'బఘీర' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Bagheera

Bagheera Review

  • అక్టోబర్ 31న విడుదలైన సినిమా 
  • ఈ నెల 21 నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • నిర్మాణం పరంగా తగ్గని భారీతనం
  • ఆకట్టుకునే యాక్షన్ దృశ్యాలు 
  • లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ సైడ్ వీక్  

సూపర్ హీరో కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు అడపాదడపా మాత్రమే తెరపైకి వస్తుంటాయి. అలాంటి జోనర్లో కన్నడలో రూపొందిన సినిమానే 'బఘీర'. శ్రీ మురళి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి సూరి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 31న వివిధ భాషల్లో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: వేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచి అద్భుతమైన శక్తులను కలిగిన సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. తనని తాను సూపర్ హీరోగా ఊహించుకుని గాయపడతాడు కూడా. అసాధారణమైన పనులు చేసేవారు మాత్రమే కాదు, ఇతరులను కాపాడే ప్రతి ఒక్కరూ సూపర్ హీరోనే అని తల్లి చెబుతుంది. ఇతరులకు సాయపడాలనే ఉద్దేశంతోనే అతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు. స్నేహ ( రుక్మిణి వసంత్) అనే డాక్టర్ అతణ్ణి ప్రేమిస్తూ ఉంటుంది. కానీ అతని దృష్టి తన కర్తవ్యంపై ఉంటుంది.    

తల్లి కోరిక మేరకు తాను సిన్సియర్ గా పనిచేయాలని వేదాంత్ నిర్ణయించుకుంటాడు. మంగుళూరులో అతని ఫస్టు పోస్టింగ్. అక్కడి పోలీస్ స్టేషన్ లో నారాయణ (రంగాయన రఘు)సహా అంతా అవినీతిపరులే. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోని పనులన్నీ కూడా పూజారి కనుసైగలతో నడుస్తూ ఉంటాయి. అక్రమ ఆయుధాల నుంచి అమ్మాయిలు - అబ్బాయిల రవాణా వరకూ అంతా సైలెంటుగా జరిగిపోతూ ఉంటుంది.      

ఆ ఊళ్లోకి అడుగుపెడుతూనే అక్కడి ఆగడాలపై వేదాంత్ దృష్టి పెడతాడు. పూజారి పేరు చెబితేనే  భయపడే పరిస్థితుల్లో వేదాంత్ నేరుగా వెళ్లి అతనిని అరెస్టు చేసి తీసుకుని వచ్చి సెల్లో వేస్తాడు. పూజారి అనుచరులకి బుద్ధి చెబుతాడు. దాంతో పై అధికారులలో అలజడి మొదలవుతుంది. వెంటనే పూజారిని విడుదల చేయమని వేదాంత్ ను మందలిస్తారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతను అలాగే చేస్తాడు. 

పూజారి ఓ పరమ కిరాతకుడు .. అతని పై వరుసలో యోగి .. వారిపై రాణా ఉంటాడు. రాణా ఎలా ఉంటాడనేది ఎవరికీ తెలియదు. అతని కారణంగా ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశమవుతున్నాయని వేదాంత్ తెలుసుకుంటాడు. ఈ పరిస్థితిని ఒక పోలీస్ ఆఫీసర్ గా తాను చక్కదిద్దలేనని భావిస్తాడు. అందుకోసం అతను 'బఘీర'గా మారతాడు. 'బఘీర'గా అతను ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? అనుకున్నది సాధించడంలో ఎంతవరకూ సక్సెస్ అవుతాడు? అనేది మిగతా కథ.    

విశ్లేషణ: సమాజంలో ఎంతోమంది నిస్సహాయులు ఉన్నారు. వాళ్లను ఆదుకోవడానికి తన తల్లి చెప్పినట్టుగా తాను పోలీస్ ఆఫీసర్ కావాలని హీరో భావిస్తాడు. అయితే డ్యూటీలో చేరిన తరువాత అతనికి చాలా విషయాలు అర్థమవుతాయి. ఎవరి వలన ఈ సమాజానికి ఎలాంటి ముప్పు కలుగుతుందనేది హీరోకి అర్థమవుతుంది. కానీ అలాంటి వారిని తనపై అధికారులు రక్షిస్తూ రావడాన్ని అతను జీర్ణించుకోలేకపోవడం ఫస్టాఫ్ గా వస్తుంది. 

తాను అనుకున్నది పోలీస్ యూనిఫామ్ లో సాధించలేనని భావించిన హీరో, తాను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సూపర్ హీరోగా మారాలనుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనేది సెకండాఫ్ గా పలకరిస్తుంది. ఈ కథలో హీరో ఇటు పోలీస్ ఆఫీసర్ గా .. అటు బఘీరగా రెండు కోణాలలో కనిపిస్తాడు. దర్శకుడు ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. అలాగే అంచలంచెలుగా ఉన్న విలన్స్ ను పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. 

ఈ కథలో సమస్య - పరిష్కారం అన్నట్టుగా, వరుసగా బఘీర తన పనులను చక్కబెడుతూ వెళతాడు. ఆ నేపథ్యంలోనే వచ్చే యాక్షన్స్ దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఈ యాక్షన్ సన్నివేశాలకు అవసరమైన ఎమోషన్స్ కాస్త బలహీనంగా అనిపిస్తాయి. ఇదే సమయంలో హీరోయిన్ వైపు నుంచి లవ్ .. రొమాన్స్ విషయంలో కూడా దర్శకుడు పెద్దగా దృష్టిపెట్టలేదని అనిపిస్తుంది.

బఘీరగా హీరో రంగంలోకి దిగడం .. అతణ్ణి ఎదుర్కోవడానికి గరుడ రామ్ తన అనుచరులను బరిలోకి దింపడం వంటి రొటీన్ సన్నివేశాలతో బోర్ కొడుతుందేమో అనుకుంటాము. ఈ  సమయంలో బఘీరను పట్టుకోవడానికి సీబీఐ ఆఫీసర్ గా ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇవ్వడంతో, కథ కాస్త పుంజుకుంటుంది. అయితే ఆ తరువాత వచ్చే సీన్స్ కూడా ఇంతకుముందు సినిమాలలో మనం చూసినవే కావడం ఇక్కడ మైనస్.

పనితీరు: శ్రీమురళి తాను పోషించిన రెండు పాత్రలకు న్యాయం చేశాడు. ఆ పాత్రకి తగిన ఫిట్ నెస్ విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది. రుక్మిణి వసంత్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు .. ఉన్న కాసేపు కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. విలన్ గా గరుడ రామ్ బాగా చేశాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. ఇక సీబీఐ ఆఫీసర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. గతంలో 'అతడు'లో ఆయన పోషించిన సీబీఐ ఆఫీసర్ పాత్ర మనకి గుర్తొస్తుంది.   

హీరో - విలన్ - సీబీఐ ఆఫీసర్ .. ఈ మూడు ప్రధానమైన పాత్రలను దర్శకుడు డిజైన్ చేసిన తీరు మంచి మార్కులు కొట్టిస్తుంది. అయితే కంటెంట్ రొటీన్ గా కనిపించకుండా చేయలేకపోయారు. నిర్మాణ పరమైన విలువలు బాగున్నాయి. ఇది పూర్తిగా యాక్షన్ ప్రధానంగా సాగే సినిమా కావడం వలన, యాక్షన్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తాయి.

అర్జున్ శెట్టి ఫొటోగ్రఫీ బాగుంది. అలాగే కథకి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడంలో అజనీష్ లోక్ నాథ్ సక్సెస్ అయ్యాడు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. కేజీఎఫ్ - సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి కథను అందించడం విశేషం. కథా పరంగా ఆ భారీతనం కనిపిస్తుంది. కాకపోతే గతంలో వచ్చిన సినిమాల ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది. 

Movie Name: Bagheera

Release Date: 2024-11-21
Cast: Sri Murali, Rukmini Vasanth, Prakash Raj, Achyuth Kumar, Ramachandra Raju, Rangayana Raghu
Director: Suri
Music: Ajaneesh Loknath
Banner: Hombale Films

Bagheera Rating: 2.75 out of 5

Trailer

More Reviews