Sri Lanka U19 vs India U19: అండర్-19 ఆసియా కప్... సెమీ ఫైనల్‌లో టీమిండియా టార్గెట్ 174 రన్స్
- షార్జా వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో సెమీస్
- మొదట బ్యాటింగ్ చేసి 46.2 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైన లంకేయులు
- 3 వికెట్లతో రాణించిన చేతన్ శర్మ
- లక్ష్యఛేదనలో భారత ఓపెనర్ల దూకుడు
అండర్-19 ఆసియా కప్ రెండో సెమీ ఫైనల్‌లో షార్జా వేదికగా భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్‌కు 174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
లంక బ్యాటర్లలో లక్విన్ హాఫ్ సెంచరీ (69)తో రాణించగా... షారుజన్ 42 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ప్రారంభంలో 8 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టును ఈ ద్వయం 93 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకుంది.
కానీ, షారుజన్ ఔటైన తర్వాత మళ్లీ లంక వరుస విరామాల్లో వికెట్లు పారేసుకుని చివరికి 173 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. భారత బౌలర్లలో చేతన్ శర్మ 3 వికెట్లు తీయగా... కిరణ్ 2, ఆయూశ్ 2, గుహా, హార్దిక్ రాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 174 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన యువ భారత్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. దీంతో భారత్ 8 ఓవర్లలోనే 87 పరుగులు చేసింది. సూర్యవంశీ 23 బంతుల్లోనే 44 పరుగులు చేస్తే, ఆయూశ్ 25 బంతుల్లో 30 రన్స్ చేశాడు.