Team India: ఆసీస్ పీఎం ఎలెవన్ తో ప్రాక్టీస్ మ్యాచ్... తొలి రోజు టీమిండియాదే పైచేయి
- డిసెంబరు 6 నుంచి భారత్-ఆసీస్ పింక్ బాల్ టెస్టు
- సన్నాహకంగా నేటి నుంచి రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్
- ఆసీస్ పీఎం ఎలెవన్ జట్టుపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. నవంబరు 22న ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియానే విజేతగా నిలిచింది. టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది. అయితే, ఈ టెస్టు డే/నైట్ విధానంలో పింక్ బాల్ తో జరగనుంది. అందుకోసం టీమిండియా... ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది.
కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ లో నేడు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలిరోజున టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన పీఎం ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. యువ బౌలర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటాడు. ఆకాశ్ దీప్ 2, సిరాజ్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, వాషింగ్టన్ సుందర్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్ జట్టులో ఓపెనర్ శామ్ కోన్ స్టాస్ (107) సెంచరీతో రాణించాడు. మిడిలార్డర్ లో జాక్ క్లేటన్ 40 పరుగులు చేయగా... లోయరార్డర్ లో హన్నో జాకబ్స్ 61 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 25 (రిటైర్డ్ హర్ట్), శుభ్ మాన్ గిల్ 50 (రిటైర్డ్ హర్ట్) తో ఆకట్టుకున్నారు. ఇక, తెలుగుతేజం నితీశ్ రెడ్డి తన బ్యాటింగ్ విన్యాసాలతో మరోసారి అలరించాడు. వైట్ బాల్ క్రికెట్ తరహాలో ఆడిన నితీశ్ రెడ్డి 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 42 పరుగులు సాధించాడు.
వాషింగ్టన్ సుందర్ 36 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. జడేజా 27 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్ బౌలర్లలో చార్లీ ఆండర్సన్ 2, లాయిడ్ పోప్ 1, మాట్ రెన్షా 1, జాక్ క్లేటన్ 1 వికెట్ తీశారు.