'ఇస్మార్ట్ శంకర్' మూవీ రివ్యూ

Ismart Shankar

Movie Name: Ismart Shankar

Release Date: 2019-07-18
Cast: Ram, Nidhi Agarwal, Nabha Natesh,Tulasi,Sathya Dev, Ashish Vidyarthi
Director:Puri Jagannadh
Producer: Puri Jagannadh
Music: Mani Sharma
Banner: Puri Jagannadh Touring Talkies
Rating: 2.50 out of 5
ఒక రౌడీ షీటర్ దగ్గర పెరిగిన అనాథ కుర్రాడే 'ఇస్మార్ట్ శంకర్'. అనాధ అయిన శంకర్, చాందిని ప్రేమలో పడి అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. ఆమెతో హాయిగా గడపడానికి అవసరమైన డబ్బుకోసం శంకర్ ఒక మర్డర్ చేస్తాడు. ఫలితంగా ఆయన జీవితం తలక్రిందులు అవుతుంది. పూరి మార్క్ సంభాషణలతో .. రొమాన్స్ తో .. చేజింగ్స్ తో సాగిపోయే ఈ కథ మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చచ్చు!

తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి మంచి పేరుంది. గతంలో ఎన్టీఆర్ .. రవితేజ వంటి మాస్ హీరోలతో మాస్ చిత్రాలను తెరకెక్కించి సంచలన విజయాలను అందుకున్న పూరి, ఈ సారి చాక్లెట్ బాయ్ రామ్ తో మాస్ మసాలా మూవీగా 'ఇస్మార్ట్ శంకర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. రామ్ ను పూర్తి మాస్ హీరోగా మార్చేసి తనదైన స్టైల్లో పూరి నడిపించిన ఈ కథ మాస్ ఆడియన్స్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అయిందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
 
కథలోకి వెళితే .. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన శంకర్, చిన్నప్పటి నుంచి 'కాకా' అనే ఒక రౌడీ షీటర్ దగ్గర పెరుగుతాడు. ఒక ఖరీదైన ఫ్లాట్ తీసుకుని నచ్చిన అమ్మయితో అందులో కాపురం పెట్టేయాలన్నది శంకర్ కోరిక. అలా హ్యాపీగా లైఫ్ సెటిలైపోవాలంటే ఒక మర్డర్ చేయవలసి ఉంటుందని 'కాకా' చెబితే ఆశపడిపోయి, బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కాశీ విశ్వనాథ్ (పునీత్ ఇస్సార్) ను హత్య చేస్తాడు. కొన్నాళ్లపాటు ఎవరికంటా పడకూడదనే ఉద్దేశంతో తను మనసుపడిన చాందిని(నభా నటేశ్)ని తీసుకుని 'గోవా'కి వెళతాడు.

ఈ హత్య కేసును సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఆయన డాక్టర్ సారా (నిధి అగర్వాల్) ప్రేమలో ఉంటాడు. ఒక వైపున కాశీ విశ్వనాథ్ మనుషులు, మరో వైపున అరుణ్ సహచరులు శంకర్ కోసం గాలిస్తుంటారు. ఈ కేసుకి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకున్న సీబీఐ ఆఫీసర్ అరుణ్ ఉన్నట్టుండి హత్యకి గురవుతాడు. ఆ సమయంలో అక్కడే వున్న శంకర్ కూడా గాయాలపాలై, అరుణ్ డెడ్ బాడీని ఉంచిన హాస్పిటల్ కి చేర్చబడతాడు. కాశీ విశ్వనాథ్ హత్య కేసులో అరుణ్ మెమరీ డిపార్టుమెంట్ కి అవసరమనీ, శంకర్ కి అరుణ్ మెమరీని ట్రాన్స్ ఫర్ చేయమని సీబీఐ అధికారి కోరడంతో, డాక్టర్ సారా ఆ పనిని పూర్తిచేస్తుంది. పర్యవసానంగా చోటుచేసుకునే ఆసక్తికరమైన పరిణామాలతో కథ ముందుకు వెళుతుంది.

మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కథలను రాసుకోవడంలో .. ఆ కథలను తనదైన స్టైల్లో తెరపై ఆవిష్కరించడంలో పూరి సిద్ధహస్తుడు. చాలా తక్కువ సమయంలోనే సినిమాలను పూర్తిచేసే పూరి, ఈ సారి మాత్రం 'ఇస్మార్ట్ శంకర్' కోసం కాస్త ఎక్కువ సమయాన్నే కేటాయించాడు. కథపై ఆయన కొంత శ్రద్ధ పెట్టినట్టుగా ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సారి కొత్త కాన్సెప్ట్ ను ఎంచుకున్న ఆయన, ఫస్టాఫ్ వరకూ చాలా ఆసక్తికరంగా .. వేగంగా కథనాన్ని నడిపించాడు. సెకండాఫ్ లో హడావిడి ఎక్కువైపోయి అసలు కథ పలచబడింది.
 
తెలంగాణ యాస మాట్లాడే మాస్ ఏరియా కుర్రాడిగా రామ్ పాత్రను పూరి చాలా బాగా తీర్చిదిద్దాడు. కానీ కథానాయికల పాత్రల విషయంలో ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టినట్టుగా కనిపించదు. ముఖ్యంగా కథానాయకుడిని ఎదుర్కొనే బలమైన ప్రతినాయకుడి పాత్రను మలిచే ఆలోచన చేయడంలో ఈ సారి ఆయన విఫలమయ్యాడు. కాశీ విశ్వనాథ్ కొడుకుకి .. బావమరిదికి సంబంధించి పూరి మెయింటేన్ చేయాలనుకున్న సస్పెన్స్ వలన కొంత క్లారిటీ లోపించి అయోమయాన్ని కలిగిస్తుంది. రామ్ - నభా నటేశ్ కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ విషయంలోను, సంభాషణల విషయంలోను .. చేజింగ్స్ విషయంలోను పూరి తన మార్క్ చూపించాడు. ఈ సారి మాత్రం మోతాదుకు మించిన సంభాషణలు .. యాక్షన్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ను కొంత ఇబ్బంది పెట్టేలా అనిపిస్తాయి.

ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ చాలా బాగా చేశాడు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ .. ఇలా అన్ని సీన్స్ లోను ఆయన ఒదిగిపోయాడు. ముఖ్యంగా డాన్స్ .. ఫైట్స్ విషయంలో ఆయన ఎంతో ఎనర్జీని కనబరిచాడు. 'దీనమ్మా' అనే ఊతపదాన్ని ఉపయోగిస్తూ తెలంగాణా యాసలో డైలాగ్స్ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. శంకర్ లవర్ గా నభా నటేశ్ తెరపై సందడి చేసింది. గ్లామర్ పరంగా నభా నటేశ్ కి మంచి మార్కులే పడతాయిగానీ, ఆమె లుక్ కి .. బాడీ లాంగ్వేజ్ కి తెలంగాణ యాసలో డైలాగ్స్ అతకలేదు. నిధి అగర్వాల్ విషయానికొస్తే, షోకేస్ లో అందమైన బొమ్మలా కనిపిస్తుందేగానీ, ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ లేవు. సీబీఐ ఆఫీసర్ పాత్రకి సత్యదేవ్ న్యాయం చేశాడు. ఇక పునీత్ ఇస్సార్ .. ఆశిష్ విద్యార్థి .. సాయాజీ షిండే .. తులసి వంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేదు. దాంతో వాళ్లు చేయడానికి అక్కడ విషయమేమీ లేదు.

మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. టైటిల్ సాంగ్, 'జిందాబాద్ .. జిందాబాద్',  'అమ్మలగన్న అమ్మరా' .. 'సిలక సిలక సిలక' పాటలు మాంఛి ఊపుతో .. ఉత్సాహంగా కొనసాగాయి. 'ఉండిపో ఉండిపో చేతిలో గీతలా' అనే మెలోడీ సాంగ్ మనసుకు హత్తుకుపోతుంది. భాస్కర భట్ల - కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మాస్ ఆడియన్స్ కి అర్ధమయ్యే తేలికైన పదాలతో సందర్భంలో ఒదిగిపోయి కనిపిస్తుంది. రాజ్ తోట ఫొటో గ్రఫీ బాగుంది. ముఖ్యంగా సాంగ్స్ ను .. అందునా రొమాంటిక్ సాంగ్స్ ను ఆయన తెరపై అందంగా ఆవిష్కరించాడు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే జునైద్ సిద్ధిఖీ కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ తో సహా మిగతా యాక్షన్ సీన్స్ నిడివిని తగ్గించాల్సింది.

రామ్ పాత్రపైనే పూరి పూర్తి ఫోకస్ పెట్టేసి మిగతా పాత్రలను పెద్దగా పట్టించుకోకపోవడం, పెద్ద ఆర్టిస్టులను తీసుకుని కూడా వాళ్ల పాత్రలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం .. పూరి స్థాయి దర్శకుడు తయారు చేసుకున్న కథలో ఆశించిన స్థాయి ట్విస్టులు లేకపోవడం .. ప్రతినాయకుడి వ్యూహానికి సంబంధించిన క్లారిటీ లేకపోవడం .. ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించే విషయాలుగా కనిపిస్తాయి. కామెడీకి అవకాశం లేకపోవడంతో, ఆ వెలితిని రామ్ తో చెప్పించే తెలంగాణ యాస డైలాగ్స్ తో భర్తీ చేయడంలో పూరి సక్సెస్ అయ్యాడు. ఇక పాటలు .. ఫైట్ల విషయంలో మాస్ ఆడియన్స్ ను అలరించడానికి చేసిన ప్రయత్నంలోను ఆయన సఫలీకృతుడయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూరి మార్క్ సినిమా. ఆయన సినిమాలను ఇష్టపడే మాస్ ఆడియన్స్ కి నచ్చచ్చు.  

More Reviews