'ఆమె' మూవీ రివ్యూ

Aame

Movie Name: Aame

Release Date: 2019-07-19
Cast: Amala paul, Sri Ranjani, Ramya Subramanian, Vivek Prasanna
Director:Rathna Kumar
Producer: Rambabu, Vijay
Music: Pradeep Kumar
Banner: S.K. Studios
Rating: 1.25 out of 5
'ఆమె' అనే టైటిల్ కి తగినట్టుగానే ఆమె పాత్రను గురించి మాత్రమే దర్శకుడు ఆలోచన చేశాడు. మిగతా పాత్రలు తేలిపోయాయి .. ఆమె పాత్ర అంత బలంగానూ నాటుకోలేకపోయింది. ఇంకా తరువాత తరువాత ఏదో జరుగుతుందని ఆశించిన ప్రేక్షకుడికి అసంతృప్తి కలుగుతుంది .. అసహనమే మిగులుతుంది.

తెలుగులో నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ అనుష్క, సమంత తమ సత్తా చాటుతున్నారు. ఇక తమిళంలో ఈ తరహా సినిమాలు చేస్తూ నయనతార, త్రిష ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. సీనియర్ హీరోయిన్ గా ఈ రెండు భాషల్లోను మంచి గుర్తింపు వున్న అమలా పాల్ కూడా నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాల దిశగా అడుగులు వేస్తూ, తమిళంలో 'ఆడై' అనే సినిమా చేసింది. తెలుగులో ఈ సినిమా 'ఆమె' పేరుతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకున్న అమలాపాల్, చివరికంటా దానిని సక్సెస్ ఫుల్ గా మోయగలిగిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
 
కథలోకి తొంగి చూస్తే .. కామిని(అమలా పాల్) ఒక టీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంటుంది. ఫ్రాంక్ వీడియోస్ తరహా కాన్సెప్టుతో ఆమె చేసే ప్రోగ్రామ్ కి మంచి పేరు వస్తుంది. పద్ధతి అనే మాటకి కాస్త దూరంగా పెరిగిన 'కామిని'కి పందెం కాయడం, ఆ పందెంలో గెలవడం కోసం ఏమైనా చేయడం అలవాటు. ఆ రోజున ఆమె పుట్టినరోజు కావడంతో, పాత ఆఫీస్ బిల్డింగ్ లో ఆ రాత్రి తన టీమ్ తో కలిసి పార్టీ చేసుకుంటుంది. జెన్నీఫర్ అనే న్యూస్ రీడర్ తో మాటా మాట పెరగడంతో, ఆ రాత్రంతా తను ఆ బిల్డింగ్ లో నగ్నంగా .. ఒంటరిగా ఉంటానంటూ పందెం కాస్తుంది. తాగిన మత్తులో పడిపోయిన ఆమెకి ఉదయాన్నే మెలకువ వస్తుంది. తను నగ్నంగా ఉండటం చూసుకుని ఉలిక్కి పడుతుంది. తన ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారో తెలియక అయోమయానికి లోనవుతుంది. పరువు పోకుండా అక్కడి నుంచి బయటపడటానికి ఆమె చేసే ప్రయత్నాలు .. ఎదురైన సంఘటనలతో కథ ముందుకెళుతుంది.

ఫ్రాంక్ వీడియోస్ కి అలవాటు పడిపోయిన జనాలు, నిజంగానే ఆపదలో వున్నవారిని ఆదుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఈ తరహా కాన్సెప్టు వినోదాన్ని పంచే విషయం అటుంచితే, చాలామంది విలువైన సమయాన్ని వృథా చేస్తోంది అనే సందేశం ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అందువల్లనే ఫ్రాంక్ వీడియో షూటింగుతోనే కథను ఎత్తుకున్నాడు. అలాగే దూకుడుగా వెళ్లే అమ్మాయిలు ఎలాంటి చిక్కుల్లో పడతారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే బలమైన కథాకథనాలు సిద్ధం చేసుకోకపోవడం వలన .. ఆసక్తికరమైన సన్నివేశాలను అల్లుకోకపోవడం వలన ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. సెకండాఫ్ లో ఒక పాయింట్ అనుకుని, ఆ దిశగా ఫస్టాఫ్ ను లాగుతూ వచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే పడిందనుకున్న ప్రేక్షకులకు, ఒకటి రెండు మినహా ఆ తరువాత సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. రీ రికార్డింగ్ ఫరవాలేదనిపిస్తే, సంగీతం .. ఫొటోగ్రఫీ కూడా ఓ మాదిరిగానే అనిపిస్తాయి.

టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమా కథ అంతా కూడా అమలా పాల్ చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో ఆమె నగ్నంగా కనిపించడానికి సైతం సిద్ధపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే సినిమా చూసిన తరువాత, విషయం లేని కథ కోసం .. బలమైనది కానీ సందర్భం కోసం ఆమె ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది. నటన పరంగా చూసుకుంటే, ఒక బిల్డింగ్ లో నగ్నంగా వుండిపోయిన ఆమె .. పరువుగా బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆమె పలికించిన హావభావాలు సహజంగా వున్నాయి. తనలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే కళ్లతోనే ఆమె చకచకా ఎక్స్ ప్రెషన్స్ ను మార్చేస్తూ మార్కులు కొట్టేసింది.

ఈ సినిమాలో అమలా పాల్ తరువాత, ఆమె తల్లి పాత్రను పోషించిన శ్రీరంజని మినహా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ముఖం ఒక్కటీ కనిపించదు. ఒక్క ప్రధాన పాత్ర చుట్టూనే కథను అల్లేసుకుని, అంతగా గుర్తింపు లేని  మిగతా ఆర్టిస్టులతో ఈ కథను నడిపించాలనుకోవడం దర్శకుడు చేసిన ధైర్యమనే చెప్పుకోవాలి. హీరోయిన్ కి ఒక జోడీ లేకపోవడం .. అసలు పాటలే లేకపోవడం .. కామెడీపై కూడా దృష్టి పెట్టకపోవడం సాధారణ ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తాయి. అవి కథకు అడ్డుతగులుతాయనుకుంటే, కథ అంత పట్టుగా నడిచిందీ లేదు. పోస్టర్స్ చూసి .. కథలో ఏదో బలమైన విషయం ఉండకపోతే అమలా పాల్ అలా కనిపించడానికి అంగీకరించదు కదా అనుకుని థియేటర్ కి వెళ్లిన వాళ్లు, అసంతృప్తితో .. అసహనంతో తిరిగిరాకుండా ఉండటం కష్టమేననిపిస్తుంది.

More Reviews