Padma Kasturirangan: అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ గా పద్మ కస్తూరిరంగన్
- రెండేళ్ల కిందట ప్రైమ్ వీడియోలో చేరిన పద్మ కస్తూరిరంగన్
- సంస్థ ఎదుగుదలలో ముఖ్యపాత్ర
- కీలక బాధ్యతలు అప్పగించిన అమెజాన్ ప్రైమ్ వీడియో యాజమాన్యం
ప్రముఖ ఓటీటీ వేదికల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా పద్మ కస్తూరిరంగన్ నియమితులయ్యారు. పద్మ కస్తూరిరంగన్ రెండేళ్ల కిందట ప్రైమ్ వీడియోలో చేరారు. తన ప్రతిభ, కష్టించే గుణాలతో తాజాగా ఉన్నత పదవిని దక్కించుకున్నారు.
అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్స్ చేసిన ఆమె... ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ తో చేయి కలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఫిల్మ్ స్కూల్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఆపై, తమాడా మీడియాలోనూ హెడ్ గా అనేక ప్రోగ్రామ్స్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కొద్దికాలం పాటు జీ5 ఓటీటీలో పనిచేసిన పద్మ కస్తూరిరంగన్ ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంటరయ్యారు. అక్కడ్నించి ప్రైమ్ వీడియోకు కొత్త రూపు కల్పించడంలో విశేష కృషి చేశారు.
పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లతో ప్రైమ్ వీడియోను ప్రజలకు చేరువ చేయడంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ప్రారంభమైన ది రానా దగ్గుబాటి షో కూడా పద్మ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే.
తనను సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ గా నియమించడం పట్ల పద్మ కస్తూరి రంగన్ స్పందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సరికొత్త పంథాలో ప్రేక్షకులను అలరించేందుకు, ప్రైమ్ వీడియోను ఉన్నత స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిలిపేందుకు ఇకపైనా శ్రమిస్తానని పేర్కొన్నారు.
భవిష్యత్తులో తమ నుంచి సూపర్ థ్రిల్లింగ్ సిరీస్ లు, కార్యక్రమాలు వస్తాయని... బలమైన కథలు, మరపురాని పాత్రలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తామని పద్మ వెల్లడించారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన నిఖిల్ మధోక్, గౌరవ్ గాంధీ, జేమ్స్ ఫారెల్ లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆమె వివరించారు.