AR Rahman: ప్లీజ్.. పుకార్లు ఆపండి: రెహమాన్ కుమార్తె ఖతీజా

AR Rahmans Daughter Reveals If Composer Will Take A Career Break After Separation

  • సంగీతానికి రెహమాన్ కొంతకాలం దూరంగా ఉంటారని ప్రచారం
  • భార్యతో విడాకుల తర్వాత రెహమాన్ పై పుకార్లు
  • ఇన్ స్టాలో స్పందించిన ఖతీజా

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొంతకాలం సంగీతానికి దూరంగా ఉండనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన కూతురు ఖతీజా రెహమాన్ తాజాగా స్పందించారు. తన తండ్రి కెరీర్ విషయంలో జరుగుతున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం దయచేసి మానుకోవాలంటూ ఇన్ స్టా వేదికగా ఖతీజా అభ్యర్థించారు. ఈ విషయంపై ఇటీవలే తాను ట్విట్టర్ లో వివరణ ఇచ్చానని, అయినా పుకార్లు ఆగడంలేదని వాపోయారు. ఈ సందర్భంగా తన తండ్రి విషయంలో నిరాధార వార్తలు, కథనాలు ప్రసారం చేయొద్దంటూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్టు సంబంధిత వార్తను ప్రచురించిన ఓ మీడియాను కోట్ చేస్తూ ఖతీజా వివరణ ఇచ్చారు.

తాను విడాకులు తీసుకుంటున్నట్లు రెహమాన్ ఇటీవలే ప్రకటించారు. అదేరోజు రెహమాన్ బృందంలోని ఓ మహిళ కూడా తన భర్తతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో రెహమాన్ పై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రచారాన్ని సదరు మహిళ కొట్టిపారేశారు. ఆ తర్వాత రెహమాన్ తన కెరీర్ లో కొంత బ్రేక్ తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఖతీజా తాజాగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాంచరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారని గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News