Sambhal: పోలీసులను మెచ్చుకుందని భార్యకు తలాఖ్ చెప్పిన భర్త.. యూపీలో ఘటన
- సంభాల్ లో మసీదు సర్వే విషయంలో చెలరేగిన అల్లర్లు
- లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
- పోలీసుల చర్యలను సమర్థించిన భార్యపై మండిపడ్డ భర్త
ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో మసీదు సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి జరగడం, అదికాస్తా అల్లర్లకు దారితీయడం తెలిసిందే. అల్లరి మూకలను నియంత్రించేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 29 మంది పోలీసులకు గాయాలు కాగా నలుగురు నిరసనకారులు చనిపోవడంతో సంభాల్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, ఈ అల్లర్లు ఓ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. ఈ విషయంలో పోలీసులు చేసిన పని సరైందేనని, తమను తాము కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్న భార్యకు ఓ భర్త విడాకులు ఇచ్చాడు. అప్పటికప్పుడు మూడుసార్లు తలాఖ్ చెప్పి, నీకూనాకు సంబంధంలేదని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
మొరాదాబాద్ కు చెందిన నిదా యూట్యూబ్ లో సంభాల్ గొడవలకు సంబంధించిన వీడియో ఒకటి చూస్తుండగా ఆమె భర్త అడ్డుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. వాస్తవానికి తాను సంభాల్ లో జరిగే ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉందని, అలాగే అక్కడ తనకు వ్యక్తిగతమైన పని కూడా ఉందని నిదా చెప్పింది. ఈ నేపథ్యంలోనే సంభాల్ వెళ్లడం మంచిదేనా, అక్కడ పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలుసుకోవడానికే ఆ వీడియో చూశానని నిదా వివరించింది.
భర్త మాత్రం తాను పోలీసులను సమర్థిస్తున్నానని కోపంతో మండిపడ్డాడని తెలిపింది. రాళ్లు విసురుతున్న అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడం కరెక్టేనని తాను వాదించినట్లు చెప్పింది. ఎవరైనా సరే తమను తాము కాపాడుకునే హక్కు ఉంటుందని చెప్పగా.. తాను అసలు ముస్లింనే కాదని, తనతో బంధం తెంచుకుంటున్నానని అంటూ భర్త తలాఖ్ చెప్పాడని ఆరోపించింది. కాగా, ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమని మోదీ ప్రభుత్వం దానిని 2019 లో నిషేధించింది. ఈ నేపథ్యంలో బాధితురాలు నిదా ఫిర్యాదుతో ఆమె భర్తపై కేసు నమోదు చేసినట్లు మొరాదాబాద్ పోలీసులు తెలిపారు.