Sarfaraz Khan: నెట్స్‌లో బంతుల సేకరణకు పరిమితమైన సర్ఫరాజ్ ఖాన్.. ఫొటోలు వైరల్

Sarfaraz Khan was seen sitting behind the nets to collect the balls and Pics gone Viral

  • నెట్స్‌లో ప్రాక్టీస్ చేయకుండా కూర్చుండిపోయిన యువ ఆటగాడు
  • సానుభూతి చూపుతున్న నెటిజన్లు
  • ఓ జర్నలిస్ట్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా బుధవారమే బ్రిస్బేన్ చేరుకుంది. అక్కడికి చేరుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. డిసెంబర్ 14 నుంచి జరగనున్న ఈ టెస్ట్ కోసం ఏమాత్రం సమయాన్ని వృథా చేయకుండా టీమిండియా కసరత్తు ప్రారంభించింది.

కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్లు గురువారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా నెట్స్‌లో ఉన్నాడు. కానీ బంతులను తిరిగి సేకరించే పనికి మాత్రమే అతడు పరిమితమయ్యాడు. ఈ మేరకు సర్ఫరాజ్ ఖాన్ నెట్స్‌‌లో కూర్చొని ఉన్న ఫొటోలను భరత్ సుందరేషన్ అనే ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైరల్‌గా మారాయి. 

బంతులను సేకరించడానికి నెట్స్ వెనుక సర్ఫరాజ్ కూర్చొని ఉండడం ఫొటోల్లో కనిపించింది. ఈ సిరీస్‌లో ఆడేందుకు అర్హత ఉన్న ఆటగాడని భావించామని, కానీ ఇలా బంతులు అందించే స్థితిలో ఉన్నాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతడి పట్ల సానుభూతి చూపుతూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, సర్ఫరాజ్‌కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ విదేశాల్లో అతడు ఇంకా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైనప్పటికీ ఇంతవరకు అవకాశం దక్కలేదు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం కూడా ఇంతవరకు కనిపించలేదు. పెర్త్ టెస్టులో రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో వారి స్థానాల్లో ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. కాగా, సర్ఫరాజ్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్‌లో 6 మ్యాచ్‌లు ఆడాడు. 37 సగటుతో 371 పరుగులు సాధించాడు.

  • Loading...

More Telugu News