Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నిలిపేయండి: హైకోర్టులో పిటిషన్
- ఎల్లుండి సచివాలయ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ
- విగ్రహం రూపు మార్చడంపై పిటిషనర్ అభ్యంతరం
- తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్న పిటిషనర్
సచివాలయంలో ఈ నెల 9న జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎల్లుండి జరగనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ జూలూరి గౌరీశంకర్ ఆ పిటిషన్‌లో హైకోర్టును కోరారు.
తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం రూపు మార్చడం ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా మార్చకుండా చూడాలని కోరారు.
గౌరీశంకర్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. కాగా, సచివాలయం ప్రాంగణంలో ఈ నెల 9న కొత్తగా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం ప్రతిపక్ష నేత, కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించింది.