TS High Court: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అంశంలో హైకోర్టు కీలక ఆదేశాలు
- భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై నివేదిక కోరిన హైకోర్టు
- ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసిందన్న ఏఏజీ
- నాణ్యమైన భోజనం కోసం నిధులను 40 శాతం పెంచినట్లు చెప్పిన ఏఏజీ
పాఠశాల్లలో విద్యార్థులకు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంశంపై పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
భోజనం వికటించిన ఘటనల్లో ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసిందని ఏఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ ఘటనల్లో బాధ్యులైన వారిని ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నాణ్యమైన భోజనం అందించేందుకు ఏజెన్సీలకు చెల్లించే నిధులను 40 శాతం పెంచినట్లు తెలిపారు.
పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఉండాలని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ కమిటీలు సరిగ్గా పని చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.