'చాణక్య' మూవీ రివ్యూ

06-10-2019 Sun 18:01
Movie Name: Chanakya
Release Date: 2019-10-05
Cast: Gopichand, Mehreen, Zareen Khan, Rajesh Khattar, Arun Kumar
Director: Thiru
Producer: Rama Brahmam Sunkara
Music: Vishal Chandrasekhar
Banner: AK Entertainments

'రా' సంస్థలో గోపీచంద్ తో పాటు ఆయన నలుగురు స్నేహితులు ఒక టీమ్ గా పనిచేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో గోపీచంద్ మినహా ఆయన నలుగురు స్నేహితులను, పాకిస్థాన్ లోని భారత వ్యతిరేక శక్తి కిడ్నాప్ చేస్తుంది. దాంతో తన ప్రాణాలకి తెగించి మరీ వాళ్లను ఇండియా తీసుకురావడానికి హీరో 'కరాచీ' లో అడుగుపెడతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఎలాంటి పరిస్థితులను ఆయన ఎదుర్కోవలసి వస్తుందనేది ఈ కథ. అనూహ్యమైన మలుపులు .. ఆసక్తికరమైన సంఘటనలు ఎంతమాత్రం లేని ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే!

తెలుగులో యాక్షన్ సినిమాలు అనగానే గోపీచంద్ పేరు గుర్తొస్తుంది. యాక్షన్ సినిమాలతో పాటు ఆయన కామెడీకి .. ఎమోషన్ కి కూడా సమానమైన ప్రాధాన్యతనిస్తుంటాడు. కొంతకాలంగా ఆయనను సక్సెస్ లు పలకరించలేదు. వరుస పరాజయాలు అభిమానులను డీలా పడేస్తున్నాయి. దాంతో కథల ఎంపిక విషయంలో ఆయన మరింత శ్రద్ధ తీసుకుని, 'చాణక్య' చేశాడు. 'తిరు' దర్శకత్వం వహించిన ఈ సినిమా, తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచి పోతుందనే ఉద్దేశంతో ఆయన ఈ సినిమా చేశాడు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

అర్జున్ 'రా' ఏజెంటుగా పనిచేస్తుంటాడు. సంస్థ తనకి అప్పగించిన పనిని సీక్రెట్ గా చేయడం కోసం, రామకృష్ణ అనే పేరుతో పరిచయం చేసుకుంటూ బ్యాంకు ఉద్యోగిగా సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ సమయంలోనే ఆయనకి ఐశ్వర్య( మెహ్రీన్) పరిచయమవుతుంది. చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన రామకృష్ణ,  తల్లిని పోగొట్టుకుని .. తండ్రి ప్రేమను పూర్తిగా పొందలేని ఐశ్వర్య ఒకరిపై ఒకరు మనసు పడతారు. 

 ఈ నేపథ్యంలోనే గోపీచంద్ టీమ్ లోని నలుగురు సభ్యులను పాకిస్థాన్ కి చెందిన ప్రతినాయకుడు కిడ్నాప్ చేస్తాడు. దమ్ముంటే 'కరాచీ' వచ్చి వాళ్లను ప్రాణాలతో తీసుకెళ్లమని సవాల్ విసురుతాడు. అలాంటి పరిస్థితుల్లోనే రామకృష్ణ అసలు పేరు అర్జున్ అనీ, ఆయన 'రా'లో  పనిచేస్తూ ఉంటాడనే విషయం తెలిసి ఐశ్వర్య భయపడిపోతుంది. ఆ తరువాత ఐశ్వర్య ఏం చేస్తుంది?  ప్రాణాలకి తెగించి కరాచీలో అడుగుపెట్టిన గోపీచంద్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

యాక్షన్ సినిమాలకి గోపీచంద్ కరెక్ట్ గా సెట్ అవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో 'రా' ఏజెంట్ గా ఆయనను ఎంచుకోవడంలో దర్శకుడు 'తిరు' సరైన నిర్ణయమే తీసుకున్నాడు.  తొలి యాక్షన్ ఎపిసోడ్ నుంచి మిగతా యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఆయన చాలా పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నాడు. అయితే కథాకథనాలను ఆయన పట్టుగా .. పకడ్బందీగా  సిద్ధం చేసుకోలేదు.  అలాగే గోపీచంద్ పోషించిన రామకృష్ణ - అర్జున్ పాత్రలలోని వైవిధ్యాన్ని  కూడా 'తిరు ' ఆవిష్కరించలేకపోయాడు. ఇక గోపీచంద్ తో ఫస్టాఫ్ లో మెహ్రీన్ .. సెకండాఫ్ లో జరీన్  ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ, వాళ్ల కాంబినేషన్లో గుర్తుంచుకోదగిన సీన్ ఒక్కటీ కనిపించదు. 

ఇక ప్రధానమైన ప్రతినాయకుడిగా చేసిన రాజేశ్ ఖట్టర్ లుక్ ఎంతమాత్రం బాగోలేదు. ఆయనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేయలేకపోవడం వలన, ఆయన పాత్ర ఎలాంటి కొత్తదనం లేకుండా తేలిపోయింది. ఇక యంగ్ విలన్ గా ఆయన కొడుకు పాత్ర పరిస్థితి కొంతలో కొంత ఫరవాలేదు. ఇక హీరో .. హీరోయిన్స్ కి పేరెంట్స్ లేరు గనుక వాళ్ల గొడవలేదు. సీరియస్ యాక్షన్ గా సాగే ఈ కథలో సునీల్ .. అలీ పాత్రల ద్వారా కామెడీని కలపడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ఎంతమాత్రం ఫలించలేదు. ముఖ్యంగా అలీ కామెడీలో డబుల్ మీనింగ్ డైలాగులు చోటుచేసుకున్నాయి.  ప్రభుత్వం  తరఫున ఈ సినిమాలో ఒక పెద్దాయన పాత్ర కనిపిస్తుంది. ఆయన ఎవరో .. ఏ పదవిలో వున్నాడో ఎవరికీ అర్థం కాదు. ఎంటర్టైన్ మెంట్ పాళ్లు .. ఎమోషన్ పాళ్లు తగ్గడం వలన ఈ సినిమా గోపీచంద్ అభిమానులను నిరాశ పరుస్తుందనే అనుకోవాలి. 
 
  ఈ సినిమాలో రామకృష్ణ - అర్జున్ అనే రెండు లుక్స్ తో గోపీచంద్ కనిపిస్తాడు.  'రా ' ఏజెంట్ అనే పాత్ర ఆయనకి  కొత్త కావొచ్చును గానీ , యాక్షన్ తాలూకు కథలో మాత్రం పెద్దగా కొత్తదనం లేదు. ఎప్పుడూ ఆయన కథలకి బలానిచ్చే ఎమోషన్ .. కామెడీ లేకపోవడం ఈ సినిమాలోని ప్రధాన లోపం అనుకోవాలి.  ఇక కథానాయికగా మెహ్రీన్ చాలా అందంగా కనిపించింది. అలాగని చెప్పేసి ఆమెతో రొమాంటిక్ సీన్స్ కూడా రాసుకోలేదు. ఇక జరీన్ ఖాన్ ఉందంటే వుంది అనిపించింది. ప్రధాన ప్రతినాయకుడైన రాజేశ్ ఖట్టర్ చేయడానికి ఏమీలేదు. ఆయన కొడుకుగా చేసిన కొత్త విలన్ మాత్రం కొంత హడావిడి చేశాడు. ఇక 'రా'కి సంబంధించిన పై అధికారిగా నాజర్ తనదైన శైలిలో మెప్పించాడు.

బాణీల పరంగా చూసుకుంటే విశాల్ చంద్రశేఖర్ అందించిన రెండు పాటలు బాగున్నాయి. అయితే గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కి .. ఆయన ఏజ్  గ్రూప్ కి ఇవి తగిన పాటలు కాదనిపిస్తుంది. రీ రికార్డింగ్ ఫరవాలేదు .. వెట్రిపళని సామి ఫొటోగ్రఫీ కూడా ఫరవాలేదు.  'ఓ మై లవ్' పాటలోని లొకేషన్స్ ను చాలా అందంగా తన కెమెరాలో బంధించాడు. ఇక ఎడిటింగ్ పనితీరు కూడా అంతంత మాత్రమే.  ఎలాంటి కొత్తదనం లేని ఈ సినిమాను గోపీచంద్ ఎందుకు అంగీకరించాడో .. ఎలా అంగీకరించాడో అర్థం కాదు. రెండు .. మూడు యాక్షన్ ఎపిసోడ్స్ మినహా, కథలో ఎలాంటి మలుపులు లేవు. వున్న ట్విస్టులు నాటకీయంగా అనిపిస్తాయి. లోతైన సంభాషణలు ఎక్కడా వినిపించవు.  వినోదానికి చాలా దూరంగా రూపొందిన ఈ సినిమా, గోపీచంద్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి  కూడా ఒక మాదిరిగా అనిపించడం కష్టమేనేమో!      
More Articles
Advertisement
Telugu News
Anupama Parameshvarans short film gets good response
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
2 minutes ago
Prabhas Salar shoot in Singareni open cost area
సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'!
10 hours ago
Govt Green signal to increase seating capacity in theaters
థియేటర్లలో సీటింగ్ సామర్థ్యం పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
10 hours ago
Bony Kapoor fires on RRR team
'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ రగడ.. కస్సుమన్న బోనీకపూర్!
15 hours ago
Keerti Suresh to act in her fathers film
వాళ్ల నాన్న నిర్మిస్తున్న సినిమాలో కీర్తి సురేశ్!
18 hours ago
Samantha Best Memory in 2020
2020 బెస్ట్ మెమొరీ ఏంటని ప్రశ్నించగా... ఫోటో చూపించిన సమంత!
21 hours ago
Koratala Announces Acharya Teaser Date and Time
మెగా ఫ్యాన్స్ సస్పెన్స్ కు తెరదించిన కొరటాల శివ... టీజర్ విడుదల తేదీ ప్రకటన!
21 hours ago
Shruti Hassan opposite Prabhas in Salaar
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
1 day ago
Vaishnav Tej Uppena film release date confirmed
తాజా మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' రిలీజ్ డేట్
1 day ago