఆ తరువాత కామెడీకి చోటు ఇవ్వకపోవడం కూడా ఆడియన్స్ కి కాస్త అసంతృప్తిని కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా క్లైమాక్స్ ను డిజైన్ చేసే విషయంలో ఆయన మరింత శ్రద్ధ తీసుకుని వుంటే బాగుండేది.

దర్శకుడు స్వరూప్ రాజ్ తరువాత ఎక్కువ మార్కులు స్క్రీన్ ప్లేను సమకూర్చిన సన్నీ కూరపాటికి దక్కుతాయి. ముఖ్యమైన పాత్రలు కొన్నే ఉన్నప్పటికీ ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఆయన తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. ఏ మర్డర్ కేసునైతే ఆత్రేయ డీల్ చేస్తున్నాడో .. అదే మర్డర్ కేసులో ఆయన ఇరుక్కునే సన్నివేశాలను సన్నీ కూరపాటి ఆసక్తికరంగా అల్లుకున్నాడు. హత్యా నేరంలో ఆత్రేయ ఇరుక్కోవడమనే ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి స్క్రీన్ ప్లేను మరింత టైట్ చేస్తూ వెళ్లినతీరు ఆకట్టుకుంటుంది.
     
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'గా డిటెక్టివ్ పాత్రలో నవీన్ పోలిశెట్టి బాగా చేశాడు. ఆరంభంలో కామెడీని పండించిన నవీన్, ఆ తరువాత అంతే సీరియస్ గా తన పాత్రలో డిఫరెంట్ షేడ్ ను చూపించాడు. తల్లి చనిపోయిందని తెలిసినప్పుడు, ఆ తల్లి శవం ఏమై వుంటుందో గ్రహించినప్పుడు ఎమోషన్ ను కూడా బాగా పండించాడు. కథ లోతుకు వెళుతున్నా కొద్దీ అందుకు తగినట్టుగా పాత్రలో ఇన్వాల్వ్ అవుతూ వెళ్లాడు. ఇక కథానాయిక శృతి శర్మకి తెలుగులో ఇదే మొదటి సినిమా. అయినా ఎక్కడా ఆ కొత్తదనం కనిపించనీయకుండా తనకి ఇచ్చిన పాత్రను నీట్ గా గా చేసింది. విశాలమైన .. ఆకర్షణీయమైన ఆమె కళ్లు కుర్రకారు మనసులను దోచేయడం ఖాయమనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రధారులంతా కొత్తవాళ్లే .. వాళ్లు పోషించిన పాత్రలు కూడా నామమాత్రమైనవే.

కథా కథనాల తరువాత ఈ సినిమాను నిలబెట్టింది రీ రికార్డింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా అజయ్ ను ఆత్రేయ, హర్షను స్నేహ రహస్యంగా అనుసరించే సన్నివేశాలకి ఆర్.ఆర్ బాగా కుదిరింది. ఫొటోగ్రఫీ ఫరవాలేదనిపించేదిగా వుంది. ఎడిటింగ్ విషయానికొస్తే ప్రీ క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాలను వివరంగా చూపించాలనుకోవడం వలన నిడివి పెరిగి కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. అక్కడ కాస్త కత్తెరకి పని చెప్పి వుంటే బాగుండుననిపిస్తుంది. మొత్తంగా చూస్తే తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పేయడంలో దర్శకుడు చాలావరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అలరించే పాటలకు .. ఆకట్టుకునే వినోదానికి కాస్తంత దూరంగా వెళ్లడం వలన, చెప్పుకోదగిన ఆర్టిస్టులు ఎవరూ  లేకపోవడం వలన ఈ సినిమా ఒక మెట్టుదిగి ఫరవాలేదనిపించుకుంటుంది.

More Reviews